హరితపురం హైస్కూల్ లో ఆ రోజు ప్రార్థనా సమావేశం జరుగుతున్నది. హెడ్‌మాస్టర్ గారు మాట్లాడుతూ, "పిల్లలూ! ఈ రోజు పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం పాఠశాల చుట్టూ మొక్కలు నాటాలి.

నేటి మొక్కలే రేపటి చెట్లు. చెట్లు మనకు ప్రాణాధారం. చెట్లు లేకుంటే మనం లేము. చెట్లు మనకు అనేక విధాలుగా‌ ఉపయోగపడుతున్నాయి. ఆ విషయం మీరు పుస్తకాలలో చదువుకొని ఉంటారు. మీ మీ తరగతి ఉపాధ్యాయులు మిమ్ములను గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపు కూడా ఒక మొక్కను దత్తత తీసుకోవాలి. కంచె వేసుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పక నీరు పోస్తుండాలి. వాటిని నిరంతరం రక్షిస్తూ ఉండాలి. కంచెకు ఒకవైపు మీ గ్రూపు పేర్లతో ఒక అట్టముక్క కట్టండి. బాగా శ్రద్ధగా మొక్కను పెంచే గ్రూపుకు చక్కని బహుమతి కూడా ఉంటుంది" అంటూ ఆనాటి ప్రత్యేకతను తెలియజేసారు.

ప్రార్థన ముగిసింది. పిల్లలంతా తరగతి గదులలోకి వెళ్లారు. ఏడవ తరగతి లావణ్య తరగతి గదికి వెళ్లగానే, "గోవిందా! గోవిందా! ఈ రోజు బడిలో పాఠాలు గోవిందా!" అంది.

వెంటనే ప్రక్కనున్న అనిత, "ఏమైందే? ఏమిటా కేకలు?" అడిగింది.

"బడిలో మొక్కలు నాటాలన్నారుగా! హెచ్.ఎం.గారు!"

"అవును, చెట్ల వలన చాలా ఉపయోగాలున్నాయని చెప్పారు గదా!" అంది సుధ.

"ఉపయోగాలూ...? గాడిద గుడ్డేం కాదూ?!" చేతితో గుడ్డు ఆకారం చూపిస్తూ అంది లావణ్య. లావణ్య ఆ ఊరి సర్పంచి గారి కూతురు. తెలివి గలదే. కానీ, తెలియనితనం ఎక్కువ. టీచర్లతో ఏదైనా ధైర్యంగా మాట్లాడుతుంది. ఇంట్లోవాళ్ళు రోజూ తనకు ఏదైనా కొనుక్కొమ్మని డబ్బులు ఇస్తుంటారు. అందుకే, తోటి అమ్మాయిలకు కాస్త చాక్లెట్ల లాంటివి ఇస్తూ ఉంటుంది; నాయకత్వ లక్షణాలు చూపిస్తూ ఉంటుంది. తరగతిలోని పిల్లలకు లావణ్య అంటే కాస్త భయం కూడా.

"మరీ...బడిలో చదువులు చెప్పకుండా ఇలాంటి పనులు ఏమిటో? బడికి మనకు చదువుకోవడానికి వస్తున్నామా? కూలి పనులు చేయడానికి వస్తున్నామా?" అంది లావణ్య.

"నువ్వు చెప్పేది నిజమే. కానీ, పని చేయకపోతే టీచరు అరుస్తుందేమో?" లక్ష్మి అడిగింది.

"హెడ్‌మాస్టర్ గారు కొడతారేమో?" మంగమ్మ సందేహం వెలిబుచ్చింది.

"ఎందుకు కొడతారు?" లావణ్య ధీమా వ్యక్తం చేసింది.

"ఏయ్! మాట వినకపోతే హెడ్‌మాస్టర్ గారు ఫైన్ వేస్తారు!" భార్గవి నిశ్చయం.

