నాగసముద్రంలో శ్రీధర్ అనే పిల్లవాడు ఒకడు ఉండేవాడు. వాడు చిన్నప్పట్నుంచి ఆటల్లోను, చదువుల్లోనూ అంతటా వెనకబడి ఉండేవాడు. కొంచెం మెల్లగా ఉండే అతన్ని తమతోబాటు ఆడనిచ్చేందుకు ఎవరికీ ఇష్టం ఉండేది కాదు. శ్రీధర్ కూడా వాళ్లని పట్టించుకునేవాడు కాదు. ఏమంత బాధపడేవాడు కాదు.
అయితే వాడు ఇంటి పనులు కూడా ఏమంత బాగా చేయలేకపోయేవాడు. దాంతో తల్లిదండ్రులు వాడిని ఎప్పుడూ 'చేతకానివాడా! ఎందుకురా, మాకు తప్ప పుట్టావు?! పనికిమాలిన వాడా!' అని తిడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ తిట్లు మటుకు శ్రీధర్‌ని బాగా కలవర పెట్టేవి. వాడు మరింత ముడుచుకుపోయేవాడు. ఎప్పుడూ, ఎవ్వరితోటీ కలవకుండా ఒంటరిగా ఉండే శ్రీధర్‌ని అందరూ ఇంకా ఏడిపించేవాళ్ళు.
తొమ్మిదో తరగతి వరకూ ఎవ్వరినీ డిటెయిన్ చేయరు కదా, అట్లా శ్రీధర్ తొమ్మిదో తరగతికి వచ్చాడు. ఆ సంవత్సరం వాళ్ళకు క్రొత్త సైన్సు సార్ వచ్చారు.
ఒకరోజున ఆయన తన తరగతిలోని పిల్లలకు సైన్సు బొమ్మల పోటీ పెట్టారు. అందరూ మూడు నాలుగు బొమ్మలు గీయగా, శ్రీధర్ మాత్రం ఒకే బొమ్మ గీయగలిగాడు.
ఆ బొమ్మ కూడా నిజానికి ఏమంత బాగా రాలేదు. అయితే శ్రీధర్ మనసు పెట్టి గీసిన ఆ బొమ్మలో అతను పడిన కష్టం మటుకు స్పష్టంగా తెలుస్తూ ఉండింది. మిగిలిన పిల్లలు గీసిన బొమ్మల్ని తన ఎర్ర పెన్నుతో దిద్ది, సవరించి, బాలేదని తిట్టిన సైన్సు సార్ శ్రీధర్ బొమ్మని మటుకు చాలా మెచ్చుకున్నారు: "శ్రీధర్, నువ్వు చాలా బాగా గీశావు! నీకు ఏమీ రాదని, నీకేమీ చేతకాదని అనుకున్నాం. బొమ్మని నిజంగా చాలా చక్కగా గీశావు. నీ గీత చాలా సాఫీగా ఉంది. సాధన చేసావంటే మరింత చక్కని బొమ్మలు వేయగల్గుతావు! కీపిటప్!" అన్నారు.
అన్నేళ్ల చదువులో ఏనాడూ చిరునవ్వు కనబడని శ్రీధర్ ముఖంలో ఆరోజున మొదటిసారి చిరునవ్వు మెరిసింది.
తను గీసిన బొమ్మ ఏమంత బాగా లేదని శ్రీధర్‌కి తెలుసు. అయినా సార్ తనని తిట్టకపోవటం, పైగా మెచ్చుకోవటం వాడికి చాలా నచ్చింది. "నేను బొమ్మని అంత బాగా గీయకపోయినా సార్ నన్ను మెచ్చుకున్నాడే, ఇక మరి నేను గనక బొమ్మని బాగా గీస్తే మరెంత మెచ్చుకుంటాడో!" అనే ఒక వింత స్ఫూర్తి ఒకటి శ్రీధర్‌లో కలిగింది.
