అష్టదిగ్గజాలలో‌ ఒకడైన నంది తిమ్మన కవికి ఒకసారి విపరీతమైన తలనొప్పి పట్టుకున్నది.

రాయలవారు ఆయనను ఎంతో మంది వైద్యులకు చూపించారు; ఎన్నో మందులు వాడించారు. అయినా ఏమంత ప్రయోజనం లేదు. ఏ మందులు వాడినా కొద్దిపాటి ఉపశమనం; మళ్ళీ కొన్నాళ్ళకు రెట్టింపు తలనొప్పి!

'ఇలా కాదు- కాశీలో గొప్ప వైద్యులున్నారు. అక్కడికి వెళ్లి చూపించుకుంటాను' అని పరివారంతో సహా కాశీకి ప్రయాణం కట్టారు తిమ్మనగారు.

అలా వెళ్తూ వెళ్తూండగా మధ్యలో తలనొప్పి చాలా ఎక్కువైపోయింది. ఆ సరికి వాళ్ళు నెల్లూరు దగ్గర దర్శి మండలంలో ఉన్నారు. ఆ దగ్గర్లోనే 'బోదనం పాడు' అనే ఊరున్నది. వీళ్ళంతా ఆ ఊరి శివార్లలోనే డేరాలు వేసుకొని బస చేశారు.

తిమ్మన గారు తలనొప్పికి తట్టుకోలేక-పోతున్నారు. పెద్దగా అరుపులు, మూలుగులు. తిమ్మనతో పాటు వచ్చిన రాజవైద్యుడు ఏవేవో‌ మూలికలు నూరుతూనే ఉన్నాడింకా. ఆయన పరివారానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంతా గందరగోళ పడుతున్నారు.

సరిగ్గా ఆ సమయానికి అటుగా వచ్చారు, ఇద్దరు వైద్య సోదరులు. వాళ్ళిద్దరూ ఇంకా చిన్నవాళ్ళే. తండ్రి తాతలనుండి వచ్చిన వైద్యాన్ని కొనసాగించుకుంటూ బోదనం-పాడులో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. వాళ్లకు వినిపించాయి ఈ అరుపులు.

వాళ్ళు ఆ డేరాల దగ్గరకు పోయి కాపలాగా వున్న సైనికులతో "అయ్యా! మేము ఈ ప్రాంతపు ఘన వైద్యులము. ఇక్కడ ఎవరో బాధతో మూలుగుతున్నారు. మేము లోపలి వెళ్లి చూస్తాము" అన్నారు.

ఒక కాపలావాడు వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి లోపలికి వెళ్లి దండనాయకుల వారితో "ఎవరో వైద్యులట, వచ్చారు- లోపలికి పంపమంటారా?" అని అడిగారు.

ఆ సరికే ఏం చేయాలో తెలీక తల పట్టుకొని కూర్చున్న దండనాయకుడు "సరే ప్రవేశ పెట్టు" అన్నాడు. ఇద్దరినీ లోపలి తీసుకొని వచ్చారు సైనికులు.

దండనాయకుడు వాళ్ళను కూర్చోబెట్టి "మీరెవరు? మీ పరిచయం?" అన్నాడు.

"అయ్యా! మేం యిద్దరం అన్నదమ్ములం. ఈ బోదనంపాడు గ్రామానికి చెందిన వాళ్ళం. మా పేర్లు పుల్లాపంతుల పుల్లన్న, సూరన్న. యిక్కడెవరో జబ్బు పడినట్టున్నారు- మూలుగులు బయటికి వినిపిస్తున్నాయి. మేం వారికి వైద్యం చేస్తాం" అన్నారు.

"ఆయన విజయనగర సామ్రాజ్యాధీశులు శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థాన అరణపు కవులు శ్రీ నంది తిమ్మనార్యుల వారు" చెప్పాడు దండనాయకుడు.

