అనగనగా కంకణాలపల్లిలో ప్రియ, లలిత అనే స్నేహితులు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి దగ్గర్లోనే ఒక ఆట స్థలం, ఓ చిన్న తోట ఉండేవి. వాళ్ళు రోజూ ఆ తోట అంతా కలయ తిరిగి మైదానంలో ఆటలాడి వచ్చేవాళ్ళు.

ఒకరోజున వాళ్ళు వెళ్ళే సరికి ఎవరో‌ పెద్దవాళ్ళు కొందరు తోట అంచున మొక్కలు నాటుతూ కనబడ్డారు.

ప్రియ, లలితలు వెళ్లి అక్కడ నిలబడి చూస్తూంటే వాళ్లలో ఒకాయన వచ్చి "ఊరికే చూసేందెందుకు? మీరు కూడా ఒక మొక్కను నాటండి" అని ఒక మొక్కను తెచ్చి చేతిలో పెట్టాడు.

ప్రియ, లలితలు సిగ్గు పడుతూనే మొక్కను నాటారు.

వాళ్లకు మొక్కనిచ్చిన ఆయన వచ్చి, దానికి నీళ్ళు పోస్తూ, "ఊరికే మొక్కలు నాటి పోతే లాభం లేదమ్మాయిలూ, వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి కూడాను. మీకు వీలైతే రోజూ దీనికి కాసిని నీళ్ళు పోసి పోతారా? ఒక్క ఏడాది కాపాడితే చాలు- ఇది బతుక్కుంటుంది" అన్నాడు.

ప్రియ, లలిత ఒకరి ముఖం ఒకరు చూసుకొని 'సరే' అన్నారు. అప్పటినుండి వాళ్ళు ప్రతిరోజూ దానికి చెంబెడు నీళ్ళు పోయటం మొదలెట్టారు. ఆ మొక్క కూడా, విచిత్రం, చాలా తొందరగా, చక్కగా పెరిగింది. సంవత్సరం తిరిగేసరికి దానికి చిట్టి చిట్టి కాయలు కూడా కాయటం మొదలెట్టాయి!

ఒకరోజు సాయంత్రం ప్రియ, లలిత ఇద్దరూ మొక్కకు నీరు పోస్తుంటే "మీకు కృతజ్ఞతలు" అని ఎవరో వాళ్లకు దగ్గరనుండి అన్నట్టుగా వినిపించింది. ప్రియ, లలిత ఇద్దరూ ఉలిక్కిపడి చుట్టూ చూసారు. "ఎవ్వరూ లేరే!" అనుకొని మళ్ళీ మొక్కకు నీరు పోయసాగారు. ఇంతలో ఆ మొక్క ఊగుతూ "కంగారు పడకండి- నేనే, ఇందాక మీకు కృతజ్ఞతలు తెలిపింది" అన్నది.

ప్రియ, లలిత ఇద్దరూ నిర్ఘాంత పోయారు. "మొక్క మాట్లాడటం ఏమిటి?" అని గబుక్కున వెనుతిరిగి పారిపోయారు ఇద్దరూ.

అయితే ఆ మరునాడు సాయంత్రం వాళ్ళు తోటకు వెళ్ళే సమయానికే ఆ మొక్క దగ్గర ఒక దేవత ప్రత్యక్షమైంది. వీళ్ళు చూస్తూండగానే ఆమె మొక్కతో ఏదో మాట్లాడటం మొదలు పెట్టింది. కొద్ది సేపటికి ఆమె ఒక చేతి రుమాలు తీసి మెల్లగా కళ్ళ నీళ్ళు తుడుచుకున్నది!

ఇప్పుడిక లలిత, ప్రియ ఇద్దరూ‌ ధైర్యంగా ఆమె దగ్గరికి వెళ్లి "అమ్మా! ఎవరమ్మా నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగారు.

ఆ దేవత- "నేను ఒక దేవతనమ్మా! ఇంద్ర లోకంలో ఉంటాను. నా శ్రీ స్వామిని వెతుకుంటూ వచ్చాను అక్కడినుండే" అని జవాబిచ్చింది, మళ్ళీ కళ్లు తుడుచు-కుంటూ. "మరి మీ శ్రీ స్వామి దొరికారామ్మా? ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు ఆయన?" అడిగారు పిల్లలిద్దరూ.

"ఈ మొక్కేనమ్మా, నా శ్రీ స్వామి" చెప్పింది ఆ దేవత!

ప్రియ, లలిత ఇద్దరూ ఆశ్చర్యపోయి- "ఈ మొక్కనా మీ శ్రీ స్వామి! అదేమమ్మా?! స్వామి ఇట్లా చెట్టులాగా ఎందుకుంటారు?" అని అడిగారు.

ఆ దేవత మళ్ళీ‌ ఒకసారి కళ్ళ నీళ్ళు తుడుచుకొని "ఏం చెప్పమంటారు?! సంవత్సరం క్రితం ఒక రోజు నేను-నా శ్రీ స్వామి ఇద్దరం భూలోక విహారానికి వచ్చాము. కులాసాగా మాట్లాకుంటూ ఆ కనిపిస్తోందే, పవిత్రమైన అడవి- అందులోకి వెళ్లాము.

ఆ సమయంలో బాగా చలిగా ఉంది. నేను వణికి పోతూన్నాను. అప్పుడు నా శ్రీ స్వామి నవ్వుతూ అక్కడున్న ఒక పచ్చని చెట్టును కొమ్మలతో సహా నరికి ముక్కలు చేసి, వాటితోటే మంట వేసారు. నేను వద్దంటూనే ఉన్నాను, కానీ ఆయన విననేలేదు!

