చాలా ఏళ్ళ క్రితం పశువులు, జంతువులు అన్నీ అడవుల్లోనే పెరిగేవి. క్రూర జంతువులు వాటిని చంపేవి; అవేకాక మనుషులు కూడా మాంసం కోసమూ, ఇతర అవసరాల కోసమూ వాటిని వేటాడి చంపేస్తుండేవాళ్ళు. పులులు, సింహాల్లాంటి మాంసాహార, క్రూర జంతువులు వాళ్లకి అంత సులభంగా దొరికేవి కావు గానీ, పశువులు మటుకు, పాపం, అలవోకగా దొరికి
పోతుండేవి.
అలా రాను రాను అడవిలో తిరిగే శాకాహార పశువుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది.
కొన్నాళ్లకు అడవిలోని ఆవులు, ఎద్దులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. "మనల్ని మనం కాపాడుకునేది ఎట్లాగ? మన జాతికి భద్రత లేకుండా పోతున్నదే, ఏం చేయాలి?" అని ఆలోచించేందుకు.
"మానవులు, పులుల్లాంటి క్రూరజంతువులు మన మాంసాన్ని తింటూ పండగలు చేసుకుంటున్నాయి. అందుకనే మన సంఖ్య తగ్గిపోతున్నది. ఇలా అవుతుంటే చివరికి మనం పూర్తిగా అంతరించేపోతాం. దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలి” అనుకున్నాయి అన్నీ.
వాటిలో ఉన్న కోదండం అనే ఆవు “నాకు ఒక పరిష్కారం తోస్తున్నది. నాకు తెలిసిన జింకల జంట ఒకటి ఇక్కడికి దగ్గర్లోనే ఒక ఋషి ఆశ్రమంలో ఉన్నది. ఆ ఋషి మనకు సాయం చేయగలడనిపిస్తున్నది. నేను ఆయన దగ్గరికి వెళ్ళి వస్తాను” అని బయలుదేరింది.
జింకల పరిచయంతో అక్కడికి వెళ్ళిన ఆవును నిమురుతూ ఋషి “నువ్వు ఏమి ఆశించి ఇక్కడికి వచ్చావు, కోదండం?” అని అడిగాడు.
ఆవు ఆయనకి నమస్కరం చేసి ”స్వామీ! ఈమధ్య మా ఆవుల సంఖ్య, ఎద్దుల సంఖ్య బాగా తగ్గిపోతున్నది. అడవులు మాకు నివాస యోగ్యంగా లేవు. ఒకవైపు నుండి మానవులు, మరొక వైపునుండి క్రూరమృగాలు మమ్మల్ని వేటాడుతున్నాయి.
ఇప్పటికే మా సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇది గనక ఇలాగే కొనసాగితే 'ఆవులు చూసేందుకు కూడా దొరకని' పరిస్థితి వస్తుంది. మీ సాయం కోరి వచ్చాను. మీరే ఏదైనా చెయ్యాలి” అని ప్రాధేయపడింది.
“నీ బాధ నాకు అర్థమైంది తల్లీ! నీ సమస్యను నేను పూర్తిగా పరిష్కరించలేక పోవచ్చు; కానీ మీ జాతికి ఒక వరం ఇవ్వగలను. ఆ వరం కారణంగా మీ జాతి నిలబడుతుంది" అన్నాడు ఋషి, కొంచెం ఆలోచించి.
“దయచేసి చెప్పండి’ అని వేడుకున్నది ఆవు.
"ప్రాణులన్నిటికీ ఒక లక్షణం ఉన్నది తల్లీ! ఏ జీవి అయినా సరే, తనకు పాలు ఇచ్చిన తల్లిని గౌరవిస్తుంటుంది, ప్రేమిస్తుంటుంది. మనిషి స్వభావం కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఇకమీద నువ్వు ఇచ్చే పాలను మానవులంతా త్రాగేట్లు ఏర్పాటు చేస్తాను. అప్పుడు నువ్వు ఆ మానవులకు స్వయంగా తల్లివౌతావు. తల్లిని పిల్లలు చంపరు కద! అలా మీ జాతికి నర భయం ఉండదు.
అంతేగాక, నీ పాలు త్రాగి ఆరోగ్యవంతులైన మానవులు మీ జాతికి రక్షకులుగా కూడా నిలుస్తారు. మిమ్మల్ని క్రూర జంతువుల బారి నుండి కూడా కాపాడతారు!” అన్నాడు ఋషి.
ఆనాటినుండి ఆవులు,ఎద్దులు మానవులకు దగ్గరయ్యాయి. ఎద్దులు వ్యవసాయంలో మనిషికి సాయం చేస్తున్నాయి; ఆవులు పాలు ఇస్తున్నాయి. మనిషి ఆవుల్ని పెంచుతున్నాడు. వాటికి క్రూరమృగాలనుండి రక్షణ కల్పిస్తున్నాడు. పశుసంపద తోడవ్వటంతోటే మానవ సమాజం గతిశీలమైంది!