"ఏమీ! పారిజాతాపహరణ కర్త అయిన నంది తిమ్మనగారా?! ఏమైంది? వారికొచ్చిన జబ్బు ఏమిటి?!" అడిగారు వాళ్ళు. ముక్కు తిమ్మనగారు రచించిన 'పారిజాతాపహరణ కావ్యం' గురించి తెలీని పండితులే లేరు మరి, ఆ రోజుల్లో.

"లోపలికి రండి" అని పిలుచుకొని వెళ్ళాడు దండనాయకుడు.

తిమ్మనగారు అక్కడ పడక మీద పడుకొని దొర్లుతూ పెద్దగా అరుస్తున్నారు. పక్కన రాజవైద్యుడు కల్వంలో మందు నూరుతున్నాడు. లోపలికి వచ్చిన వాళ్ళని చూసి 'ఎవరు మీరు?' అని గద్దించాడు రాజ వైద్యుడు.

దండనాయకుడు వారి వివరాలు చెప్పగానే వైద్యుడు ముఖం చిట్లించాడు. "మహా మహా వైద్యులే ఏమీ చెయ్యలేక పోయారు. పిల్లలు- మీరేమి చేస్తారు? నాయనలారా, మీకు తెలుసో లేదో, వీరు నంది తిమ్మన గారు. వీరి తలనొప్పిని ఎలాగైనా తగ్గించాలని స్వయంగా రాయలవారే పూనుకొని, గొప్పగొప్ప వైద్యులకు చాలా మందికి చూపించి, 'ఇంక కుదరదు' అని ఆశ వదులుకున్నారు. ఈ మారుమూల గ్రామంలో చిన్న చిన్న వైద్యాలు చేస్తూ బ్రతుక్కునే మీ వల్ల తీరే సమస్య కాదు నాయనా ఇది!" అన్నాడు పెదవి విరుస్తూ.

"ఇలాంటి శిరోవేదనకు మంచి వైద్య ప్రక్రియ ఉంది మా దగ్గర- మాకు ఒక్క అవకాశం యిచ్చి చూడండి. మా అన్నగారు నాడీ పరీక్షలో ఘనులు" అన్నాడు సూరన్న, అన్నను ముందుకు నెడుతూ.

ఇంతలో "ఏమిటి, ఈ అల్లరి? నన్ను అసలు విశ్రాంతి తీసుకోనిచ్చేట్లు లేరే?!" అంటూ కోపంగా పాన్పు మీదినుండి దిగి వచ్చారు తిమ్మన గారు.

వైద్య సోదరులు ఇద్దరూ లేచి నిలబడి ఆయనకు నమస్కరించారు. "కవివర్యా! మేం ఈ గ్రామ వైద్యులం. మిమ్మల్ని దర్శించి మీ ఆరోగ్యం గురించి పరామర్శించి వెళ్ళడం మా ధర్మం కదా! అందుకే వచ్చాం" అన్నారు.

"సరే, కూర్చోండి" అని సైగ చేస్తూ చెప్పారు తిమ్మనగారు- "నాకు ఈ తలనొప్పి బాధ చాలా ఏళ్ళుగా వుంది. ఈ మధ్య మరీ ఎక్కువయింది. తలలో ఏదో తోలుస్తున్నట్టు బాధ. ఒక్కోసారి తలని గోడకు గ్రుద్ది బద్దలు కొట్టుకోవాలనిపిస్తుంది" అన్నారు తిమ్మన-గారు, తలను నొక్కుకుంటూ.

"తమరి సెలవైతే మేము ఓసారి మిమ్మల్ని పరీక్షిస్తాం. మాకున్న పరిజ్ఞానంతో, మా పూర్వీకుల ఆశీస్సులతో మీకు మంచి వైద్యం అందించగలమని మా నమ్మకం" అన్నాడు పుల్లన్న.

"ఏమి చేస్తారో?! నాకైతే ఈ వైద్యం మీద నమ్మకం పోయింది. రాయలవారు నాకోసం చెయ్యని ప్రయత్నం లేదు. ఎందుకు వచ్చిందో ఏమో గానీ నా ప్రాణాలు తోడేస్తోంది, ఈ మహమ్మారి. ఇట్లా బాధ పడుతూ ఉండటం కంటే 'చావే మేలు' అనిపించింది. అందుకే ఇట్లా కాశీ ప్రయాణం పెట్టుకున్నాను. అయితే భగవంతుడి కరుణ ఇలా ఉంది- మధ్యలోనే శిరోవేదన ఎక్కువై ఇలా యిక్కడ బస చెయ్యాల్సి వచ్చింది" అన్నాడు తిమ్మన.

