అనగా అనగా నేపాలును ఓ రాజు పరిపాలించేవాడు. అతని దగ్గర చాలా సంపద ఉండేది- అంటే ఎన్నెన్నో వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, మరకతాలు, మాణిక్యాలు, ముత్యాలు- ఇంకా ఎంతో బంగారం ఉండేదన్నమాట. ఎవ్వరికీ లేనంత గొప్ప భవంతి ఒకటి ఉండేదిఆయనకి.

ఆ భవనం కూడా భలే ఉండేది. ఎంతో అద్భుతంగా, పెద్ద పెద్ద శిల్పాలతో, చెప్పలేనంత అందంగా ఉండేది. రాజుగారు బంగారు పళ్ళాలలో భోంచేసేవాడు; వెండి గ్లాసుల్లో నీళ్ళు త్రాగేవాడు- త్రాగేసి, తన సంపద గురించి ఆలోచించుకునేవాడు.

ఒక్కోసారి, ఇంక వేరే పనేమీ‌ లేదంటే, అట్లా నడచుకుంటూ తన ఖజానాకు వెళ్ళేవాడు. ఖజానా అంటే సంపదను దాచుకునే గది- అందులో రాజుగారు తన దగ్గరున్న ప్రత్యేకమైన వజ్రాలను, ముఖ్యమైన వైఢూర్యాలను దాచుకునేవాడు.

అవికూడా‌ఎన్ని ఉండేవి అంటే, వాటి రాసులతో గది అంతా నిండిపోయి ఉండేది! చిన్న పిల్లలు ఇసుకతో ఆడుకున్నట్లు, ధగధగా మెరిసే ఆ వజ్రాలతోటి ఆడుకునేవాళ్ళు రాజుగారు . కెంపుల కుప్పలో పాదాలు దాచుకొని, వాటి మీద పగడాలను అమర్చి, 'ఎంత అందంగా ఉన్నాయి, ఇవి?' అని మురిసిపోయేవారు.

కొంతసేపు అట్లా ఆడి అలసిపోయి, మరకతాల కుప్పను నెరిపి, మంచంలాగా చేసుకొని వాటి మీద పడుకొని నిద్రపోయేవారు. ఖజానాలో అట్లా గడిపినంత సేపూ రాజుగారికి సంతోషం ఇనుమడించేది. 'నేపాలుకెల్లా తనే గొప్ప రాజు'-అనిపించి, మనసంతా ఉల్లాసంతో నిండిపోయేది. తన ఖజానాలో ఎంత సేపు గడిపితే అంతసేపు మొలకనవ్వులు రువ్వుతూ ఉండేది రాజుగారి ముఖం. "బహుశ: ప్రపంచంలో కెల్లా అత్యంత ధనికుడైన రాజును నేనే కావొచ్చు' అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయనకు మరింత ఉల్లాసం కలిగేది.

ఒకరోజున ఆయన రాజ్యానికి ఒక రుషి వచ్చాడు. ఆయన మహాత్ముడని, జ్ఞాని అనీ అందరూ చెప్పుకుంటుంటే విన్నారు రాజుగారు. వినేసరికి, 'నేను కూడా ఆయన ఆశీస్సులు అందుకోవాలి' అనిపించింది ఆయనకు.

వెంటనే బయలుదేరి రుషి బస చేసిన తోటలోకి వెళ్ళి, ఆయన దర్శనం చేసుకున్నాడు: 'మా మందిరానికి వచ్చి, కొన్నాళ్ళు ఉండండి, మమ్మల్ని ధన్యుడిని చేయండి' అని ప్రార్థించాడు. రుషి సరేనని, రాజుగారి భవనానికి బయలుదేరి వచ్చాడు.

రుషి గౌరవార్థం రాజుగారు ఆరోజు సాయంత్రం గొప్ప విందునొకదాన్ని ఏర్పాటు చేశారు. రుషి ప్రక్కన కూర్చొని, స్వయంగా వడ్డించారు. ఆయనకు తన సౌధాన్నంతా తిప్పి చూపించారు.

తనూ, తన రాణులూ ఉండేచోట ఆయనకు బస ఏర్పాటు చేశారు.

అంతా అయ్యాక, ఏనాడూ ఎవ్వరికీ దక్కనంత గౌరవం రుషికి ఇవ్వాలనుకున్నారు- 'నా ఖజానాను చూపిస్తాను మీకు- రండి. మీరు అట్లాంటి సుందర దృశ్యాన్ని ఏనాడూ చూసి ఉండరు. ఈ దేశంలో ఎవ్వరి దగ్గరా లేనన్ని విలువైన మణులు, మాణిక్యాలు నా దగ్గర ఉన్నాయి- ఎన్నంటే, వాటి కుప్పలు ఖజానా పై కప్పుని అంటుకుంటుంటై. రండి, చూద్దురు!' అని వెంట తీసుకు వెళ్ళారు.

