1
మా ఇల్లు ఉండేది ఒక నదికి దగ్గర్లోనే. ఆ నది ఒడ్డునే ఒక పెద్ద రావి చెట్టు ఉంది. విశాలమైన కొమ్మలతో తెరిచిన గొడుగులా ఉంటుందది. ఆ చెట్టు వయసు మూడు వందల సంవత్సరాలు అనీ, చెట్టు తొర్రలో పాములుంటాయనీ చెప్పుకునేవాళ్ళు మా ఊరి జనం. కానీ అది నిజం కాదు. నేను, రహ్మాన్ కలిసి ఆ చెట్టు ఎక్కి, దాని తొర్రల్లోకి దిగి చూశాం కూడా. పాములు లేవు; పురుగులు లేవు. ఊరికే బూజు వాసన వేస్తూ కొద్దిగా చెమ్మగా ఉంటుందక్కడ- అంతే. కాకపోతే లోపలికి వెళ్ళినప్పుడు చీకటి వల్ల భయంగా ఉంటుంది.
ఆ చెట్టు క్రింద ఒక మట్టి దిబ్బ ఉంది. సలీమ్ అనే ముసలాయన ఎప్పుడూ ఆ దిబ్బ మీద కూర్చుని ఉంటాడు. మా ఇంటి వెనక ప్రహరీ గోడ ఆ దిబ్బకి ఆనుకుని ఉంది. సలీమ్ తాత రోజూ ఉదయం నుండి రాత్రి వరకూ అక్కడే కూర్చొని నది వైపు చూస్తూ, జోగుతూ ఉంటాడు.
'తాతకు అక్కడ ఏమి కనపడుతున్నదో' అని నేను ఒక్కోసారి ఆశ్చర్యపోయేవాడిని. అయినా ఆయనకు అదేదో పిచ్చి అయి ఉండాలి- చూసేందుకు మా నదిలో ఏమీ లేదు- కనీసం ఒక్క చేప కూడా కనిపించదు!
నా అంచనా ఏమిటంటే- సలీమ్ తాత 'అంతు చిక్కని అంతరంగం కల ముదుసలి'. (ఈమాట నేను చదివిన ఓ పుస్తకంలోదిలే). ఆయన ఆలోచనలు నాకే అర్థం కాక నేను ఏడుస్తుంటే, మరో ప్రక్కన నా స్నేహితుడు రహ్మాన్ ఆయన్ని గురించిన ప్రశ్నలతో నన్ను ఊపిరి తీసుకోనివ్వడు:
“ఆ చెట్టులో ఏదో రహస్యం ఉంది.. లేకుంటే రాత్రి, పగలు కాపలా కాయడు. అయితే రహస్యం చెట్టు తొర్రల్లో లేదు- లోపల అంతా వెతికి చూశాం కదా, మనం?! అది ఇక్కడే ఎక్కడో ఉంది" అన్నాడు రహ్మాన్.
“అదేం లేదు, అలా చూస్తూ ఆ దిబ్బ మీద కూర్చోవడం అతనికి కాలక్షేపం. ఒక్కొక్క బఠానీ తింటూ నది వైపు చూస్తూ సంవత్సరాల కాలం గడుపుతున్నాడు ఆయన" అన్నాను నేను.
రహ్మాన్ ఒక్క సారిగా గంతు వేసాడు- "ఆఁ! నువ్వు మట్టి దిబ్బ అనేసరికి నాకు అర్థం అయిపోయింది! రహస్యం ఏదో ఆ మట్టి దిబ్బ క్రిందే ఉంది. నాకు గట్టి నమ్మకంగా కూడా ఉంది! నిజం!! ఎంతకైనా పందెం!" అన్నాడు హుషారుగా. "మట్టి దిబ్బ క్రిందనా?!” అడిగాను నేను, అనుమానంగా.
“అవును మురాద్! నువ్వే ఆలోచించు!! సలీమ్ తాత మనల్ని ఎవ్వర్నీ ఆ దిబ్బ దగ్గరికి కూడా రానీయడు. అక్కడే కూర్చొని ఉంటాడు; రాత్రింబవళ్ళూ దానికి కాపలా కాస్తాడు. బాగా ఆలోచించి చూడు- అతను ఆ దిబ్బ క్రింద ఏదో రహస్యాన్ని దాచి ఉంచుతున్నాడని అర్థం అయిపోతుంది నీకు కూడా!!” అన్నాడు రహ్మాన్.
