అనగనగా ఓ అల్లరి పిల్లవాడు ఉండేవాడు. వాడి పేరు కిట్టు. అమ్మా నాన్నలకు ఏకైక సంతానం వాడు. అందుకని వాడిని చాలా గారాబంగా పెంచారు. దాంతో వాడికి అల్లరే అలవాటైపోయింది.

ఒకరోజున వాడు ఇంటి బయట వసారాలో ఆడుకుంటూ పక్కింటి వైపుకు చూసాడు. పక్కింటి వాళ్ల తలుపు వేసి ఉన్నది. వాడు వెళ్ళి వాళ్ళ తలుపు దబదబా తట్టి ఏమీ తెలీనట్టుగా వెనక్కి వచ్చి కూర్చున్నాడు.

రెండు క్షణాల తర్వాత పక్కింటి ఆంటీ తలుపు తీసి బయటికి తొంగి చూసింది. ఎవరూ లేరు! ఆవిడ బయటికొచ్చి, 'ఎవరది?' అని అరిచి మళ్ళీ లోనికి వెళ్ళి తలుపు వేసుకున్నది.

ఆవిడ తలుపు వేసుకోగానే కిట్టు మళ్ళీ వెళ్ళి తలుపు తట్టి వచ్చాడు. ఇట్లా రెండు మూడుసార్లు అయ్యేసరికి, ఆవిడకు విసుగొచ్చింది. దొంగల్ని పట్టుకుందామని ఈసారి ఆవిడ తలుపు వెనకనే నిలబడ్డది.

అతి తెలివి కొద్దీ నాలుగోసారి తలుపు తట్టిన కిట్టు, చటుక్కున ఆమె చేతికి చిక్కాడు. ఆవిడ వాడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.

అయితే దానినుంచి వీడికి బుద్ధి రాలేదు- కోపం వచ్చింది-

ఆ ఆంటీకి కుక్కలన్నా, పిల్లులన్నా చచ్చేంత భయం. ఇది అలుసుగా తీసుకున్నాడు కిట్టు. వాడికి కుక్కలంటే భయం లేదు; పిల్లులంటే‌ భయం లేదు! అందుకని వాడు పోయి వీధిలోంచి రెండు కుక్కల్ని, పిల్లుల్ని వేరువేరుగా పట్టుకొచ్చాడు.

ప్రక్కింటి తలుపు తట్టి, ఆవిడ తలుపు తీయగానే నాలుగింటినీ వాళ్ల ఇంట్లోకి వదిలి, గట్టిగా తలుపులు వేసేసి బయటినుండి గొళ్ళెం పెట్టాడు!

పిల్లులు రెండూ ఇంట్లో చెరో మూలకు పరుగెత్తాయి. రెండు కుక్కలూ వాటి వెంట పడ్డాయి. పిల్లులు రెండూ బుస్సు బుస్సుమన్నాయి. కుక్కలు పళ్ళు చూపిస్తూ గురగురమన్నాయి. ఆంటీ వణికి పోతూ ఒక మూలన నక్కింది.

నాలుగు జంతువుల మధ్యనా ఇంట్లో సామాను బలి అయ్యింది. పిల్లులు, కుక్కలు ఇంట్లో ఉన్న సీసాల్ని, కప్పుల్ని, సాసర్లనీ పగలగొట్టాయి. ఇల్లంతా చిందరవందర చేశాయి. బయటకు పోలేక, లోపల ఊరికే కూర్చొని ఉండలేక ఇల్లు పీకి పందిరేసాయి.