"అయ్యా! అర్థమైంది. మీ బాధ నిజంగానే వర్ణనాతీతం. ఏనుగు కుంభస్థలంలోకి పాము ప్రవేశించినప్పుడు అది ఎంతగా విలవిలలాడి పోతుందో, ఎన్నెన్ని కొండల్ని ఢీకొంటుందో మీరు వర్ణించి ఉన్నారు గతంలో. మీ ఈ శిరోవేదన అంతకు వెయ్యి రెట్లు వుంటుంది. భరించడం ఎవరికైనా కష్టమే. ఒకసారి చెయ్యి యివ్వండి- నాడి పరీక్షిస్తాం" అంటూ తిమ్మనగారి చేతిని అందుకొని శ్రద్ధగా నాడిని పరీక్షించాడు సూరన్న.

అటుపైన "అవునవును. అర్థమైంది" అంటూ పుల్లన్నకు ఏదో వివరించాడు వైద్య పరిభాషలో. పుల్లన్న చిరునవ్వు నవ్వి, తిమ్మనగారి వైపు తిరిగి "అయ్యా! ఏమీ‌ పరవాలేదు. మీ సమస్య తీరిపోతుంది. మీకు ఇక్కడే శాంతి లభించనున్నది. భయంలేదు" అన్నాడు.

అతని నవ్వును చూడగానే తిమ్మన్నగారికి కోపం వచ్చేసింది. "విషయాన్ని మీరు యింత తేలికగా తీసుకోవడం విడ్డూరంగా ఉంది. ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ప్రయత్నించి, 'మా చేత కాద'ని చేతులెత్తారు. అల్లాంటిది మీరు విముక్తి కలిగించడమా? మీ వైద్యమూ వద్దు, మీ మందూ వద్దు, మీ పథ్యాలూ వద్దు! మీకో నమస్కారం! యిలాగే కాశీ దాకా వెళ్ళ నివ్వండి. తర్వాత ఆ కాశీనాథుడే చూసుకుంటాడు" అన్నారు మూలుగుతూ.

"అయ్యా మా మాట నమ్మండి. మావి వ్యర్థపు మాటలు కావు. ఈ రోగానికి మందులూ, మాకులూ, పథ్యాలు ఏమీ లేవు. దీనికి జరగాల్సిన వైద్య ప్రక్రియ వేరే ఉన్నది. ఒక్క రోజులోనే నయమైపోతుంది. ఓపిక పట్టాలి- అంతే" అన్నాడు పుల్లన్న ధీమాగా.

"ఔనౌను- ఓపిక పట్టాల్సిందే! మందూ-మాకూ-పథ్యమూ లేని వైద్యం కదా!! లోకంలో ఎక్కడా లేని వైద్యాన్ని చెప్తున్నారు" అంటూ శిరోభారంతో కూలబడి తల పట్టుకున్నారు తిమ్మన గారు.

"అయ్యా! మీ మూలుగు వినగానే మీ సమస్య ఏమిటో, అది ఎలా తగ్గుతుందో మాకు అర్థమై పోయింది. మీరు మాకు ఒక్క అవకాశం యిచ్చి చూడండి- తప్పులేదు కదా!" అన్నారు వైద్య సోదరులు బ్రతి మాలుతూ.

దాంతో తిమ్మన రాజ వైద్యుడి వైపు చూస్తూ "ఆర్యా! ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? వీరికి ఒక అవకాశం యిచ్చి చూద్దామా?" అన్నాడు.

"కవి వర్యా! యిదంతా పనికిరాని వ్యవహారమే. ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులకు లొంగని జబ్బు ఈ మారు మూల పల్లెల్లో కప్పల్లాగా నివసించే వారికి సాధ్యం కాదు. మనం కాలాన్ని వ్యర్థం చేయకుండా త్వరగా కాశీనగరం చేరుకుంటే మంచిది" అన్నాడు రాజవైద్యుడు.