రాజుగారు రుషికి ఒక్కడికే అమూల్యమైన ఈ అవకాశం ఇచ్చింది- ఇంతవరకూ రాజుగారు తప్ప, మనిషన్నవాడెవ్వడూ అసలు ఖజానాలోకి అడుగే పెట్టి ఉండలేదు. రాజుగారు చాలా ఉత్సాహంగా ఉన్నారు- "నా ఖజానాని చూసి రుషి ఆశ్చర్యపోతాడు- అద్దిరిపోతాడు అసలు.బహుశ: ఆ సంతోషంలో ఆయన నాకు ఏవో చక్కని వరాలు, ఆశీర్వాదాలు కూడా ఇవ్వొచ్చు.. లేదా, దేశాన్ని చక్కగా పాలించటంలో మెళకువలు ఏమైనా ఒకటి రెండు చెప్పి వెళ్ళచ్చు.." అనుకుంటూ తన ఖజానా తలుపులు తెరచారు.

రెండు చేతులూ బార చాపి రుషిని లోనికి స్వాగతించారు- "రండి, మహర్షీ! చూడండి! కళ్ళు మిరుమిట్లు గొలిపే ఈ సంపదను చూడండి. కప్పునంటే ఈ పగడాల కొండలు చూశారా, ఎంత ముద్దుగా ఉన్నాయో- ఇవి ప్రత్యేకంగా విదేశాలనుండి తెప్పించిన రత్నాలు..." అంటూ కొద్దిసేపు మైమరచిపోయారు.

రుషి చకచకా ఖజానా అంతా కలయ తిరిగి చూశాడు. పెదవి విరుస్తూ- "ఇంతేనా, నీ సంపద?!" అన్నాడు. రాజుగారు నివ్వెరపోయారు. "అదేంటి, ఇంతింత విలువైన రాళ్ళు మీ కళ్లముందు ఉంటే మీకు సంతోషమూ -ఆశ్చర్యమూ వేయట్లేదా స్వామీ, అట్లా అంటున్నారు?!" అన్నారు.

రుషి నవ్వాడు-"క్షమించాలి, రాజా! కానీ నాకు నీ ఈ రాళ్లకంటే విలువైన రాళ్ళు తెలుసు. వాటి విలువతో పోలిస్తే ఇవి అసలు రాళ్ళు కూడా కావు!" అన్నాడు.

ఇప్పుడు ఆశ్చర్యపోవటం రాజుగారి వంతు అయింది. ఆయనకు కొంచెం కోపం కూడా‌వచ్చింది. "తన దగ్గరున్న వాటికంటే విలువైన రాళ్ళు వేరే ఎవరి దగ్గర ఉండి ఉంటాయి-" అన్నది ఆయన ఊహకే అందని విషయం!

"ఓహో! అట్లానా?! తమరు అనే ఆ విలువైన రాళ్ళేవో ఎక్కడ ఉన్నాయి?" వెటకారంగా అడిగాడాయన, రుషిని. తనకంటే ధనికులు అసలు ఎవరైనా ఉన్నారనే ఊహకే ఆయన నోరు చేదెక్కింది.

"రేపు ఉదయాన్నే చూపిస్తాను మీకు. ఇప్పుడిక నిద్రపోవలసిన సమయం అయ్యింది కదా?!" ఖజానాలోంచి నేరుగా పడకవైపుకు దారి తీశాడు రుషి.

ఆరోజు రాత్రి పరుపు మీద అటూ ఇటూ ఎంత దొర్లినా రాజుగారికి ఇక నిద్ర పట్టలేదు. 'అసలు నాకంటే ఎక్కువ విలువైన రాళ్ళను ఎవరైనా, ఎట్లా సంపాదించి ఉంటారు?' అని ఒకటే మథన పడ్డాడు. 'రుషి నిజమే చెప్తున్నాడంటావా? రేపు నిజంగానే చూపిస్తాడంటావా, ఆ రాళ్ళను?' అన్న ఆలోచనతో రాత్రంతా కునుకు లేదు. ఎంతకీ తెల్లవారలేదు కూడా! చివరికి, తెల్లవారు జాముననే రుషి దగ్గరకు వెళ్ళి "పదండి మరి! త్వరగా తయారవండి! మనం వెంటనే వెళ్ళి చూద్దాం ఆ రాళ్ళను!" అన్నాడు.