నేను మౌనంగా తల ఊపాను. "అవును! రహ్మాన్ చెప్పాక నాకు ఇప్పుడు ఆ సంగతి గోడ మీద రాసినంత స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు ఇంతవరకూ?! రహ్మాన్ ఎప్పుడూ నేర పరిశోధన పుస్తకాలు చదువుతుంటాడు. అందుకే అతనికి ఈ ఆలోచన తట్టి ఉంటుంది.."
ఆలోచనల్లో పడ్డ నన్ను రహ్మాన్ తనకి దగ్గరగా లాక్కొని, సలీమ్ తాత వైపు చూపిస్తూ గుసగుసలాడాడు- "జాగ్రత్తగా విను మురాద్, మనం ఆ దిబ్బని త్రవ్వి, దాని రహస్యం ఏంటో కనిపెడితే మనకి పరీక్షలో మొదటి మార్కు వస్తుంది. ఆ తర్వాత మన ఉపాధ్యాయులు ఇంక మనల్ని ఏ ప్రశ్నలూ కూడా అడగరు. అసలు శాస్త్రజ్ఞులు శాస్త్రజ్ఞులు ఎట్లా అవుతారో తెలుసా, నీకు? ముందు ఏ పాత కుండ పెంకులో, ఇనుప గొడ్డళ్ళో భూమి నుండి త్రవ్వి తీస్తారు వాళ్ళు. ఆ తర్వాత దానికి కొంచెం చరిత్ర జోడించి, అట్లా శాస్త్రజ్ఞులు అవుతారు- తెలుసా?! మనం కూడా ఈ దిబ్బలో ఉన్న రహస్యాన్ని త్రవ్వి తీస్తే శాస్త్రజ్ఞులం కావొచ్చు, ఏమంటావు?” అన్నాడు.
'శాస్త్రజ్ఞులు కావడం అంత సులభం కాదు' అని నేను చాలా సార్లు విన్నాను- కానీ ఇప్పుడు రహ్మాన్ మాటల వల్ల నాలో కోరిక మొదలైంది- “నిజమే అనుకుంటాను; కానీ...” అన్నాను.
“ఏమిటి, నీ సందేహం?” అన్నాడు రహ్మాన్ చిరాగ్గా.
“సలీమ్ తాత అన్ని సమయాల్లోనూ దాని మీదే కూర్చుని ఉంటాడు. ఇంక అక్కడ త్రవ్వేది ఎలా?” అన్నాను నేను.
"హా! దానిదేముంది, అది రెప్పలార్పినంత సులభం. నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి, చాలు!" అన్నాడు రహ్మాన్.
నాకు ఎందుకో వాడి ఈ ముచ్చట అంతా కొంచెం ఇబ్బందికరమేమో అనిపించింది. అయినా ఒప్పుకోక తప్పేట్లు లేదు-
“ఇందులో మోసపు పనులు ఏమీ లేవు కదా?” అన్నాను.
“ఇందులో మోసం ఏముంది? మనం మీ తోట లోపలి వైపు నుంచి ఆ మట్టి దిబ్బ వరకు సొరంగం తవ్వుదాం. ఆ సొరంగం కూడా ఏమంత పెద్దది కాదు. వేస్తే తీస్తే బహుశా రెండు మీటర్లు ఉంటుందంతే. మెల్లమెల్లగా త్రవ్వుకుంటూ పోతే నేరుగా తాత కూర్చున్న చోటుకు చేరతాము; రహస్యం ఏంటో తెలిసిపోతుంది. ఒకవేళ ఏమీ కనిపించలేదనుకో; సొరంగాన్ని మామూలుగా పూడ్చి పెట్టేద్దాం, అంతే! అదేమంత పని కాదు!" అన్నాడు వాడు.
నేను హుషారుగా "సరే" అన్నాను.
2
ఇద్దరం మా పెరట్లోకి చేరాం. నేను మా పలుగు-పార తెచ్చాను. అప్పటికప్పుడే పని ప్రారంభించాము. ఐదు రోజులపాటు సొరంగం త్రవ్వాము. రహ్మాన్ సొరంగంలో ఉండి త్రవ్వేవాడు. మన్నును బక్కెట్ లో నింపి ఇచ్చేవాడు. ఆ ఇసకను, మన్నును బయటికి తీసుకెళ్ళి దూరంగా పారబొయ్యటం నా పని. ఆ సమయంలో నిండా మన్నుతో కప్పబడిపోయిన మా శరీరాలని చూస్తే మాకే నవ్వు వచ్చేది. ఏమంటే ఇదంతా ఏమాత్రం సద్దు లేకుండా చేయవలసి వచ్చింది - సలీమ్ తాత గోడ అవతలే దిబ్బ మీద కూర్చుని ఉన్నాడుగా, మరి?!
