ప్రహరి, ప్రియాంక మంచి స్నేహితులు. వాళ్ల స్నేహాన్ని చూసి ఓర్వలేని కావ్య వాళ్లు చేసే ప్రతి పనిలోనూ పానకంలో పుడక లాగా అడ్డు తగలడం మొదలు పెట్టింది. వాళ్ళిద్దరినీ ఎలాగైనా విడదీయాలని భగీరథ ప్రయత్నం మొదలు పెట్టింది. ఒకరిమీద ఒకరికి చాడీలు చెప్పటం మొదలు పెట్టింది.
అయితే ఈ విషయం ప్రహరి, ప్రియాంక ఇద్దరూ గుర్తించారు. అందుకని వాళ్ళు కావ్యని అసలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోసాగారు.
ఒక రోజున తెలుగు అయ్యవారు వచ్చి "ఇవాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పుకుందాం. నోట్సులు తీయండి" అన్నారు. ప్రహరి తన పుస్తకాల సంచీలో చూసుకుంటే నోట్సు లేదు! ఆమె ముఖం తెలవెలపోయింది. వెనక వరసలో ఉన్న కావ్య ఇది గమనించి "ఇందాక ప్రియాంక తీసుకున్నట్లున్నదే, నీ నోట్సును?!" అన్నది గుసగుసగా. సరిగ్గా అదే క్షణంలో ప్రహరికి గుర్తుకొచ్చింది- 'ఉదయం తను చదువుకున్నాక నోట్సును ఇంట్లో కుర్చీలో పెట్టి మర్చిపోయింది కదా, తను?!' అందుకని ఆమె చిరునవ్వుతో ప్రియాంకవైపు తిరిగి, "నేను ఇవాళ్ళ నోట్సు మరచిపోయి వచ్చినట్లున్నాను, నువ్వు రాసుకున్న నోట్సును ఇంటికి ఇచ్చావంటే, రేపు ఉదయాన్నే తెచ్చిస్తాను" అన్నది. "ఓ! దానిదేముంది, తప్పకుండా తీసుకెళ్ళు" అన్నది ప్రియాంక. వింటున్న కావ్య ముఖం మాడిపోయింది.
మరొకరోజున ఆటల్లో ప్రహరి, ప్రియాంకలు ఇద్దరూ వేరు వేరు బృందాలలో పడేట్లు చేసింది కావ్య. ఇద్దరూ పోటీ పడి ఆడటం చూసి, "అబ్బ! ఇప్పుడిక స్నేహం చెడుతుంది. గెల్చినవాళ్ళు ఓడిన వాళ్లని చిన్న చూపు చూస్తారుగా; ఓడినవాళ్ళు మూతిముడుచుకుంటారు" అనుకున్నది. కానీ ఆట అయిన వెంటనే ప్రహరి, ప్రియాంక ఇద్దరూ గట్టిగా నవ్వుకొని, "ఇవాళ్ళ ఆట భలే ఉంది కదూ, రోజూ ఇట్లా వ్యతిరేక పక్షాలలోనే ఆడదాం మనం. అట్లా ఇద్దరమూ బాగా ఆట నేర్చుకోవచ్చు!" అంటూ ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని చక్కా పోయారు!
చూస్తూన్న కావ్య నాలుక కరచుకున్నది గానీ, వాళ్ల పట్ల ద్వేషభావం మటుకు ఆమెలో ఏమాత్రం తగ్గలేదు.
ఒక రోజు తెల్లవారుజామున్నే కావ్య వాళ్ళ అమ్మానాన్నలు అకస్మాత్తుగా ఊరికి పోవలసి వచ్చింది. దాంతో కావ్య ఏమీ తినకుండానే బడికి వచ్చింది: "బడిలో ఎట్లాగూ మధ్యాహ్న భోజనం ఉంటుంది కదా!” అనుకున్నది ఆ పాప.
అయితే ఆ రోజున ఎందుకనో పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పెట్టలేదు. "ఇవాళ్ళ మీరంతా మీ మీ ఇళ్లకు వెళ్లి తిని రావలసి ఉంటుంది" అని ఉదయాన్నే అసెంబ్లీలో చెప్పారు. "ఏమీ పర్లేదులే" అనుకున్నది కావ్య. అయితే మధ్యాహ్నం అయ్యేసరికి ఆమె కడుపులో ఎలుకలు పరుగెత్త-సాగాయి. ఇంటికి వెళ్దామంటే ఇంట్లో అమ్మ-నాన్నలు లేరు! ఆ ఆలోచనతోటీ, నీరసంతోటీ ఆమె కళ్ళు తిరిగాయి. లేచి నిలబడిన కావ్య టక్కున తూలి పడబోయింది!
అయితే ప్రహరి-ప్రియాంక ఇద్దరూ ఆమెను పడకుండా పట్టుకున్నారు. ఆమెను కూర్చోబెట్టి, ప్రేమగా మాట్లాడి సంగతి తెలుసుకున్నారు. "దానిదేమున్నది, మా యింటికి రా!" అని ప్రహరి ఆమెను వాళ్ళింటికి తీసుకెళ్ళింది. వాళ్ళ అమ్మ తనకోసం చేసి పెట్టిన భోజనం పెట్టింది.
ఆ తర్వాత ముగ్గురూ కలిసి ప్రియాంక వాళ్ల ఇంటికి వెళ్ళారు. తన వంతు భోజనంలో సగాన్ని ప్రియాంక ప్రహరికి పెట్టింది. వాళ్ల ఆప్యాయతని చూసి కావ్య మనసు కరిగిపోయింది. 'తన పట్ల వాళ్లకు ఏమాత్రం ద్వేషభావం లేదు' అన్న ఆలోచనతో ఆ పాప కళ్ళలో నీళ్ళు తిరిగాయి. 'వాళ్ళని విడగొట్టాలని తను ఎందుకు, అంత ప్రయత్నించింది?' అని సిగ్గు పడింది. అటు తర్వాత తన మంచి ప్రవర్తనతో వాళ్ళకు తగిన స్నేహితురాలుగా తనూ ఎదిగింది. ఇప్పుడు "ప్రహరి-ప్రియాంక-కావ్య ముగ్గురూ మంచి స్నేహితులు" అని అందరూ చెప్పుకోవటం మొదలెట్టారు!