రుషి నవ్వాడు. అంతకంటే విలువైన రాళ్ళ గురించి విన్న తర్వాత రాజుగారిలో ఎంత మార్పు! ఎంత ఆత్రపడుతున్నాడు, వాటిని చూడాలని!

రాజుగారిని ఆయన భవంతిలోంచి బయటికి నడిపించాడు రుషి. ఇద్దరూ సన్నని ఓ బాట గుండా‌నడచుకొని దగ్గర్లో ఉన్న గ్రామాన్నొకదాన్ని చేరుకున్నారు. రాజుగారి ఆత్రం మరింత ఎక్కువైంది- 'ఈ పల్లెటూర్లోనా? నా దగ్గరున్న మణులకంటే విలువైన రాళ్ళున్నాయా?' అనుమానిస్తూనే నడుస్తున్నారు. అక్కడ ఓ ఇంటి వాకిట్లో ఒకావిడ కూర్చొని ఉన్నది- తిరగలిలో ధాన్యం విసురుతున్నది. ఆవిడ ప్రక్కగా నిలబడ్డాడు రుషి- 'అవిగో- చూడండి. ఆ రాళ్లతో ఆవిడ ధాన్యం విసురుతోంది, చూశారా?' గుసగుసగా అన్నాడు విసురు రాయి వైపు చూపిస్తూ.

రాజుగారు తిరగలిని, రుషిని మార్చి మార్చి చూసి, విరగబడి నవ్వారు. "ఏం ప్రత్యేకత కనబడింది స్వామీ, మీకు, ఆ రాతిలో?! ఇట్లాంటి రాళ్ళు వందలు-వేలు ఉంటాయి. ఇది చాలా మామూలు తిరగలి రాయి.

దీనికి అసలు ఏమీ విలువే లేదు!" అన్నారు ఎగతాళి ధ్వనించే గొంతుతో. రుషి మూర్ఖత్వాన్ని తలచుకున్న కొద్దీ ఆయనకు నవ్వు ఆగటం లేదు: 'రత్నానికీ, తిరగలికీ తేడా తెలీని వాడు ఏమి రుషి?! ఇట్లాంటివాడికి తన ఖజానా విలువ ఎందుకు తెలుస్తుంది?!'

రాజుగారు వెనుతిరిగి పోబోతుంటే రుషి ఆయన్ని వెనక్కి పిలిచాడు. "ఇటు రా, రాజా! ఇక్కడికొచ్చి ఈ రాయి ఏం చేస్తోందో జాగ్రత్తగా చూడు. ఒక రకంగా చూస్తే నువ్వన్నది నిజమే- దీనిలాంటి తిరగలి రాళ్ళు వందలు- వేలు ఉంటాయి. కానీ మరో విధంగా చూడు- నీ ఖజానాలో బందీలయి కూర్చున్న రాళ్లకంటే వాటి విలువే ఎక్కువ! ఈ తిరగలి రాయి ప్రతిరోజూ ఈమె తినేందుకు అవసరమయ్యేంత పిండిని ఇస్తున్నది- ఏరోజుకారోజు ఈమె కడుపు నిండేందుకు ఇది ఆధారం అవుతున్నది. మరి నీ రాళ్ళవల్ల ఏం ఉపయోగం కలుగుతున్నది?"

రాజుగారిలో ఆలోచన మొదలైంది.. 'నిజమే- తన రాళ్లతో నిజానికి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు! అవి ఎందుకూ పనికి రావు. ఎవరైనా కేవలం వాటిని చూడచ్చు; తాము ఎంత ధనవంతులో తలచుకొని గర్వపడచ్చు- అంతే'-

ఆయన ఆలోచనలు అర్థమయినట్లు, రుషి అన్నాడు- "ఇప్పుడు అర్థమయినట్లుంది, నీకు. నీ దగ్గరున్న రాళ్ళు ఎందుకూ పనికి రావు. ఇక్కడున్న రాళ్ళన్నిటిలోనూ ఈ తిరగలి రాయిని మించిన విలువైన రాయి అసలు లేనే లేదు. ఇది లేకపోతే ఈమె తన ధాన్యాన్ని విసురుకోనేలేదు; రోజూ రొట్టె తయారు చేసుకొని తిననూ లేదు. నీ ఖజానాలో ఉన్న రాళ్లన్నీ కలిసి కూడా చెయ్యని పనిని ఈ తిరగలి రాయి అవలీలగా చేస్తోంది- దీనికేం‌ విలువ కడతావు?"

రాజుగారికి జ్ఞానోదయం అయింది. 'వస్తువుల అసలు విలువ వాటి ఉపయోగం వల్లనే' అని చెబుతున్న రుషికి తల ఒగ్గి నమస్కరించాడు.