అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక బడి. ఆ బడిలో మంచి మాస్టారుగారు ఒకాయన ఉండేవాడు. ఆయన పేరు బాలాజీ రావు.
టీచర్ల యూనియన్లలో ఆయనకు చాలా మంచి పేరు, పదవి ఉండేవి. అయినా ప్రతిరోజూ క్రమం తప్పకుండా బడికి కరెక్టు సమయానికి వచ్చేవాడాయన. పిల్లలకు చాలా చక్కగా పాఠాలు చెప్పేవాడు. సరైన సమయానికి సిలబస్ మొత్తం పూర్తి చేసేవాడు. చదువుతో పాటు, పిల్లలకు జీవితానికి సంబంధించిన విలువలు నేర్పేవాడు. అందుకోసం ఆయన రకరకాల ప్రయోగాలు చేస్తుండేవాడు.
వాటిలో భాగంగా ఒకరోజున ఆయన పిల్లలందరిని పిలిచి "చూడండి పిల్లలూ! మనందరం ప్రతిరోజూ ఏదో ఒక విషయం గురించైనా అబద్ధాలు చెబుతుంటాం. అవునా, కాదా?" అని అడిగాడు.
"అవును సార్!" ఒప్పుకున్నది లక్ష్మి.
"లేదు సార్! నేను అస్సలు అబద్ధాలు చెప్పను- కావాలంటే మా అమ్మని అడగండి" అన్నాడు రవి.
వెంటనే పిల్లలంతా కొందరు "మేం చెబుతాం" అనీ, కొందరు "మేం చెప్పం" అనీ గోలగోలగా అరిచారు.
"సరే! సరే! మీలో కొందరు అబద్ధాలు ఆడుతున్నారు; కొందరు ఆడట్లేదు. కానీ ఆ సంగతులేవీ నాకు ఇన్నాళ్ళుగా తెలీదు. ఎందుకు తెలీదు, చెప్పండి?!" అడిగారు బాలాజీరావు మాస్టారు.
"ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఎప్పుడూ మమ్మల్ని అడగలేదు" సూటిగా అనేసాడు సూరి.
"అవును సార్! మమ్మల్ని అడిగి ఉంటే మేం చెప్పేవాళ్లం, నిజంగా!" అన్నది కల్యాణి, ముసి ముసిగా నవ్వుతూ.
"లేదు సార్! అడిగినా ఎవ్వరూ చెప్పరు" అన్నాడు సురేష్ "ఊరికే అబద్ధాలు చెప్పేస్తారు!" అని పెదవి విరుస్తూ.
"మరి, అబద్ధాల గురించి తెలుసుకోడానికి ఇంక వేరే మార్గం ఏమున్నది?" అడిగారు మాస్టారు నవ్వుతూ. పిల్లలంతా ఆలోచనలో పడ్డారు.
"వేరే ఏమీ దారి లేదు. నేను మీ మాటని నమ్మదలచుకున్నాను అంతే. ఇప్పటినుండి ఒక నెలరోజులపాటు ప్రతిరోజూ నేను మిమ్మల్ని అడుగుతాను- క్రితం రోజున ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పారో నాకు చెప్పాలి ఒక్కొక్కరే. మీరు ఏది చెబితే దాన్ని ఇదిగో, ఈ నోట్సులో రాసుకుంటాను. నెల పూర్తయ్యాక, ఎవరు తక్కువ అబద్ధాలు చెబుతారో వాళ్లకు ఒక చిన్న బహుమతి" "బహుమతి కోసం కావాలని ఊరికే అబద్ధాలు చెప్పినా చెప్పలేదని చెబుతారు సార్!" అరిచాడు సూరి అసంతృప్తితో.
"చెప్పినా, చెప్పకపోయినా, చెప్పక తప్పదని చెప్పేసినా, చెప్పుదామనుకున్నా, అన్నీ చూసుకునేందుకు నేను ఉన్నాను కదా!" అని నవ్వారు బాలాజీరావుగారు.
తరువాతి రోజున మాష్టారు గారు క్లాసుకు రాగానే ఒక్కొక్కరిని లేపి, "ఎన్ని అబద్ధాలు ఆడావు?" అని అడిగారు. ఒకరు "నేను 24 అబద్ధాలు ఆడాను" అని అన్నారు. వెంటనే మాష్టారు "నీకు పదికి 9 మార్కులు" అన్నారు.
రెండోవాడు నేను 18 అబద్ధాలు ఆడాను" అన్నాడు.
వెంటనే మాస్టారు "అయితే నీకు కూడా 9 మార్కులు" అన్నారు.
"నేను అస్సలు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు సార్" అన్నాడొక పిల్లవాడు.
