పూర్వం చంద్రగిరిలో భద్రయ్య అనే వ్యాపారి ఉండేవాడు. చంద్రగిరి చుట్టుప్రక్కలే కాక, సుదూర ప్రాంతాలకు కూడా సరుకు తీసుకెళ్లి వ్యాపారం చేస్తూ బాగా సంపాదించాడు అతను. స్వభావ రీత్యా స్నేహశీలి, దయాశాలి అవ్వటంతో అందరూ భద్రయ్యని చాలా అభిమానించేవారు. సాటి వర్తకులు నష్టాల్లో ఉంటే వారిని ఆదుకోవటమే కాదు, సలహాలిచ్చి వ్యాపారానికి సాయపడుతూండేవాడతను.

ఇలా ఉండగా ఒకసారి ప్రక్కన చోళ దేశంలో సుగంధ ద్రవ్యాలకు కొరత ఏర్పడిందని, మంచి గిరాకీ ఏర్పడిందని తెలిసింది అతనికి. దాంతో కావలసినంత సరుకు తీసుకొని, కొందరు పనివాళ్లను వెంటబెట్టుకొని చోళదేశం చేరుకున్నాడు.

సుగంధ ద్రవ్యాలకు అక్కడ నిజంగానే కొరత ఉంది. భద్రయ్యకు వ్యాపార చిట్కాలు బాగా తెలుసు. విశేష అనుభవం ఉంది. ఎక్కడ ఏ వస్తువులకు గిరాకీ ఉంటే అక్కడ ఆ వ్యాపారమే చేస్తాడు. ఆ విధంగా చోళదేశంలో అతడి సుగంధ ద్రవ్యాల వ్యాపారం ఎంతో లాభసాటిగా సాగింది. చేతిలో సరుకు మొత్తం అయిపోయింది. మరి కొంత సరుకుతో ఇంకోసారి చోళదేశం రావాలని నిశ్చయించుకొని, చంద్రగిరికి తిరుగు ప్రయాణమయ్యాడు.

అతనితోపాటు నలుగురు సేవకులు- అందరూ ఎడ్లబండ్ల మీద బయలుదేరారు.

చోళదేశంలో తను సంపాదించిన డబ్బునంతా బంగారు నాణాలుగా మార్చి, వాటిని ఒక తోలు సంచిలో వేసి, చక్కగా మూతికట్టి, తన దగ్గరే ఉంచుకున్నాడు భద్రయ్య. "ఎంత నమ్మకస్తుడికైనా ఎప్పుడు ఏ దుర్భుద్ధి పుడుతుందో" అని, "మనిషిని ప్రలోభ పెట్టే గుణం ధనానికి ఉంది" అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే భద్రయ్య, ఆ సంచిని మాత్రం తను నమ్మే సేవకుల చేతికి కూడా ఎప్పుడూ ఇవ్వడు.

కొంత దూరం వచ్చేసరికి వాళ్లకు పాపయ్య అనే తోటి వ్యాపారస్తుడు, అతని ఇద్దరు సేవకులు కలిసారు. చూసీ చూడగానే భద్రయ్య దగ్గర ఉన్న తోలు సంచిని పసిగట్టేసాడు పాపయ్య. దాన్నిండా బంగారు నాణాలు ఉన్నాయని కూడా‌ అతనికి తెలిసిపోయింది! అతని బుద్ధి అసలు మంచిది కాదు. మంచిగా ఉంటూనే గోతులు త్రవ్వేస్తాడు. అయితే ఈ సంగతి భద్రయ్యకు తెలీదు. వ్యాపారి అంటే "వ్యాపారి కదా, మన ఊరివాడు" అనుకున్నాడు.

చీకటి పడే సమయానికి వాళ్లంతా సింహపురికి చేరుకున్నారు. ఆరోజు రాత్రికి ఒక సత్రంలో బసచేసారు. భోజనాలు చేసి పడుకునేటప్పుడు పాపయ్య అడిగాడు: "వేకువజాముననే ప్రయాణం ఆరంభి-ద్దామా?" అని.

కానీ "ఇక్కడి నుండీ మొత్తం అడవి దారి కదా, చోర భయం ఉంది. ఏదో ఒక బిడారు గుంపు బయలుదేరే వరకూ ఆగటం మంచిది" అన్నాడు భద్రయ్య.

"తోలు సంచి కొట్టెయ్యాలంటే ఇదే అదను.. అవకాశం మళ్ళీ రాదు.. సంచీ తీసేసుకొని, వేకువనే వెళ్లిపోవాలి!" అని ఆ క్షణాన్నే నిశ్చయించుకున్న పాపయ్య, రాత్రికి రాత్రే ఆ తోలు సంచిని దొంగిలించాడు. తన మనుషులిద్దర్నీ నిద్రలేపి, చడీ‌చప్పుడు కాకుండా బయలుదేరి వెళ్లిపోయాడు. మార్గామాసంతో గాఢ నిద్రలో ఉన్న భద్రయ్యకు ఆ సంగతి ఏదీ తెలీనే తెలీదు- తెల్లవారి చూస్తే ఏముంది? సంపాదన యావత్తూ దాచుకున్న తోలుసంచీ లేదు; ప్రక్కన పాపయ్య కూడా లేడు!