అంతలోనే అక్కడికొక్క మహాముని వచ్చాడు- 'మూర్ఖుడా! పచ్చని చెట్టును కొట్టి ఎనలేని పాపం మూటగట్టుకున్నావు. నీకే శక్తి ఉందన్న ధీమాతో ఆ పచ్చని చెట్టునే తగలబెట్టావు. నా తపస్సుకు భంగం కలిగించావు. ఇందుకు ఫలితం అనుభవించకపోతే నీకు బుద్ధిరాదు. నువ్వు కూడా ఒక మొక్కగా మారిపో! నీకు, నీ భార్యకు ఎన్ని మంత్ర శక్తులున్నా అవేవీ‌ మీకు ఉపయోగపడకుండుగాక!' అని శపించాడు.

నేను వెంటనే ఆయన కాళ్ల మీద పడి కరుణించమని వేదుకున్నాను.

ఆ మహానుభావుడు చల్లబడి, 'తల్లీ! చేసిన పాపం ఊరికే పోదు. ఈ అడవికి ఉత్తరం దిక్కులో ఉన్న ఒక ఎడారిలో 125మొక్కలు నాటితే నీ స్వామికి విమోచనం‌ అవుతుంది. ఐతే ఆ పని నువ్వు చేయలేవు- ఎవరైనా మానవులు, మీ మీద ప్రేమతో ఆపని చేసి పెట్టినప్పుడే నీ‌ భర్తకు విముక్తి" అని సెలవిచ్చాడు'" చెబుతుంటే దేవత కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగాయి. "నువ్వేమీ‌ బాధ పడకమ్మా! మేం నీకు సాయం చేస్తాం. మేం వెళ్ళి ఆ మొక్కలు నాటుతాంగా, ఈ వారంలోనే!" అని ఆమెకు ధైర్యం చెప్పారు.

మరునాటినుండీ ప్రియ, లలిత ఇద్దరూ మంచి మంచి మొక్కల్ని సేకరించటం మొదలెట్టారు. పెద్దగా పెరిగేవి, ఎండల్ని తట్టుకునేవి, పశువులకు ఉపయోగపడేవి- ఇట్లా రకరకాల మొక్కలు సంపాదించారు. అన్నిటినీ ఉత్తరం దిక్కున ఉన్న ఇసుక భూమిలోకి చేర్చారు.

మరుక్షణం అక్కడొక ఇసుక తుపాను మొదలైంది. వీళ్ళు చూస్తూండగానే అక్కడో‌ సుడిగాలి, అందులో ఒక ఇసుక భూతం‌ ప్రత్యక్షమైనాయి. పిల్లలిద్దరూ ఆ భూతాన్ని చూసి జడుసుకున్నారు.

అది వికవికా నవ్వుతూ "ఏమనుకున్నారు! మీరు ఇక్కడ మొక్కలు పెట్టలేరు! ఇక్కడ నీళ్ళు లేవు! నేను ఈ మొక్కల్ని ఉండనివ్వను! అన్నిటినీ చంపేస్తాను" అని అరిచింది.

"అందుకనే, నువ్వు భూతంలాగా ఉండిపోయావు! మొక్కలు లేని చోట్ల ఉండేది భూతాలే" అన్నది లలిత.

"అవును! ఆలోచించు!‌ నీ భూతంరూపు పోవాలంటే నువ్విక్కడ మొక్కలు నాటాలి. ఊరికే నాటటమే‌కాదు- వాటికి రోజూ నీళ్ళు పోసి పోషించాలి" అన్నది ప్రియ.

"మేము ఇప్పుడు ఆ పనే చెయ్యబోతున్నాం! అది నీకూ మేలే! నీకు ఈ భూతపు రూపం పోవాలంటే మాకు సాయం చెయ్యాలి నువ్వు. లేదంటే ఇక నీ పని ఇంతే" బెదిరించింది లలిత.

ఇసుక భూతం కొంచెం సేపు ఆలోచిస్తున్నట్లుగా నిలబడి, ఒక్కసారి కెవ్వున అరిచి మాయమైపోయింది. ఆ వెంటనే మేఘాలు వచ్చి చక్కని వానకూడా ఒకటి మొదలైంది!

లలిత, ప్రియ ఇద్దరూ సంతోషంగా గుంతలు త్రవ్వి మొక్కలన్నీ నాటారు. ఇసుకభూతం వాటికి సరిపడా వాన కురిపిస్తూ వచ్చింది. నెల రోజుల్లో ఆ మొక్కలన్నీ‌ నిలద్రొక్కుకున్నాయి! వాళ్ళు వాటిని చూసి మురిసిపోతుండగా అక్కడ ముగ్గురు దేవతలు ప్రత్యక్షం అయ్యారు-

"ప్రియా! లలితా! మీకిద్దరికీ ధన్యవాదాలు! మీ మూలంగా మాకు ముగ్గురికీ శాపవిమోచనమైంది. ఇసుక భూతంగా పడి ఉన్న నాకు మీరు విముక్తి నిచ్చారు. నోరులేని మొక్కగా ఉన్న ఈయనకు ప్రాణం పోసారు. ఆయనకు ఏమీ సాయం చేయలేక కుమిలిపోతున్న దేవతకూ మీ మూలాన శాంతి లభించింది. మీరు చాలా మంచి పిల్లలు. ఏదైనా వరం కోరుకోండి ఇస్తాం" అన్నారు వాళ్ళు.

"మేమిద్దరం ఎప్పుడూ స్నేహితులుగా ఉండి, అన్నీ‌ మంచి పనులే చెయ్యాలి" అని వరం కోరుకున్నారు లలిత-ప్రియ. దేవతలు వాళ్లకి ఆ వరం ప్రసాదించి మాయమైపోయారు!