ఆరో రోజు త్రవ్వుతూ పోతుంటే హఠాత్తుగా పారకి ఏదో గట్టిగా తగిలినట్లు శబ్దం అయింది. రహ్మాన్ వగరుస్తూ "ఇంక ఇప్పుడు త్రవ్వటం ప్రమాదం. ఇంక కాసేపట్లో సలీమ్ తాత భోజనానికి వెళ్తాడు.. ఆయన అట్లా వెళ్ళగానే మళ్ళీ మొదలు పెట్టచ్చు మనం. పని దగ్గర పడింది. ఇంక ఒకటో రెండో బక్కెట్ల మన్ను తీస్తే చాలు- రహస్యం బయట పడుతుంది. గోడ మీద నుండి చూడు.... సలీం తాత గానీ ఈ శబ్దాన్ని విన్నాడో, ఏమో!” అన్నాడు గుసగుసగా.
నేను గోడ మీద నుండి తొంగి చూశాను. తాత కదలకుండా దిబ్బ మీద కూర్చుని ఉన్నాడు. ఏదో పుస్తకం-ఒక్కో పేజీ చదువుతున్నాడు; ప్రక్కనే పాత్రలో ఉన్న 'టీ' ని చప్పరిస్తున్నాడు. శబ్దం ఏమీ విన్నట్లు లేదు.
“అబ్బబ్బ! ఆ పనికిమాలిన పుస్తకం చదివి ఏం చేస్తాడట, ముసలాయన? భోజనం సమయం అయింది గదా; ఇంక వెళ్తేనేమి?” అన్నాడు రహ్మాన్ అసహనంగా.
మాకు కూడా చాలా ఆకలిగా ఉంది. 'తాత వెళ్ళేలోగా ఏదైనా తిని వద్దాం' అని మేమే ముందుగా ఇంట్లో లోపలికి వెళ్ళాం. ఏదో కొంచెం తిని వచ్చేప్పటికి సలీమ్ తాత దిబ్బ మీద లేడు!
నేను, రహ్మాన్ గబగబా సొరంగంలోకి వెళ్ళి త్రవ్వి చూశాం. అక్కడొక పింగాణీ కూజా ముక్క, మట్టి గొట్టుకుని ఉన్న గొర్రె ఎముక తప్ప ఏమీ లేవు.
“సరే- ఇంకొంచెం త్రవ్వి చూద్దాం. ముందు ఈ మన్నుని బయట పోసి రా!" అంటూ నా చేతికి బక్కెట్ ఇచ్చాడు వాడు. నేను బక్కెట్టు తీసుకుని బయటికి వచ్చానో లేదో- దబదబామంటూ శబ్దం- నా గుండె పగిలినట్లు అనిపించింది. బక్కెట్టు క్రింద పడేసి వెనక్కి తిరిగి చూసేసరికి, రహ్మాన్ ప్రాకుతూ వస్తున్నాడు నేలలోంచి. అక్కడ మేం త్రవ్విన సొరంగమే లేదు! వాడి ఒంటి నిండా మట్టి- భయంతో నా ఒళ్ళు చల్లబడిపోయింది.
“మట్టి తిన్నె కూలిపోయింది! ఒక వారగా అదంతా విరిగి పడిపోతుండటం కనిపించింది నాకు! దాంతో గభాల్న చివరి క్షణంలో తప్పించుకున్నాను. లేకపోతే సజీవంగా సమాధి అయిపోయి ఉండేవాడిని!" అన్నాడు వాడు రొప్పుతూ.
నేను ఆందోళనగా గోడ ఎక్కి చూశాను. మట్టి దిబ్బ విరిగిపడి, చెట్టు క్రింద తొర్రలాగా ఏర్పడి ఉన్నది. 'ఇంకా నయం- ఆ ముసలాయన వెళ్ళిపోయాడు. లేకపోతే ఆయన కూడా గుంటలో పడిపోయేవాడు; గొప్ప ప్రమాదమే జరిగి ఉండేది'.
