రామాపురంలో లింగయ్య అనే ఒక సన్నకారు రైతు నివసించేవాడు. అతని భార్య సీతమ్మ. ఆమె చాలా తెలివైనది. వాళ్ళకు ఇద్దరు ఆడ పిల్లలు. లింగయ్య చాలా మంచివాడు. ప్రతిరోజూ తోటకెళ్లి, వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు.
అయితే కాలం గడిచే కొద్దీ సమస్యలు పెరిగాయి. రసాయన ఎరువుల వాడకం వల్ల నేల చెడింది. దానికి తోడు వర్షాలు దెబ్బతీసాయి. పంట నష్టం మొదలైంది.
అయినా చేసేదేమున్నది? లింగయ్య ఏ ఏటికాయేడు అప్పులు చేసి వ్యవసాయం చేయడం, నష్టపోవడం జరుగుతూ వచ్చింది. ఇంట్లో పిల్లలు కూడా పెద్దవాళ్లు అవుతున్నారు- ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. చివరికి ఇల్లు గడవటం కష్టమయింది.
అయితే అదే క్రమంలో లింగయ్య సారాయికి అలవాటు పడిపోయాడు. వెంటనే జూదం కూడా మొదలెట్టాడు.
ప్రొద్దునే సారాయి త్రాగి, రోజంతా జూదం ఆడి, రాత్రి అయ్యేసరికి మళ్ళీ తాగి రాసాగాడు. "ఏ పనీ దొరక్క పోతే కూలికి వెళ్దాం. కానీ నువ్వు సారాయి త్రాగేందుకు, జూదం ఆడేందుకు వీలు లేదు. పిల్లలు ఏమనుకుంటారు?" అని మందలించేది సీతమ్మ. అయినా లింగయ్య ఆమె మాట వినలేదు సరికదా ఊర్లో అప్పులు చేసి మరీ త్రాగి రావటం మొదలెట్టాడు. రోజంతా మత్తులో జోగే లింగయ్య అసలు ఇప్పుడిక ఇంటి పరిస్థితులను అర్థం చేసుకునే దశలో లేడు.
తాగివచ్చి సీతమ్మతో గొడవ పడటం మొదలెట్టాడు. సీతమ్మ మంచి మాటలు ఆమెకే బరువు కాసాగాయి. ఆమె ఏమన్నా లింగయ్య వినిపించుకోవట్లేదు. పొలం-వ్యవసాయం, భార్య-పిల్లల గురించి కాక, రాత్రింబవళ్ళూ సారాయి గురించే ఆలోచన. లింగయ్య పరిస్థితిని గమనించిన సీతమ్మ ఊళ్లో కూలి పనికి పోవటం మొదలు పెట్టింది. "నేను ఆకలికి మాడితే పర్లేదు- కానీ పిల్లలున్నారు కద?" అని ఒకవైపున సీతమ్మ కూలి పని మొదలు పెడితే, అది గమనించని లింగయ్య తాగుడుకు ఇంకా బానిసై, ఊరంతా అప్పులు చేయటం మొదలెట్టాడు. చివరికి ఒక రోజున అప్పుల వాళ్లంతా ఒక్కసారిగా ఇంటిమీదకి వచ్చేసరికి, చేసేదేమీ లేక, సీతమ్మ తను దాచుకున్న కూలి డబ్బునంతా వాళ్లకి పంచేసింది.
రాను రాను లింగయ్యకు అప్పు కూడా దొరకడం కష్టం అయిపోయింది. డబ్బులు ఇవ్వమని భార్యతో రోజూ గొడవ పడటం మొదలు పెట్టాడు. అన్నింటికీ సీతమ్మ మౌనమే సమాధానమైంది.
అన్నేళ్ళ కాపురంలో ఆమెను పన్నెత్తు మాట అనని లింగయ్య ఇప్పుడు ఆమె చర్యల్ని తప్పు పట్టటం మొదలెట్టాడు. ఇష్టం వచ్చినట్లు తిట్టటం మొదలు పెట్టాడు. సీతమ్మకు ఏం చేయాలో తోచలేదు. తన పిల్లల భవిష్యత్తు ఏమై పోతుందోనని బాధపడింది. అతన్ని బాగు పరచేందుకు ఎంత మందిని అడిగినా ఎవ్వరి దగ్గరా సరైన సలహా దొరకలేదు.