తిమ్మన కొంచెం సేపు ఆలోచించి, నిట్టూర్పు విడుస్తూ "నేను ఇప్పుడు మళ్ళీ వెంటనే ప్రయాణం ఆరంభించే స్థితిలో లేను. ఊరికే ఇక్కడ ఆగినా, వీరు చెప్పే ఉపచారం ఏదో అది చేసినా నావరకూ ఒకటే- వీరి మాటా విని చూద్దాంలెండి. తప్పులేదు" అన్నాడు.

"ఇదిగో అబ్బాయిలూ! మీ వైద్యానికి ఒప్పుకుంటున్నాం. అయితే ఒక షరతు. మీరు నయం చేయలేని పక్షంలో రాజ దండనకు గురికావల్సి వస్తుంది. తెలుసా?" గద్దించాడు రాజవైద్యుడు.

వాళ్ళు ఇద్దరూ జడుసుకోలేదు. "అయ్యా! ఇది మా వైద్యానికి పరీక్షా సమయం.. కానివ్వండి" అన్నారు.

"అబ్బో మంచి పట్టున్న వైద్యులే!" అంటూ ముక్కున వేలేసుకుని, నవ్వలేక, తలపట్టుకున్నారు తిమ్మనవారు.

ఆ రోజునుంచీ వరుసగా మూడు రోజుల పాటు వైద్య సోదరులు ఇద్దరూ తిమ్మన ముక్కులో చుక్కల పసరు పిండుతూ వచ్చారు. నాలుగోరోజు వైద్యానికి కావలిసిన పదార్థాలన్నీ ఒక జాబితాగా తయారు చేసి యిచ్చారు. చూస్తే అందులో విశేషంగా వైద్యానికి కావలిసిన వస్తువులేమీ లేవు: పుట్టెడు బియ్యం మాత్రం కావాలన్నారు.

"పుట్టెడు బియ్యమా? ఊరందరికీ సమారాధన చేస్తారా, ఏమి?!" అన్నాడు రాజవైద్యుడు వెటకారంగా.

"కాదు- అవసరం ఉంది తెప్పించండి. అలాగే ఇరవై మంది వంటవాళ్లు, నిర్మాణపు పని తెలిసిన పదిమంది కూలీలు కూడా కావాలి" అన్నారు వైద్య సోదరులు.

"ఉప్పు, పప్పు కూరగాయలు కూడా తెప్పించండి. వండి, ఊళ్ళో పోలేరమ్మ జాతర జరిపించండి- సరిపోతుంది" దెప్పి పొడిచాడు రాజవైద్యుడు.

"కాదు కాదు- మా వైద్యానికి ఇది చాలా అవసరం" అన్నాడు పుల్లన్న.

"ఏమి అవసరమో ఏమో! మా తిమ్మన గారితో ముక్కు పట్టించి మూడు చెరువుల నీళ్ళు త్రాగిస్తున్నారు. వారి యాత్ర యిక్కడే పూర్తి అవుతుందేమో!" అన్నాడు రాజవైద్యుడు.

"శివ శివా! మీకా సందేహం అక్కరలేదు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులై రాయలవారిని దర్శిస్తారు- తన కవిత్వం తో మెప్పిస్తారు" అన్నాడు సూరన్న ధైర్యంగా.

"ఎవరి గతి ఎలా వుందో ఆ విరూపాక్షుడికే ఎరుక" అంటూ దండనాయకుడికి పట్టీ యిచ్చి అన్నీ తెప్పించమన్నాడు రాజవైద్యుడు.

ఐదవనాటికల్లా గాలి కూడా చొరనంత దట్టంగా, బాగా ఎత్తుగా ఉన్న గుడిసె ఒకటి తయారైంది.