వీళ్లు మాట్లాడుకుంటుంటే మరి కొందరు- దుర్గ, రమ, భువనేశ్వరి, రమణి, సుధ- "ఏంటి? ఏంటి? ఏమంటున్నారు?" అంటూ గుమిగూడారు.

ఇంతలో క్లాస్ టీచరు సామ్రాజ్యం రావడం, అందరూ ఎవరి స్థలాల్లోకి వారు పరుగు తీసి గప్‌చుప్‌గా కూర్చోవటం జరిగాయి. టీచర్ గారు విద్యార్థులందరినీ గ్రూపులుగా‌ విభజించారు. తరువాత అందరినీ బయటికి తీసుకెళ్లి, ఎవరెవరు ఎక్కడెక్కడ మొక్కలు నాటవలసిందీ చూపించారు. లావణ్య, భార్గవి, దుర్గలకు ఒక మొక్క అప్పగించబడింది.

మూడు నెలల కాలం గడిచింది. గ్రూపులన్నీ మొక్కల పెంపకం బాగానే చేస్తున్నాయి. లావణ్య గ్రూపులో భార్గవి, దుర్గ ఇద్దరూ మొక్కను శ్రద్ధగా కాపాడుతున్నారు. లావణ్య మాత్రం ఇక ఆ సంగతే పట్టించుకోలేదు.

ఓ రోజు లావణ్య వాళ్లింటికి వాళ్ల అమ్మమ్మ వచ్చింది. లావణ్యకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం; కానీ అమ్మమ్మ ఊరు దుర్గంపల్లె అంటేనే కష్టం! ఆ ఊరికి వెళ్ళాలని ఉంటుంది తనకు. అయితే ఆ ఊరికి నేరుగా బస్సు లేదు. దేవాపురం వరకు మాత్రమే

బస్సు. అక్కడి నుండి ఓ నాలుగు కి.మీ పైనే నడవాల్సి ఉంటుంది. అదీ సమస్య. ఈసారి మాత్రం వాళ్ళ అమ్మమ్మ శుభవార్తతో వచ్చింది. "ఏమే? దుర్గంపల్లె వస్తావా? ఇప్పుడు కొత్తగా ఒక ఆర్టీసీ బస్సు వేశారు. ఇంక నువ్వు నడవక్కరలేదు" అంటూ.

"హాయ్! నిజంగానా అమ్మమ్మా?!" ఎగిరి గంతేసింది లావణ్య.

"అవునే! నీ కోసమే వేసినట్లున్నారు. మహారాణివి కదా!" అన్నది అమ్మమ్మ మురిపెంగా.

"అయితే నేను రెడీ!" అని గలగలా నవ్వుతూ, ఫ్రెండ్స్‌కి విషయం చెప్పేందుకు రయ్యన పరిగెత్తింది లావణ్య. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు హరితపురంలో బయలుదేరారు ఇద్దరూ. తొమ్మిదిన్నరకల్లా దేవాపురం చేరారు. పది గంటలు అవుతుండగా బస్సు వచ్చింది. సంతోషంతో గబగబా బస్సెక్కి కూర్చున్నారు. బస్సు కదిలింది గానీ, ఒక అర కిలోమీటరు వెళ్లగానే ఆగిపోయింది. డ్రైవరు, కండక్టరు పరిశీలించి, ఇక రిపేరు అవ్వడం కష్టమని తేల్చేశారు.

"అయ్యో! ఇప్పుడెలా?" అమ్మమ్మను అడిగింది లావణ్య.

"ఇంకేముంది నడవడమే!" ప్రక్కనున్న మరో ముసలావిడ సమాధానం.

"హు...హు...హు...అమ్మమ్మా!" అంటూ బుంగ మూతి పెట్టింది లావణ్య.