బయట నిలబడి నవ్వుకున్న కిట్టు తీరుబడిగా గొళ్ళెం తీశాడు. మరుక్షణం పిల్లులు, కుక్కలు బయటికి దూకాయి. వాళ్ళ వెనకనే బయటికి వచ్చింది ఆంటీ. ఆంటీ ముఖంలోని ఆందోళన చూసి ముసి ముసి నవ్వులతో వెళ్లిపోబోయాడు కిట్టు- అయితే ఆ వెంటనే వాడికి అర్థం కానిదొకటి జరిగింది: అప్పటివరకూ మామూలుగా ఉన్న ఆంటీ అకస్మాత్తుగా పులి మాదిరి ఐపోయింది- వాడిని పట్టుకొని బరబరా ఇంట్లోకి ఈడ్చుకెళ్ళింది. వాడు తలెత్తి చూసేలోగా వాడి ఒంటిమీద దెబ్బలు పడ్డాయి. 'ఒకటి-రెండు-మూడు' వరకూ లెక్కపెట్ట గలిగాడు వాడు. వాడికి వచ్చింది అంతవరకే మరి! అయితే ఆ తర్వాత కూడా ఇంకా దెబ్బలు పడుతూనే పోయాయి. వాడి నోరు దానంతట అదే మొత్తుకోవటం మొదలెట్టింది. చేతుల మీద వాతలు పడ్డాయి. చెవులు కమిలి పోయాయి. ఆంటీ చేతులోకి వచ్చిన ఓ త్రాడు వాడిని ఒక కుర్చీకి కట్టేసింది.

వాడికి ఇంకా ఏమీ అర్థం కాకనే, ఆవిడ కిట్టు వాళ్ళింటికి పోయింది. ఏం చెప్పిందో ఏమో, ఐదు నిముషాల్లో ఆవిడతోబాటు కిట్టు వాళ్ళ అమ్మ ప్రత్యక్షం అయ్యింది. చుట్టూ పగిలిన సామాన్లకేసి బిక్కుబిక్కుగా చూసింది. మరుక్షణం కిట్టు కట్లు విప్పబడ్డాయి. వాడు గర్వంగా వాళ్లమ్మకేసి తిరిగాడు. అంతే- వాళ్లమ్మ వాడిని పట్టుకుని ఈడ్చింది. ముఖాన్ని వికారంగా పెట్టింది. వీపు విమానం మోత మ్రోగించింది.

ఆ రోజు సాయంత్రం కిట్టు వాళ్ల నాన్న ఆఫీసునుండి రాగానే ముగ్గురూ బజారుకు పోయారు. అట్లా బజారుకు పోవటం అంటే కిట్టూకి చాలా ఇష్టం. వాడికి చాలా ఆనందంగా ఉంది.

వాళ్ల నాన్న తన నెలజీతం అంతా తీసి చూపించాడు కిట్టూకి. అన్ని డబ్బుల్ని చూసి కిట్టూ సంతోషంగా నవ్వాడు. ఎన్నడూ‌ లేనిది, ఆరోజున వాళ్లమ్మ ఎక్కడా లేనన్ని గిన్నెలూ, కప్పులూ, సాసర్లూ కొన్నది. నాన్న నెలజీతం అంతా ఖర్చయిందా రోజున!

కిట్టూ ముఖం వెలిగిపోతున్నది, తాము కొన్న సామాన్లన్నీ తలచుకొని. ఇల్లు చేరుకోంగానే నాన్న ప్రక్కింటి ఆంటీ వాళ్ళ తలుపు తట్టాడు. కిట్టూ చేత ఆ సామాన్లన్నీ‌ ఆవిడకు ఇప్పించాడు!

ఇప్పుడు కిట్టూ ముఖం అదోలా అయ్యింది. "మమ్మల్ని క్షమించండి- వీడు ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయడు- ఇంకొక్కసారి ఏమైనా అల్లరి పని చేసాడంటే వీడి కిట్టీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ‌ మీకు ఇచ్చేస్తాడు. మీరు మా యింట్లోకి పిల్లుల్నీ, కుక్కల్నీ వదిలినా ఏమీ అనడు. ఆ కుక్కలు పిల్లులు వాడి సామాన్లు ఏం ఎత్తుకెళ్ళినా ఉలకడు-పలకడు- మళ్ళీ‌ కావాలని అడగడు" చెప్పాడు నాన్న.

కిట్టు బిత్తరపోయాడు.