ఆరోజు ఇంటికి రాగానే "నేను సైన్సు పుస్తకంలో ఉండే బొమ్మలన్నీ బాగా వేయాలి!" అని బొమ్మల ప్రాక్టీస్ మొదలుపెట్టాడు శ్రీధర్. వాడి ఉత్సాహాన్ని గమనించిన సైన్సు సార్ హోంవర్కులో భాగంగా ప్రతిరోజూ కనీసం ఒక బొమ్మనైనా గీయమనసాగారు .
శ్రీధర్ ఆ బొమ్మతోబాటు మరిన్ని బొమ్మలు గీసుకొచ్చేవాడు. రాను రాను శ్రీధర్ బొమ్మలు చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు శ్రీధర్ సమయాన్ని అస్సలు వృధా చేయట్లేదు. ఏ బొమ్మని చూస్తే దాన్ని నోటుపుస్తకాల్లోకి దించటం మొదలు పెట్టాడు. కొన్ని రోజులకు వాడి పుస్తకాలనిండా ఎక్కడ చూసినా బొమ్మలు కనిపించసాగాయి. మెల్లగా అతని చేతి రాత కూడా మారింది! సైన్సు సార్ ఓసారి "ఇరవై సైన్సు బొమ్మల పోటీ" పెట్టారు. ఆ పోటీలో అందరికంటే చక్కగా బొమ్మలు గీసింది శ్రీధరే! అటుపైన తరగతిలో ఎవరికైనా చక్కని బొమ్మ కావల్సి వస్తే "శ్రీధర్‌ని అడుగుదాం" అనటం మొదలు పెట్టారు.
అంతవరకూ 'పనికి రానివాడు''ఏమీ చేతకానివాడు'గా ఉన్న శ్రీధర్ చాలా మంచిమార్కులతో పదో తరగతి పాస్ అయ్యాడు. బొమ్మలు గీయటంతో మొదలైన మలుపు అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది.
కాలేజీలో చేరిన తర్వాత శ్రీధర్ చిన్న చిన్నగా మనుషుల బొమ్మలు గీయడం సాధన చేశాడు. ఒక్కసారి మనిషి ముఖాన్ని చూస్తే చాలు- బొమ్మ గీయగలిగేవాడతను!
అతనిలోని ప్రతిభను త్వరలోనే అందరూ గుర్తించారు. పెద్దయ్యేసరికి అతనొక గొప్ప చిత్రకారుడిగా పేరు పొందాడు.
తర్వాత చాలా ఏళ్ళకు సైన్సు సార్‌ని వెతుక్కుంటూ వెళ్ళాడు శ్రీధర్. సైన్సు సార్ అతన్ని నవ్వుతూ పలకరించారు. శ్రీధర్ చకచకా ఆయన బొమ్మని గీసి ఆయనకు బహుమానంగా ఇస్తూ అడిగాడు:
"సార్! అప్పట్లో నేను బొమ్మని ఏమంత బాగా వేయలేదు.. ఆ సంగతి నాకూ తెలుసు, మీకూ తెలుసు. అయినా మీరు నన్ను మెచ్చుకున్నారు. బొమ్మ బలే ఉందన్నారు- ఎందుకు?!" అని.
"పిల్లల్లో పనికిరానివాళ్లంటూ ఎవ్వరూ ఉండరురా. ప్రతి ఒక్కరిలోనూ వాళ్లదైన ప్రతిభ ఒకటి ఉంటుంది. పిల్లల్లో దాగిఉన్న సామర్ధ్యాలని ఉపాధ్యాయుడు గుర్తించి, మెచ్చుకుంటే, పిల్లల్లోని ఆయా అంశాలు వికసించటం మొదలుపెడతాయి.
ఉపాధ్యాయుడు చేయాల్సింది నిరాశ-పరచటమూ, చిన్నబుచ్చటమూ కాదు- పిల్లలకు స్ఫూర్తినివ్వటమూ, వాళ్లలో ఉత్సాహాన్ని నింపటమూనూ. ఇంతకీ నేను నిన్ను మెచ్చుకోవటం వల్ల నీకు మేలు జరిగిందా, లేదా?!" అని నవ్వారు సైన్సు సార్.
ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. అది సమయాన్ని బట్టి బయటికి వస్తుంది. అందుకే ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు.