అనగనగా భస్మాసురుడు అనే రాక్షసుడొకడు, అడవిలో కఠోర తపస్సు చేస్తున్నాడు- "ఓం నమ శివాయ" అంటూ. అతని తపస్సు ఎంత తీవ్రం ఐందంటే, చివరికి అది శివుడిని చేరనే చేరింది. భస్మాసురుడి ఘోర తపస్సుకు మెచ్చిన శంకరుడు భస్మాసురుడి ముందు ప్రత్యక్షమైనాడు: "నాయనా! ఏమి కావాలో కోరుకో" అంటూ.

"శంకరా! నాకు మరణం లేకుండా వరం ఇవ్వండి" అన్నాడు భస్మాసురుడు.

అప్పుడు శివుడు నవ్వాడు- "ఒరే, నాయనా! పుట్టిన జీవి చావక తప్పదు; చచ్చిన జీవి మళ్ళీ పుట్టకా తప్పదు. అందుకని నువ్వడిగిన ఆ వరం ఇచ్చేకి వీలు కాదు. అది కాకుండా ఇంకొకటి ఏదైనా కోరుకో" అని చెప్పాడు.

భస్మాసురుడు ఆలోచించాడు. "ఈ వరం ఇవ్వడట- దీని లాగానే ఇంకోటి ఏదైనా అడగాలి!" అనుకున్నాడు.

"సరే! నేను ఎవరి తల మీద చేయి పెడతానో వాళ్ళు తక్షణం భస్మం అయిపోవాలి!" అని అడిగాడు.

"ఇది పర్లేదు. ఈ వరం అయితే ఇవ్వచ్చు" అనుకున్నాడు శంకరుడు. "తథాస్తు" అనేసాడు.

శివుడు తథాస్తు అనగానే భస్మాసురుడు వికవికా నవ్వాడు. "ఇప్పుడు చిక్కావు నాకు!" అన్నాడు.

"ఏంటి, చిక్కటం?" అన్నాడు శివుడు.

"ఏమీ లేదు; నువ్వు అసలు శివుడివో, దొంగ శివుడివో ఎలా తేల్చుకునేది?" అని అడిగాడు భస్మాసురుడు.

"అదేం అనుమానం? నువ్వడిగిన వరం ఇచ్చేసాను. నువ్వు ఎవరి తలమీద చెయ్యి పెడితే వాళ్లు నిజంగా భస్మం అయిపోతారు" అన్నాడు శివుడు.

"అదే కనుక్కోవాలి- ముందు నీ తలమీద చెయ్యి పెడతాను. నీకు ఏమౌతుందో‌ చూస్తాను" అని మీదికొచ్చాడు భస్మాసురుడు. శివుడికి చాలా భయం వేసింది. "వీడెవడో మరీ‌ ఇంత మొరటు వాడు అనుకోలేదే!" అని గబుక్కున వెనక్కి తిరిగి పరుగు పెట్టాడు.

"ఆగు! ఆగు! వరాన్ని పరీక్షించుకోనీ!" అంటూ శివుడి వెంట పడ్డాడు భస్మాసురుడు.

శివుడు ఎటు పోతే అటు వస్తున్నాడు వాడు. శివుడంతటివాడికే అలసట మొదలైంది.

అంతలో నారదుడు ఎదురయ్యాడు. "ఆగు ఆగు శంకరా!" అన్నాడు.

"ఆగేకి లేదు- వెనక భస్మాసురుడు వెంట పడుతున్నాడు. తప్పించుకునేకి ఏదైనా‌ ఉపాయం చెప్పు- త్వరగా" అన్నాడు శివుడు, పరుగెత్తుతూనే.

నారదుడు కూడా ఆయనతోబాటు పరుగు పెడుతూ అంతా విన్నాడు.

"అయ్యో! ఎంత పనైంది! అయినా వీళ్లకు ఇట్లాంటి వరాలు ఇచ్చేదెందుకు, తర్వాత కష్టాలు కొని తెచ్చుకునేదెందుకు? అయినా అన్ని ఉపాయాలూ ఉన్న విష్ణువు ఉన్నాడుగా! ఆయన్ని తలుచుకో స్వామీ- వెంటనే ఏదో ఒక రకంగా కాపాడతాడు!" అన్నాడు నారదుడు.

అట్లా పరుగు పెడుతూనే విష్ణువుని తల్చుకున్నాడు శివుడు. సంగతి తెల్సుకున్న విష్ణువు ముందుగా తన మాయని భస్మాసురుడి మీదికి వదిలాడు. దాని ప్రభావం వల్ల వాడికి శివుడు కనిపించలేదు. ఆయన స్థానంలోనే విష్ణువు- మోహిని అనే సుందరి రూపంలో కనిపించటం మొదలు పెట్టాడు వాడికి.

తనకు శివుడిచ్చిన వరాన్నీ, తను ఆ శివుడి వెంట పడటాన్నీ అంతా మర్చిపోయాడు భస్మాసురుడు- ఇప్పుడు వాడికి కనబడుతున్నదల్లా మోహిని ఒక్కతే. ఆమె ఎంత చక్కగా ఉన్నదంటే, ఇప్పుడు వాడికి ఆమెను పెళ్ళి చేసుకోవాలని గట్టి కోరిక కలిగింది.

మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్ళి- "సుందరీ! నీ పేరేంటి? నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా?" అని అడిగేసాడు వాడు.

మోహిని కిలకిలా నవ్వింది. ఆ నవ్వు చూసి ఇంకా మురిసిపోయాడు భస్మాసురుడు.

మోహిని అన్నది- "నువ్వు కూడా నాకు చాలా నచ్చావు. అయితే నాకో చిన్న సమస్య ఉంది- ముందు ఈ సంగతి చెప్పు- నీకు నాట్యం చేయటం వచ్చా?" అని.

"ఓ! చాలా బాగా వచ్చు" అన్నాడు భస్మాసురుడు.

"అయితే ఇక పెళ్ళి అయినట్లే! నువ్వు నేను చేసినట్లు నాట్యం చెయ్యి- నాకంటే బాగా చెయ్యాలి మరి! నాట్యంలో నన్ను ఓడించిన వాడినే నేను పెళ్ళి చేసుకుంటాను అని నా జాతకంలో ఉందట" వంకరగా చెప్పింది మోహిని.

"ఓస్! దానిదేముంది. మొదలుపెట్టు నాట్యం!" అన్నాడు భస్మాసురుడు.

మోహిని నాట్యం మొదలెట్టింది. ఆమె ఎట్లా ఆడితే అట్లా ఆడసాగాడు భస్మాసురుడు. క్రమంగా నాట్యం వేగం పుంజుకున్నది. మోహిని తన తలమీద చెయ్యి పెట్టుకొని నాట్యం చేసింది. "ఈ నాట్యం బలే ఉందే" అనుకున్నాడు భస్మాసురుడు. ఆ మొరటు వాడికి తన వరం సంగతి గుర్తే లేదు- ఆమె మాదిరే తనూ తన తలమీద చెయ్యి పెట్టుకున్నాడు- మరుక్షణంలో వాడు కాస్తా భస్మం అయిపోయాడు!

లోకానికి భస్మాసురుడి పీడ విరగడైంది. తనను, లోకాన్ని కాపాడిన విష్ణువుకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు శివుడు. "పాత్రత లేని వాళ్ళకు ఇట్లాంటి వరాలు దొరికితే ఎలాగ?" అని నవ్వాడు విష్ణువు.