ఒకరోజు సాయంత్రం సమయంలో పూటుగా సారాయి తాగి వచ్చాడు లింగయ్య. సీతమ్మ అతన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకోసాగింది. "ఇదిగో, నిన్నే.. వంద రూపాయలు ఇవ్వు" అన్నాడు లింగయ్య.
"దేనికి?" అన్నది సీతమ్మ.
"మగోడన్నాక లక్ష అవసరాలుంటాయి అన్నీ చెప్పాలా?" అన్నాడు లింగయ్య
"డబ్బులు అడుక్కునేవాడు అడుక్కునే-ట్లుండాలి. ఏమి అడిగితే దానికి సమాధానం చెప్పాల్సిందే. అయినా సారాయి త్రాగేందుకు నేను ఇంక డబ్బులు ఇవ్వను!" అన్నది సీతమ్మ గట్టిగా.
లింగయ్యకు కోపం వచ్చేసింది- చేతిలో ఉన్న చర్నాకోలను సీతమ్మ మీద ఝుళిపించాడు.
అంతవరకూ పిల్లిలా ఊరుకున్న సీతమ్మ ఆ క్షణంలో పులిగా మారింది. "క్షమయా ధరిత్రి" సీతమ్మ ఉగ్ర రూపం దాల్చిన మహాకాళి అయ్యింది. లింగయ్య చేతిలో చర్నాకోలను చటుక్కున లాక్కొన్నది. బొక్కబోర్లా పడిన లింగయ్యను దాంతోటే ఇష్టం వచ్చినట్లు వాయించింది.
"కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఇవన్నీ మీ మగవాళ్ళకేనా రా?! మాకు ఉండవా? మీ బాధల్ని మర్చిపోయేందుకు మీరు త్రాగుతారా? ఎన్ని కష్టాలు ఎదురైనా మరి మేమెందుకు త్రాగం రా?! ప్రశ్నంతా 'బాధ్యత' గురించేరా! మీకు బాధ్యత లేదు- మాకు ఉన్నది. ఇంటిని, పిల్లల్ని అందరినీ ప్రక్కన పెట్టేసి సారాయి మత్తులో ఊగేందుకు సిగ్గు లేదురా, మీకు?" అని గద్దిస్తూ చెలరేగిన సీతమ్మ ముఖంలోకి కూడా చూడలేకపోయాడు లింగయ్య.
ఆమె అరుపులు విని ఇరుగు పొరుగులందరూ పరుగెత్తుకొచ్చారు. ఝాన్సీ లక్ష్మిలాగా యుద్ధం చేస్తున్న సీతమ్మను ఆపేందుకు ప్రయత్నించారు. "మగవాళ్ళంతా ఇంతే" అని సర్ది చెప్పబోయిన ఇరుగు-పొరుగులందరికీ కూడా బాగా గట్టిగానే సమాధానం ఇచ్చింది సీతమ్మ. "చూస్తూండండి- ఇవాల్టి తర్వాత ఇతను తాగి వచ్చినప్పుడల్లా ఇలాగే కొడతాను. ఎవరు ఏం చేస్తారో చూస్తాను" అంటూ మళ్లీ ఒకసారి వాయించింది లింగయ్యను. ఆమెకు సమాధానం చెప్పలేక అందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు.
కొద్ది సేపటికి తన కోపం చల్లారాక, మెల్లగా తనే పోయి డాక్టరును పిల్చుకొచ్చి భర్తకు వైద్యం చేయించింది సీతమ్మ. "ఇదిగో చెబుతున్నాను- రేపు త్రాగి వచ్చావంటే మళ్ళీ దెబ్బలే" అని బెదిరిస్తూ. అయితే ఆమెకు ఇక మళ్ళీ చెయ్యి చేసుకోవలసిన అవసరం రాలేదు- స్వతహాగా మంచివాడైన లింగయ్య ఒకే దెబ్బకు కుదురుకున్నాడు.
ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ రోజూ కూలికి పోతున్నారు. డబ్బుల్ని పొదుపు చేస్తున్నారు. మరుసటి సంవత్సరం వానలు పడ్డాయి. పంటలు బాగా పండాయి. లింగయ్య-సీతమ్మల కష్టాలు తీరాయి. పిల్లల నవ్వులతో కుటుంబం మళ్ళీ సజావుగా నడవసాగింది!