జరిగిన మోసం అర్థమైంది అతనికి. అయినా "ఆ సొమ్ము నాకు రాసి పెట్టి లేనట్టుంది.

అందుకే పోయింది!" అని సరిపుచ్చుకున్నాడు భద్రయ్య. తన దగ్గర ఇప్పుడు డబ్బు లేదు: కాబట్టి దొంగలు దోచుకుపోతారన్న భయం కూడా లేదు. అందుకని ఇక వెంటనే బండి కట్టుకొని, ప్రశాంతంగా చంద్రగిరికి ప్రయాణమయ్యాడు అతను.

సాయంకాలం అయ్యేసరికి ఎడ్లబండ్లు ఒక కొండవాగును చేరుకున్నాయి. విశ్రాంతి కోసం అక్కడ ఆగారు వాళ్ళు. అంతలో ఒక బిడారు వాగుదాటి ఇవతలికి వచ్చింది.

బిడారు నాయకుడు వీరబాహుడు, గతంలో చాలా సార్లు భద్రయ్య బండ్లతో కలిసి ప్రయాణించాడు. భద్రయ్యను చూడగానే నవ్వుతూ దగ్గరకొచ్చాడు. "అయ్యా..చాలా రోజుల తర్వాత కనిపించారు- నమస్కారం" అన్నాడు.

"చోళదేశంలో వ్యాపార నిమిత్తం చాలా రోజులు ఉండిపోయాను. అందుకే కనబడలేదు! నువ్వు బాగున్నావా వీరబాహూ?" అంటూ పలకరించాడు భద్రయ్య.

"మేం బాగున్నామయ్యా. ఓసారి ఈ తోలు సంచీ చూడండి, తమదే అనుకుంటాను.." అంటూ తోలుసంచీ అందించాడు వీరబాహు.

ఆ సంచిని చూసి ఆశ్చర్యపోయాడు భద్రయ్య. అది తనదే!

"ఇది నాదే, వీరబాహూ! చోళదేశంలో చేసిన వ్యాపారం తాలూకు డబ్బు మొత్తం ఇందులోనే ఉంది. నిన్న రాత్రి సింహపురి సత్రంలో నిద్రపోతుంటే పాపయ్య అనే వ్యాపారి దీన్ని దొంగిలించుకొని పోయాడు-" అని ఆగి, "మరి ఇప్పుడు అది నీ చేతికి ఎట్లా వచ్చింది?" అని అడిగాడు.

"అయితే పాపయ్యకు తగిన శాస్తి జరిగిందిలెండి. మీకు గుర్తుందా? పోయిన సంవత్సరం మీరు నా బిడారుతోపాటు విజయనగరానికి వచ్చారు. ఆ సమయంలో మీరూ నేనూ కలిసి వెళ్ళి ఈ తోలు సంచిని కొన్నాం. అందుకే దీన్ని చూడగానే 'ఇది మీది' అని గుర్తించగలిగాను నేను. ఇవాళ్ళ మధ్యాహ్నంగా మాకు ఓ దొంగల గుంపు ఎదురైంది. వాళ్ళు పాపయ్య ఎద్దులబండి మీద దాడి చేస్తున్నారు. ఆ దాడిలో పాపయ్య చనిపోగా, పనివాళ్ళు ఇద్దరూ‌ పారిపోయారు. అదే అదనుగా మేమూ‌ ఆ దొంగలతో పోరాడి, వాళ్లందరినీ తుదముట్టించేసాం. "వాళ్ళ దగ్గర ఏమున్నది?” అని వెతుకుతుంటే ఈ సంచీ కనబడింది-. 'ఇది మీదే కదా, మీరు గానీ ఈ దొంగల పాల పడ్డారా?' అని నాకు దు:ఖం వేసింది. అందుకని మీకోసమే మేం మళ్ళీ ఈ వాగు దాటి, ఇటుగా వచ్చాం!" చెప్పాడు వీరబాహుడు.

తన క్షేమం గురించి అంతగా ఆలోచించిన వీరబాహుడికి ధన్యవాదాలు చెప్పాడు భద్రయ్య. "చూసావా?! పరుల సొమ్ముకు ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు పాపయ్య? అంతా మన మంచికే అని చెబుతారు. ఈ సంచీ నా దగ్గరే ఉంటే నేనే ఆ దొంగలకు బలై ఉండేవాడిని కదా!" అన్నాడు.

"అట్లా ఏమున్నది లెండి- మీకు ఏమీ అయిఉండేది కాదేమో, మీరూ నేనూ కలిసి దొంగలకు బుద్ధి చెప్పేవాళ్లమేమో, అసలు దొంగలే ఎదురయ్యేవాళ్ళు కారేమో, మరి ఇంకేమైనా జరిగి ఉండేదేమో‌" అని నవ్వాడు వీరబాహుడు.