"హమ్మయ్య, తాత అక్కడ లేడు- మంచిదయింది!" అన్నాను ఊపిరి పీల్చుకుంటూ.
“సరేలే! త్వరగా రా! అందరూ వచ్చి చూడకముందే మనం సొరంగాన్ని మూసేయాలి!" అన్నాడు రహ్మాన్.
"మరి మట్టి దిబ్బ మాటేమిటి?" అన్నాను అతని వైపు పిచ్చివాడిలాగా చూస్తూ.
“దాని కాలం చెల్లి కూలిపోయిందని అనుకుంటారు- ఏమీ పర్లేదు. అయితే మనం ముఖ్యంగా గోడ ఇవతలి ప్రక్కన ఉన్న సొరంగాన్ని మూసివేయాలి, దా! దా!” అన్నాడు.
మేము గబగబా సొరంగాన్ని మట్టితో నింపి గట్టి చేసాం. తోట మూలన ఉన్న పాత కొయ్యలని లాక్కొని వచ్చి దాని మీద కప్పాం.
అంతలో తాత వస్తున్న అలికిడి అయ్యింది. ఇద్దరం గోడ మీదికి ఎక్కి, నక్కి చూశాం. సలీమ్ తాత చెట్టు దగ్గర నిలబడి, తొర్రలోకే చూస్తున్నాడు. అతని ముఖంలో దీనత్వం మాకు స్పష్టంగా కనపడుతోంది. అతనిప్పుడు వంగి, అక్కడ ఉన్న మట్టి పెళ్ళలని అటూ ఇటూ తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాడు. కొద్ది సేపు ప్రయత్నించాక అది అసాధ్యం అనిపించినట్లుంది- నిస్సహాయంగా అటు ఇటు చూసి, కాసేపు అట్లాగే నిలబడి ఏడ్చాడు. ఆపైన తేరుకొని, మెల్లగా చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళేప్పుడు అతని కాళ్ళు తడబడి, చాలా సార్లు పడబోయాడు.
మేమిద్దరం ఒకరి ముఖాలు ఒకరం చూసుకోలేకపోయాము. మోకాళ్ళ మీద తల ఆన్చి మౌనంగా బొమ్మ మాదిరి అలాగే చాలా సేపు కూర్చుండిపోయాడు రహ్మాన్.
వణికే చేతులతో తాత మట్టి పెళ్ళలను తొలగించడానికి ప్రయత్నించటం, ఎత్తలేక ఏడవటం- ఆ దృశ్యం నా కళ్ళ ముందే మెదల సాగింది. నా గొంతులోంచి మాట పెగలలేదు. చాలా బాధ వేసింది.
కాసేపటికి రహ్మాన్‌తో "ఏంటి, నువ్వు చేసిన పని?!” అన్నాను.
“అంటే తప్పంతా నాదేనంటావా? ఆ పాత మట్టి దిబ్బ కూలితే దానికి నేనే బాధ్యుడినా?” అన్నాడు బాధగా.
“అవును- ఇదంతా నీ పిచ్చి భ్రమల వల్లనే కదా, జరిగింది!" అన్నాను.
“అయినా నేనేమీ నిన్ను బలవంతం చేయలేదే! నీకై నువ్వు కూడా 'దిబ్బ క్రింద ఏముందో చూద్దాం' అని వచ్చావుగా?" అన్నాడు వాడు. నేను ఏమీ మాట్లాడలేదు.
"ఇంకా అదృష్టవంతులం- మనల్ని ఎవరూ చూడలేదు. ఇప్పుడు నువ్వు 'ఇదంతా నా వల్లే జరిగింది' అని అందరికీ టాం టాం వేస్తావా?” రహ్మాన్ గొంతు ఏడుపుతో బొంగురుపోయింది. కళ్ళ నీళ్ళు తుడుచుకుంటున్నాడు. నాకు వాడిమీద జాలి వేసింది. మట్టి తిన్నె విరిగి పెళ్ళలు మీద పడ్డప్పుడు కూడా వాడు అరవలేదు- నిశ్శబ్దంగా ఓర్చుకుని ఉండిపోయాడు.
నేను అనునయంగా వాడి భుజం మీద చెయ్యి వేసి "రహ్మాన్, ఊరుకో. బాధపడకు. ఇందులో నా తప్పు కూడా ఉందిలే; అసలు మనం సొరంగం త్రవ్వకుండా ఉండాల్సింది" అన్నాను.