"నిజంగానా?!" అన్నారు మాస్టారు ఆశ్చర్యంగా.
"నిజ్జమంటే నిజం సార్" అన్నాడు వాడు.
"అయితే నీకు పదికి పది మార్కులు! అందరూ వీడికోసం చప్పట్లు కొట్టండి" అన్నారు బాలాజీరావు మాస్టారు.
వాడు చాలా గర్వంగా ఫీలయి కొంచెం నిటారుగా కూర్చున్నాడు.
తర్వాత పిల్లాడు "నేను కూడా అస్సలు అబద్ధం చెప్పలేదు సార్" అన్నాడు నవ్వుతూ.
"అయితే నీకు 2 రెండు మార్కులు" అన్నారు మాస్టారు కూడా నవ్వుతూ.
వాడు ఆశ్చర్యపోయి చటుక్కున కూర్చున్నాడు.
అట్లా మొదలైన ఆ కార్యక్రమం నెల పొడుగునా సాగింది.
నెల గడిచాక బాలాజీరావు మాస్టారు రిజిస్టరును పిల్లలకే ఇచ్చి, ఎవరి అబద్ధాల మార్కుల్ని వారు కూడి మొత్తం చేయమన్నారు.
కొందరికి ఎక్కువ మార్కులు, కొందరికి తక్కువ మార్కులు వచ్చాయి. కొంతసేపు అందరూ గొడవ గొడవగా వాళ్లకొచ్చిన మార్కుల మంచి చెడ్డల గురించి మాట్లాడుకున్నారు. కొందరు పిల్లలు మాస్టారి దగ్గరకొచ్చి నిలబడి, "మేం అసలు అబద్ధాలు చెప్పకపోయినా మీరు మాత్రం మాకు తక్కువ మార్కులే ఇచ్చారు సార్" అన్నారు ఏడుపు ముఖాలతో.
"చూడండి, మీరందరూ చాలా మంచి పిల్లలే. పోయి కూర్చోండి. ఈ మార్కులన్నీ ఒట్టివే. ఎందుకో నేను చెబుతాను, వినండి. ముందు వెళ్ళి కూర్చోండి" అని వాళ్లందరినీ వెనక్కి పంపి కూర్చోబెట్టి, అప్పుడు చెప్పారు- "చూడండి పిల్లలూ, నిజంగానే మనందరం ఎప్పుడో ఒకసారి అబద్ధాలు ఆడుతుంటాం. కానీ వాటిని ఏనాడూ లెక్క పెట్టుకోం. నిజానికి గాంధీగారు మహాత్ముడు ఎందుకో తెలుసా? ఆయన తను ఆడిన అబద్ధాలను లెక్క పెట్టుకున్నాడు: వాటి పట్ల మెలకువతో వ్యవహరించాడు. వాటిని గుర్తించనట్లు, మర్చిపోయినట్లు, 'అవి నిజాలే' అన్నట్లు ప్రవర్తించలేదు.
అబద్ధాలను ఎప్పటికప్పుడు అబద్ధాలుగా గుర్తించటం జరుగుతుంటే, అవి మనల్ని అతుక్కొని ఉండలేవు. 'మనం గమనిస్తున్నాం కదా' అని మెల్లగా అబద్ధాలు అన్నీ పారిపోతై; మనం రాను రాను సత్యవంతులం అవుతాం. ఈ నెలరోజుల్లోనూ జరిగింది అదే. మనందరం మనల్ని మనం గమనించుకున్నాం.
ఎవరం ఎన్ని అబద్ధాలు ఆడామో ఎవరికి వాళ్లం మన మనసులో సరిగ్గానే లెక్క వేసుకున్నాం. నోట్సులో ఉన్న అంకెలేవీ వాస్తవం కాదు- మీ మనసుల్లో ఏ రోజుకారోజున లెక్క ఒకటి ఉండింది చూసారా, అదే వాస్తవం. మీలో ప్రతి ఒక్కరూ గుర్తించి ఉంటారు- నెల మొదట్లో కంటే, నెల చివర్లో మీరు తక్కువ అబద్ధాలు ఆడారని! ఔనా కాదా? మీరంతా ఏరోజు- కారోజు తక్కువ అబద్ధాలు ఆడేందుకే ప్రయత్నించారు- ఔనా కాదా?"
పిల్లలంతా ఔనన్నట్లు తల ఊపారు.
"అంటే మీరంతా మంచి పిల్లలైనారన్న మాట! అందుకని, మీకందరికీ వస్తై, బహుమతులు!" అని మాస్టారు తన సంచీలోంచి చటుక్కున తీసిన మిఠాయిల్ని అందరికీ పంచారు.
పిల్లల ముఖాలన్నీ సంతోష ఆశ్చర్యాలతో వికసించాయి!