గుడిసె బయట వంటవాళ్ళు పుట్టెడు బియ్యాన్ని వండటం మొదలు పెట్టారు. ఊళ్ళో వాళ్లంతా వచ్చి నిలబడి 'ఏం జరుగుతున్నది' అని ఆశ్చర్యంగా చూస్తున్నారు.

వైద్యులిద్దరూ వచ్చి తిమ్మనను గుడిసెలోకి పిలుచుకొని వెళ్ళారు.

"మిమ్మల్ని ఈ గుడిసెలో తలక్రిందులుగా వేలాడదీయాల్సి వుంటుంది" అన్నారు.

తిమ్మనకు దిక్కు తోచలేదు. ఎలా పారిపోవాలో అర్థం కాలేదు. ఏమనేందుకూ‌ నోరురాక విలవిలలాడాడు.

"భయపడకండి- ఇది వైద్య ప్రక్రియలో భాగమే" అన్నారు వైద్య సోదరులు ఇద్దరూ ఏక కంఠంతో.

"సరే- ఒకసారి మీ వైద్యానికి ఒప్పుకున్నాక తప్పుతుందా, ఏదైతే అది అవుతుంది- కానివ్వండి" అన్నారు తిమ్మన. వెంటనే వైద్యులు ఆయన శరీరం అంతటా లావు పాటి కంబళ్ళు చుట్టారు. తల, ముక్కు మాత్రం బయటకు ఉండేలా ఒక దట్టమైన తొడుగు తగిలించారు. గుడిసెకు ఒక మూలగా ఆయన్ని తలక్రిందులుగా వేలాడ దీశారు.

మరుక్షణం అప్పుడే వండి వార్చిన అన్నపు హండాలు గుడిసెలోని తేబడ్డాయి. ఆ అన్నం అంతా గుడిసెలో కుమ్మరించబడింది. తలక్రిందులుగా వ్రేలాడుతున్న తిమ్మనగారి క్రిందంతా ఆవిర్లు క్రక్కుతున్న అన్నం నిండింది. గుడిసె మొత్తం‌ ఒక్కసారిగా ఆవిర్లు క్రమ్ముకున్నాయి.

తన శరీరానికి ఏమైందో అసలు అర్థం కాలేదు తిమ్మనకు. ఆయన ముక్కు పుటాల ద్వారా లోనికి ప్రవేశించిన వేడి వేడి అన్నపు ఆవిరి సెగలు ఒక్క పెట్టున ఆయన నషాళానికి అంటాయి.

రెండు క్షణాలు గడిచాయో లేదో- ఆయన ముక్కు పుటాల నుంచి విష క్రిములు రెండు- గిజ గిజ లాడుతూ వెలువడి, ఆ అన్నపు రాశి పై పడ్డాయి. అదే క్షణంలో తిమ్మన స్మృతి తప్పాడు!

వైద్యులిద్దరూ వెంటనే ఆయనను క్రిందికి దింపి, బయటకు తీసుకొని వచ్చి, శీతలోపచారాలు చేశారు. క్రమంగా ఆయనను తెలివిలోకి తెచ్చారు. తిమ్మన తలనొప్పి మాయమైంది! అయితే ఆయన పూర్తిగా కోలుకునేందుకు మరో రెండు వారాలు పట్టింది.

కవిగారి శిరోభారం తగ్గిందనీ, రోగం నయమైందనీ వెంటనే రాయలవారికి కబురు అందింది. పుల్లాపంతుల వైద్య సోదరుల ఖ్యాతి వెనువెంటనే విజయనగర సామ్రాజ్యపు నలుమూలలకూ పాకింది. వారిని దర్శించుకునేందుకు ప్రజలు తండోప-తండాలుగా రాసాగారు.

నాలుగైదు రోజుల్లో కృష్ణదేవరాయల వారే నేరుగా బోదనంపాడు విచ్చేసారు.

వైద్యులిద్దరూ రాయలవారిని ప్రస్తుతించారు:

శ్రీ వేంకటగిరి వల్లభ-
సేవా పరతంత్ర హృదయ! చిన్నమదేవీ
జీవితనాయక!కవితా
ప్రావీణ్య ఫణీశ కృష్ణరాయ మహీశా!