ఎవరి ఆలోచనల్లో వాళ్ళం కాసేపు అలాగే కూర్చుని, లేచి, ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయాం.
3
ఇంటికి వెళ్ళాక కూడా మనసు అదోలాగా ఉండింది. ఏదైనా చదువుకుందామని పుస్తకం చేతిలోకి తీసుకున్నాను కానీ ఒక్క పేజీ కూడా ముందుకు నడవలేదు.
సాయంత్రం అవుతుండగా నాన్న ఇంటికి వచ్చాడు. మామూలుగా సరదాగా ఉండే నాన్న ఇవాళ్ళ ఎందుకనో దిగులుగా ఉన్నాడు. ఇంకా దుస్తులు మార్చుకోలేదు- వచ్చిన కాసేపటికే అమ్మతో కలిసి మళ్ళీ బయటికి బయలుదేరాడు.
వెళ్తూ వెళ్తూ అమ్మ అన్నది- "మురాద్! ఈరోజుకి నువ్వే భోజనం వడ్డించుకుని తినెయ్యి. మేం సలీమ్ తాత వాళ్ళ ఇంటికి వెళుతున్నాం. ఆయన- పాపం, జబ్బు పడ్డాడట. డాక్టరుగారిని పిలుచుకు వచ్చి చూపించాలి. ఏమైనా ఆహారం కూడా తయారు చేసి తినిపించాలి. వచ్చేప్పటికి మాకు ఆలస్యం అవుతుంది" అంది.
సరేనన్నట్లుగా తల ఊపాను.
నేను ఏదో కాస్త తిని అమ్మనాన్నల కోసం ఎదురు చూస్తూ పడుకున్నాను. యుగాలు గడిచినట్లుగా ఉంది. బయట అంతా చీకటి. గడియారం పది గంటలు కొట్టటం వినబడింది. నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను.
ఉదయాన్నే రహ్మాన్ వచ్చి లేపాడు. వాడి ముఖం వాడిపోయి ఉంది.
“నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏవేవో పీడకలలు వచ్చాయి!" అన్నాడు. వాడి గొంతు వణుకుతోంది. “సలీం తాత జబ్బు పడ్డాడట. రాత్రి అమ్మనాన్న డాక్టర్ని పిల్చుకొచ్చేందుకు వెళ్ళారు. ఆయన ఎలా ఉన్నాడో ఏంటో. నీకేమైనా తెలుసా?” అడిగాను.
“తెలుసు, మా అమ్మ కూడా ఇప్పుడు తాత దగ్గరే ఉంది-" అన్నాడు వాడు.
“మనం కూడా వెళదాం పద. తాతకి పాపం, లడ్డూలంటే చాలా ఇష్టం. కొన్ని లడ్డూలు తీసుకు వెళ్దాం-" అన్నాను. ఇద్దరం తాత ఇంటి వైపుకి నడుస్తుంటే వెనక నుండి లారీ వచ్చి ఆగింది. అందులో మా నాన్న ఉన్నాడు- పట్టణం నుండి ఇటుకలు తెస్తున్నాడు.
“ఎక్కడికబ్బాయ్, బయలు దేరారు?” అన్నాడు నాన్న, లారీని మాకు ప్రక్కగా ఆపించి. “సలీం తాతకు లడ్డూలు ఇచ్చి వద్దామని వెళ్తున్నాం" అన్నాను.
"సరే రండి, లారీకూడా ఆ వీధిలోకే వెళ్తున్నది" అని మమ్మల్ని లారీలోకి ఎక్కించుకున్నాడు నాన్న.
లారీ డ్రైవర్‌తో నాన్న సలీమ్ తాత గురించే చెప్తున్నాడు. నన్ను చూపిస్తూ "..వీడు అప్పుడు నెలల బాబు. మీ ఒదిన వీడిని ఎత్తుకొని నది ఒడ్డున నడుస్తున్నదా, ఒక్కసారిగా కాలు జారి, దొర్లుకుంటూ వెళ్ళి, నదిలో పడింది- పిల్లాడితో సహా! సరిగ్గా ఆ సమయానికి ఒడ్డున నిలబడి ఉన్నాడు సలీం తాత కొడుకు మహమూద్. వాడు నీళ్ళల్లోకి దూకి తల్లిని-వీడిని ఇద్దరినీ కాపాడాడు. లేకపోతే వీళ్ళిద్దరూ దక్కేవాళ్ళుకాదు నాకు-"
“అయితే వెంటనే మహమూద్‌కి- ఆ నీళ్ళ వల్లనే- చలి జబ్బు ఏదో పట్టుకుంది. అందరం ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. మహమూద్ మాకెవ్వరికీ దక్కకుండా పోయాడు. సలీం తాతకి ముసలితనంలో కొడుకు ఆసరా లేకుండా పోయింది.. మహమూద్ కవితలు రాసేవాడు. తను రాసిన కవితలతో ఓ పుస్తకాన్ని కూడా ప్రచురించి ఉన్నాడు అప్పటికే.
