వసంతకు తన దగ్గరున్న బొమ్మలంటే చాలా ఇష్టం. ఇప్పుడు వేసవికాలం కదా; బడి ఒంటి పూట మాత్రమే ఉంటుంది. ఇంట్లో ఆడుకునేందుకు పిల్లలందరికీ ఎంతో సమయం!

ప్రతిరోజూ వసంత పిల్లలందరినీ ఇంటికి పిలుచుకునేది. తనకున్న బొమ్మలు అన్నింటినీ కుప్పగా పోసేది. బొమ్మల్ని అందరికీ ఇచ్చి, తనతోబాటు- తన వద్దే- అడుకోమనేది. ఆ ఆటల్లో అందరూ తను చెప్పినట్లే ఆడాలి. ఎవరైనా తన మాట వినకపోతే- ఇక తన ఆట బొమ్మలు తను లాగేసుకునేది; కోపంగా తిట్టేది; ఆ పిల్లల్ని వాళ్ల ఇంటికి పంపేసేది.

ఒకరోజున వసంతతో ఆడుకునేందుకు వాళ్ళింటికి వచ్చారు సరళ, మరి కొందరు పిల్లలు. సరళ ఆడుకునేందుకు తన బార్బీ బొమ్మను ఇచ్చింది వసంత. పిల్లలందరికీ తలా ఒక బొమ్మా దొరికాయి. "అందరూ నాతో పాటు రండి! నేను గాలిపటం ఎంత బాగా ఎగరేస్తానో‌ చూడండి!" అన్నది వసంత. పిల్లలెవ్వరూ ఆ మాటల్ని పట్టించుకోలేదు. తమ దారిన తాము ఆడుకుంటూ ఉన్నారు. వసంతకు చాలా కోపం వచ్చింది. "మీరంతా మీ ఇళ్ళకు వెళ్ళిపోండి! ఎవ్వరూ ఇక్కడ ఉండనక్కర్లేదు!" అని అరిచింది.

అంతలోనే గాలి వేగంగా వీచసాగింది. సుడిగాలి ఒకటి నేరుగా వీళ్ళున్న తావుకే వచ్చింది. వసంత చేతిలో ఉన్న గాలిపటం ఎగిరి పోతోంది.. "నా గాలిపటం! నా గాలిపటం!" అని అరుస్తూ దాని వెంట పడింది వసంత. ఏం జరుగుతోందో చూసిన సరళ, ఇంకా మిగిలిన పిల్లలు అందరూ వసంత వెంటపడ్డారు. అంతలో వసంత కాలికి ఒక రాయి తట్టుకున్నది. పైనున్న గాలిపటం వైపుకు చూస్తూ నడిచి, ఎదురుగా ఏమున్నదో చూసుకోలేదు ఆ పాప! పడటం పడటమే నేరుగా లోతైన బావిలో పడిపోయింది! వసంతకు యిత వచ్చు; అయినా పైకి వచ్చేందుకు ఆ బావికి మెట్లు లేవు!

పిల్లలంతా గొల్లుమన్నారు. ఏం చేయాలో ఎవరికీ పాలుపోలేదు. సమయస్ఫూర్తిగల సరళ అటు-ఇటు చూసింది. దగ్గర్లోనే మఱ్రి చెట్టు ఒకటి కనబడింది. "మర్రి ఊడలు తీసుకురండి!" అని అరిచింది. పిల్లలంతా ఊడలు తెంపుకొని వచ్చారు. "నీకేమీ కాదు వసంతా! ఈత కొడుతూ నీళ్ళమీద తేలుతూ ఉండు అంతే" అని వసంతకు ధైర్యం చెప్పి, "ఆ ఊడల్ని ఒక దానితో ఒకటి మెలి పెట్టి, తాడులాగా పేనండి!" అని పిల్లల్ని ఆదేశించింది సరళ. చూస్తూండగానే మెలిపెట్టిన ఊడలు పెద్ద మోకులాగా అయినాయి. ఆ మోకును పట్టుకొని అందరూ కలిసి బావిలోకి వదిలారు. సరళ దాన్ని పట్టుకోగానే అందరూ కలిసి ఆమెను బయటికి లాగారు.

అపాయం నుండి బయటపడిన వసంత అందరికీ కృతజ్ఞతలు చెప్పింది.

"నేను అందరినీ కోపంతో తిడుతున్నా, ఇంతమంది నన్ను కాపాడడానికి వచ్చారు! మీకు నేనంటే ఎంత ఇష్టమో, స్నేహమంటే ఎంత గౌరవమో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఇకమీద నేను ఎవ్వరిమీదా కోపగించుకోను. మంచి స్నేహితురా-లయ్యేందుకు ప్రయత్నిస్తాను" అని చెప్పింది కళ్ళ నీళ్లతో.

"ఎలాంటి సమయంలోనైనా తలా ఒక చెయ్యి వేస్తే విజయం సాధించగలం. అందుకే స్నేహితులు అవసరం!" అని సరళ అన్నది.

అటుపైన వసంత "తనే గొప్ప" అనుకోవటం మాని, అందరితోటీ ప్రేమగా వ్యవహ-రించటం మొదలుపెట్టింది. వేసవి సెలవలు ఇక బలే సంతోషంగా గడిచాయి!