తర్వాతి రోజు ఉదయాన్నే వాడికి 'కుర్కురే' ఆకలైంది. నాన్న చెప్పాడు- "చూడు బాబూ! నా దగ్గరున్న డబ్బులన్నీ‌ పెట్టి ఆంటీకి గిన్నెలు కొనిచ్చాం కదా, ఈ నెలంతా మనకు కుర్కురేలు ఉండవు, నూడుల్సూ ఉండవు, పుస్తకాలు, పెన్నులు, డ్రస్సులు, షూస్- ఏమీ ఉండవన్నమాట. అర్థమైందిగా?!" అని. అమ్మ కూడా అవునన్నట్లు తలాడించింది బాధగా.

ఆ తర్వాత ఇంకెప్పుడూ కిట్టుగాడు ప్రక్కింటివాళ్లతో‌ పెట్టుకోలేదు.

మళ్ళీ ఇంకోసారి తోక జాడించాడు కిట్టూ. ఈసారి వాళ్ల అమ్మా-నాన్నా లేని సమయం‌ చూసుకున్నాడు. మెల్లగా పోయి సందులో ఉన్న ఇళ్ళన్నిటికీ బయటినుండి గడియలు పెట్టి వచ్చాడు.

అయితే నాలుగిళ్ళ అవతల ఉండే రంగాచారి మాస్టారు వాడి ఈ తుంటరి పనిని చూడనే చూసారు. రంగాచారి మాస్టారి ఇంటికి వెనకవైపున మరో తలుపు ఉంది. ఆయన మెల్లగా ఆ తలుపు తీసుకొని బయటికొచ్చారు. చప్పుడు కాకుండా‌ కిట్టూ వాళ్ళింటికి వచ్చి, వాడు లోపల ఉండగానే బయటివైపునుండి గొళ్ళెంవేసి, తాళం పెట్టి మరీ వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ మిగిలిన ఇళ్ళకు కిట్టూ వేసిన గడియలన్నీ‌ తీసేయటమే కాదు- వాళ్లందరికీ కిట్టు గురించి చెప్పి మరీ వెళ్ళారు.

ఆరోజున కిట్టూకి ఆకలైనా తలుపు రాలేదు; ఆడుకోడానికి పోదామన్నా తలుపు రాలేదు!

సాయంత్రం అవుతుండగా రంగాచారి మాస్టారుతోబాటు సందులోవాళ్లంతా వచ్చారు. "మర్యాదగా సారీ చెప్పు- లేకపోతే ఇవాళ్లంతా ఇంతే!" అన్నారు. అంతలో అమ్మా-నాన్న కూడా‌ వచ్చారు. "ఏమైంది?!" అని అడిగి కనుక్కున్నారు. దాంతో కిట్టుగాడి తోక మరింత సర్దుకున్నది.

asdfghjjkl2qwertyuiop "స్కూలుకు లేటైపోతోంది-తొందరగా రెడీ అవ్వు" అంటోంది కిట్టు వాళ్ళ అమ్మ. తర్వాతి రోజు నుండి దసరా సెలవులు కావటంతో మారు మాట్లాడకుండా రెడీ అయి స్కూలుకి వెళ్లాడు కిట్టు. మాస్టారు గారు వచ్చారు- క్లాసు ప్రారంభమయింది: "ఒరేయ్ కిట్టూ! లేచి నిలబడు- నేను అడిగే ప్రశ్నలకి సరిగ్గా సమాధానాలు ఇవ్వు- రామాయణంలో సీతను ఎవరు ఎత్తుకెళ్ళారు?” అడిగారు టీచర్.

"సురేష్ అయి ఉంటాడు సర్! మీరు నిన్న వదిలేసిన చాక్‌పీసు ముక్కని వాడే ఎత్తుకెళ్లాడు" చెప్పేసాడు కిట్టు.

టీచర్‌కి కోపం వచ్చింది. "ఇదిగో, జోకులు వద్దు చెబుతున్నాను. సీతను ఎవరెత్తుకెళ్ళారో చెప్పు మర్యాదగా" అన్నారు.

"సార్! నాకు ఏ పాపం తెలియదు. నన్ను వదిలేయండి సార్. అలాంటి కిడ్నాపుల గురించి నాకు ఏమాత్రం తెలియదు" కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు కిట్టు.