సలీం తాత దగ్గర కొడుకుకు గుర్తుగా వాడు రాసిన పుస్తకం కాపీ ఒక్కటి మాత్రమే మిగిలింది. వాడు రాసిన కవితల్ని చదువుకుంటూ ఎప్పుడూ ఆ చెట్టు క్రింద దిబ్బ మీద కూర్చోసాగాడు ఆయన. మేం ఊరికే చూడటం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాం.."
నాన్న కొనసాగించాడు.
"..నిన్న ఆ దిబ్బ కూలిపోయింది. మహమూద్ రాసిన పుస్తకాన్ని చదువుతూ చదువుతూ ఆ దిబ్బమీదే పెట్టుకున్నాడట సలీం తాత. అది కూడా ఇప్పుడు ఆ మట్టిలో కలిసిపోయింది. 'ముసలాయన ఆ పుస్తకం కోసం దిగులేసుకున్నాడేమో- ఎవరైనా కొంచెం వెతికి పెట్టండి' అన్నాడు డాక్టర్. రేపన్నా సమయం చూసుకుని వెళ్ళి ఆ పుస్తకం కోసం వెతకాలి.." అని నాన్న అన్నాడు.
వింటున్న నాకు గుండె చెరువయ్యింది. తెలియకుండానే నా కళ్ళ వెంట నీళ్ళు కార- సాగాయి.
అంతలోనే లారీ ఆగింది. క్రిందికి దిగగానే రహ్మాన్ నా చెయ్యి పట్టుకుని "ముందు మీ ఇంటికి వెళ్దాం పద- మట్టి దిబ్బ క్రింద తాత పుస్తకం కోసం వెతకాలి" అన్నాడు. వాడి ముఖం కూడా తడి తడిగా ఉంది.
“అవును పద! పుస్తకంతో సహా వద్దాం, అప్పుడు తాత సంతోషంతో లేచి కూర్చుంటాడు" అన్నాను. ఇద్దరం గబగబా వెనక్కి పరుగెత్తాం.
“ఎంత సేపు!? రెండు పారల మట్టి తీశామంటే క్షణంలో పుస్తకం దొరుకుతుంది" అన్నాను. “ఏమిటీ, పారతోనా!? లేదు లేదు-ఇది పుస్తకం. మనం మట్టిని జాగ్రత్తగా చేతుల్తోటే తీయాలి!" అన్నాడు రహ్మాన్. “అవును కదా!” అన్నాను.
దిగబడిపోయిన దిబ్బ దగ్గరికి వెళ్ళి, జాగ్రత్తగా చేతులతో మట్టిని తీయడం మొదలుపెట్టాం. దాదాపు మూడు గంటలు పని చేయగా మాకు పుస్తకం కనిపించింది. దాన్ని చూడగానే మాకు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది.
దాన్ని జాగ్రత్తగా పైకి తీసి, మట్టి దులిపి, మడత పడిన పేజీలను సరిచేశాం. మా అదృష్టం కొద్దీ పుస్తకానికి ఏమీ కాలేదు!
“పద! వెంటనే వెళ్ళి తాత బాకీ తీరుద్దాం. నేను పుస్తకాన్ని ఇస్తాను; నువ్వు లడ్డూలు ఇవ్వు" అన్నాడు రహ్మాన్.
“కాదు కాదు, నేను పుస్తకాన్ని ఇస్తాను. నువ్వు లడ్డూలు ఇవ్వు!" అన్నాను నేను.
"సరేలే, ఆయనకి క్షమాపణలు చెప్పుకుని, మనిద్దరి చేతులూ పుస్తకం మీద వేసి ఇద్దాం" అన్నాడు రహ్మాన్ నవ్వు ముఖంతో. మాకిద్దరికీ తెలుసు- ఇక సలీం తాతకేమీ భయంలేదు!