ప్రభూ మేము వైద్యులమేగానీ కవులం కాదు. అందుకే ముక్కు తిమ్మన గారి పద్యాన్నే ఒప్పజెప్పాం. అందుకు మమ్మల్ని మన్నించండి. మా పెద్దలు దయతో మాకు నేర్పించిన వైద్యాన్ని సేవాదృష్టితో మా బోదనంపాడులోనే పదిమందికీ అందిస్తూ వస్తున్నాం. నంది తిమ్మనగారంతటి వారికి వైద్యం చేసే మహద్భాగ్యం కలగడం కేవలం మా పుణ్య విశేషమే. వారి ఆశీస్సులు మాకు సదా వుండగలవని విశ్వసిస్తూ, తమరి అనుగ్రహంతో మా ఈ వైద్యవిద్య యిలాగే పది కాలాలపాటు శాశ్వత కీర్తి పొందగలదని భావిస్తున్నాము" అన్నారు పుల్లాపంతుల సోదరులు.

తిమ్మనగారు లేచి "ప్రభూ! శతాధిక వందనాలు.'కాశ్యాం తు మరణానురక్తి:- కాశీకి పోయేది కాటికి పోయేందుకే" అని నిశ్చయించుకొన్న నేను, వీరి చలువతో పునర్జన్మ ఎత్తాను. వీళ్ళు నా పాలిట నిజంగా అశ్వినీ దేవతలే. మొదట నేను వీరిని శంకించాను- అది నా అవివేకం. వీరి హస్తం ఒక సంజీవ కరణి. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు గనక వీరు అక్కడ ఉండి ఉంటే హనుమంతుడికి ఆ సంజీవనీ పర్వతాన్ని ఎత్తి తేవలిసిన పని ఉండేది కాదేమో. కుగ్రామంలో నిస్వార్థంగా వైద్యసేవలనందిస్తూ గ్రామంలో వారిని అందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచుతున్న వీరి సేవకి ఎంత యిచ్చినా తక్కువే.

వీరి ఋణం ఎలా తీర్చుకోగలం? ప్రభువులవారు వీరిని తమ ఆస్థాన వైద్యులుగా నియమిస్తే సాహిత్యం తో బాటు వైద్యశాస్త్రాన్ని కూడా పోషించినట్లుంటుంది అని నా అభిప్రాయం. ఆ తర్వాత తమరి చిత్తం' అన్నారు.

"కవీశ్వరుల సూచన ఆమోదదాయకం. మరి పుల్లాపంతుల సోదరులు అందుకు సమ్మతిస్తారో? వారి సమ్మతం మాకు సంతోషదాయకం" అన్నారు రాయలవారు. కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి.

"ప్రభూ! మీ ఆజ్ఞ శిరోధార్యమే- కానీ మా వంశీకుల నియమానుసారం మేము స్వస్థలంలోనే వైద్యం చెయ్యాలి తప్ప, మరో చోటుకు పోగూడదు. ధన సంపాదనకూ, స్వలాభాపేక్షకూ లోనుకాకూడదు. మా గ్రామం వైద్యానికి పెట్టింది పేరుగా శాశ్వత కీర్తిని ఆర్జించాలని మా పెద్దల ఆశయం. ప్రభువులు దీన్ని వేరుగా తలచరాదని ప్రార్థన" అన్నారు ఆ సోదరులు.

"భేష్ ! మీ పూర్వీకుల ఆశయం ఉదాత్తంగా ఉంది. వైద్యుడి కోసం రోగి అన్వేషించడమే ధర్మం. అప్పుడే వైద్యానికి విలువ. మీ గ్రామాన్ని వైద్య కేంద్రంగా పరిగణిస్తూ బోదనంపాడును అగ్రహారంగా మీకు దానశాసనంతో వ్రాయించి ఇస్తున్నాం! అమూల్యమైన మీ సేవను ప్రశంసిస్తూ మేమిచ్చే ఈ చిన్న బహుమతిని స్వీకరించండి" అన్నారు రాయలవారు గంభీరంగా. సభలో మరోసారి హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.