దాంతో "నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి?!" అని మాస్టారే బిత్తర పోయారు. ఇతిహాసాల ప్రశ్నలు చాలించి లెక్కల్లోకి వచ్చారు-

"నిన్న నేను టేబుల్స్ నేర్చుకొని రమ్మన్నాను- నేర్చుకొచ్చావా?!” అన్నారు.

"నేర్చుకున్నాను సార్!” అన్నాడు కిట్టు.

"ఎన్ని నేర్చుకున్నావు?” అనుమానంగా అడిగారు టీచరు గారు.

"ఫైవ్ టేబుల్స్ నేర్చుకున్నాను సార్!” చెప్పాడు కిట్టు, చేతులు కట్టుకొని ఊగుతూ- "డైనింగ్ టేబుల్, డ్రాయింగ్ టేబుల్, వాషింగ్ టేబుల్, చిన్న టేబుల్, పెద్ద టేబుల్" అని.

మాస్టారికి బలే కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నారు. కిట్టుని మటుకు బాగా తిట్టారు.

దాంతో కిట్టులో‌ ఉన్న రాక్షసుడు మళ్ళీ ఓసారి తలెత్తాడు- తను చూసిన తెలుగు సినిమాలన్నీ గుర్తు చేసుకున్నాడు. ఏ హీరో ఎలాంటి పనులు చేసాడో గుర్తు చేసుకొని పరవశించి పోయాడు.

మాస్టారు రోజూ బడికి ఓ పాత స్కూటర్ మీద వస్తారు. ఆ స్కూటరుకు హ్యాండిల్ లాక్ పడదు; పడితే అంత సులభంగా రాదు. అందుకని మాస్టారు దానికి తాళం వెయ్యకుండానే బడి ఆవరణలో పెడుతుంటారు.

కిట్టుకు అది గుర్తొచ్చింది. ఆ బైకుని నెట్టుకెళ్ళి రోడ్డు మధ్యలో పెట్టి, తాళం వేసి ఎంచక్కా నవ్వుకుంటూ పోయాడు. త్వరలోనే ట్రాఫిక్ జామ్‌ అయింది. ట్రాఫిక్ పోలీసులు వచ్చారు. "ఈ బండి ఎవరిది? ఇక్కడెవరు పెట్టారు?" అని బడి వాచ్‌మాన్‌ను అడిగారు.

"ఇది మాస్టారిది సార్! దీన్ని కిట్టు అనే పిల్లాడు నెట్టుకొచ్చి ఇక్కడ పెట్టాడు సార్!" అని అతను వాళ్లకు చెప్పేసాడు.

దాంతో పోలీసులు నేరుగా కిట్టు తరగతికే వచ్చేసారు. కిట్టూని రమ్మని వాళ్లతో‌బాటు స్టేషనుకు తీసుకెళ్ళారు.

కొంచెం సేపటికి టీచర్లంతా వచ్చారు; కిట్టూవాళ్ల అమ్మ-నాన్న ఇద్దరూ వచ్చారు స్టేషనుకు. పోలీసులు లాఠీలు చూపించి బెదిరించారు. అమ్మ ఏడ్చి తిట్టింది. మాస్టార్లంతా నవ్వారు. నాన్న జేబులో ఉన్న డబ్బులన్నీ పోలీసువాళ్లకు ఇచ్చేసి, కిట్టూని వెంట పిలుచుకుపోయాడు.

"నీకేమైంది కిట్టూ?! ఎందుకిట్లాగ?! కచ్చగా ఉండద్దురా! నువ్వు వేరే వాళ్లకు ఏది చేస్తావో అదే నీకు జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకో, ప్రతిసారీ- కొంచె పెద్దవ్వురా త్వరగా!" అమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకున్నది.

"లేదులేమ్మా! ఏడవకు!‌నేను ఇకమీద సరిగా ఉంటానుగా! కచ్చ పనులు అస్సలు చెయ్యను" మాట ఇచ్చాడు కిట్టూ.