"ఏం చేద్దామమ్మా! మనం ఏమన్నా కలగన్నామా, ఇలాగవుతుందని? పద-పద!" అంటూ సీటు నుండి లేచి నడవసాగింది అమ్మమ్మ. లావణ్య ఇంకేం చేయగలదు?! ఏడ్చుకుంటూ నడక మొదలెట్టింది. దారిలో ఎక్కడా ఒక్క చెట్టు కూడా లేదు. ఆ రోజు సూర్యుడు తన ప్రతాపం కూడా బాగానే చూపించాడు.

దాంతో ఓ కిలోమీటరు నడిచే సరికి లావణ్యకు తల తిరిగినట్లయింది. ఏడుపు వచ్చేసింది.

"ఇంకెంత! రెండు కిలోమీటర్లేగా?! మా అమ్మ కదూ...నడువమ్మా!" అని అమ్మమ్మ అంటుంటే, కాళ్ళు అరిగిపోతున్న లావణ్య అట్లా ఇట్లా ఇంకో కి.మీ. నడిచేసి కూలబడ్డది.

మనుమరాలి పరిస్థితి చూసిన దుర్గమ్మ, "అదిగో అక్కడ ఒక చెట్టు ఉంది. అక్కడ కాసేపు కూర్చుందాములే పద" అన్నది, ఆ పాప ప్రాణం లేచి వచ్చేట్లు.

అదో పెద్ద చింతచెట్టు.

"అబ్బ..ఎంత చల్లగా, హాయిగా ఉందో" అంటూ దాని క్రింద పడుకున్న లావణ్య తనను తానే మరచిపోయింది. ఇంతలో ఆకలి గుర్తొచ్చింది. "అమ్మమ్మా!" ఆకలి!" అంది.

"ఇంకెంత! ఒక కిలోమీటరేగా! పద! ఇంటికి పోగానే అన్నం తిందువు గానీ!" అంది అమ్మమ్మ. అక్కడున్న ఓ పెద్దాయనకు లావణ్యని చూసి జాలి వేసింది. చెట్టుపై నున్న చింతకాయలు కొని అందుకొని కోసి ఇచ్చాడు.

"వావ్!" అంటూ ఎంతో ఇష్టంగా తీసుకొని తినడం ప్రారంభించిన లావణ్య తనని తాను మరచిపోయింది.

"ఏయ్, లావీ! లావీ!" "ఇంక వెళదామా?" అని అమ్మమ్మ పిలిచేంతవరకూ ఈలోకంలో లేదు లావణ్య.

"ఏమైంది, ఎందుకు అలా అయ్యావు?" అడిగింది అమ్మమ్మ.

బడిలో ఏం జరిగిందో చెప్పింది లావణ్య. "మా బడిలో మొక్కలు నాటమన్నారు అమ్మమ్మా! కానీ నేను 'అదేం పని- కూలి పని!' అనుకున్నాను. కానీ ఇవాళ ఆ చెట్టు క్రింద కూర్చున్నాం కదా, అప్పుడు తెలిసింది నాకు- ఆ హాయి ఎంత గొప్పదో, ఆ చెట్టు విలువ ఎంతో. నేను బాగా పొగరుమోతు నయ్యాను అమ్మమ్మా!" అన్నది లావణ్య, చిన్నబోతూ.

అమ్మమ్మ తనని ఊరడిస్తూ "దానిదేమున్నది, లావీ! మనం చేయాల్సిన పనుల్లోని మంచిని ఇప్పటినుండీ గుర్తిస్తే సరి! ఏ నాటికైనా స్వీయానుభవాన్ని మించింది లేదు. ఇప్పటికైనా మనం తెలుసుకున్నాం కద, అదే చాలు!" అన్నది.

హరితపురం రాగానే లావణ్య చురుకుగా మొక్కల పనిలో పాల్గొన సాగింది. తన మాట తీరు, నడవడిక అన్నీ మారాయి. ఆమెలో వచ్చిన చక్కని మార్పుకు స్నేహితులంతా చాలా ఆనందించారు.