దసరా సెలవులు వచ్చేసాయి. కిట్టు కచ్చ పనులు మానేసాడు గానీ, ఇంకా అల్లరి పనులేవీ తగ్గించలేదు.

అమ్మకు ఓ ఐడియా వచ్చింది- "వీడికి ఏదైనా జంతువును తెచ్చిద్దాం. దాన్ని జాగ్రత్తగా పెంచమందాం. వాడికి బాధ్యత అలవడుతుంది" అని. దాంతో "ఒరే కిట్టూ! వెళ్లి ఒక మంచి కోడిపిల్లను తీసుకురారా!" అని కిట్టు చేతిలో ఐదు రాపాయలు పెట్టింది.

కిట్టుగాడు కోడిపిల్లను కొనుక్కొచ్చాడు. దానితో ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నాడు. అది పరుగెత్తింది. దాన్ని తరిమి, చివరికి అలిసిపోయాక అందుకొని, దాన్ని కాస్తా తన జేబులో పెట్టుకొని జిప్పు వేసేశాడు. కోడిపిల్లకు ఊపిరి ఆడలేదు. చిట్టి పిల్ల కదా, పాపం అది కాస్తా చచ్చిపోయింది!

అమ్మకి కోపం వచ్చింది. అయినా బయట పడలేదు. "జంతువులను అట్లా జేబులో పెట్టుకుంటారా, ఎవరన్నా?! జేబులో పెట్టుకోకూడదు- వాటిని ఎత్తుకోవాలిరా కన్నా" అని చెప్పింది ముద్దుగా.

అంతలో వాళ్ల ఇంటి ముందు నుండి ఒక ఆవు దూడ పోతూ కనిపించింది కిట్టూకి. అమ్మ అటు తిరగ్గానే వాడు పోయి, దాన్ని పట్టుకొని తమ వసారాలోకి తెచ్చాడు. ఉన్నవాడు ఉన్నట్లు దాన్ని ఎత్తుకోవాలని చూశాడు.

కిట్టూ చిన్న పిల్లాడే గదా! అంత బరువును ఎట్లా మోస్తాడు? ఎత్తుకున్న ఆ దూడను కింద పడింది- దాని కాలు కాస్తా విరిగింది! అంతలో అక్కడికి చేరుకున్న దూడ యజమాని నానా యాగీ చేసి, అమ్మ ముక్కుపిండి డబ్బులు వసూలు చేసాడు.

వాళ్ళంతా వెళ్ళిపోయాక, అమ్మ చెప్పింది మురిపెంగా- "ఇట్లా బరువుగా ఉండేవాటిని ఎత్తుకోకూడదు నాన్నా! తోలుకుంటూ ఇంట్లోకి తెచ్చుకోవాలి" అని.

"ఎట్లా తోలతాం అమ్మా?" అడిగాడు కిట్టూ. "కొరడాతో తోలాలిరా కన్నా!" అన్నది అమ్మ వాడికి తెలియజెబుతున్నట్లు.

సరిగ్గా అదేరోజున కిట్టు వాళ్ల ఇంటికి చుట్టాలు వస్తున్నారు. "కిట్టూ!‌ చుట్టాలు వస్తున్నారు బాబూ, అట్లా బస్టాండు దాకా వెళ్ళి వాళ్లను ఇంటికి పిల్చుకురా" అన్నది అమ్మ.

అవకాశం కోసమే ఎదురు చూస్తున్న కిట్టూ కొరడా తీసుకొని పోయి, వాళ్లను కొట్టుకుంటూ ఇంటిదాకా తీసుకువచ్చాడు. ఆ వచ్చినవాళ్లు మంచివాళ్ళు కాబట్టి "బలే పెంచుతున్నారమ్మా, మీ కిట్టుని!" అని, వచ్చినంత త్వరగానూ సెలవు పుచ్చుకున్నారు.

వాళ్ళు వెళ్ళాక అమ్మ కిట్టును కూర్చోబెట్టుకొని, "చూడు నాన్నా! ఇట్లా చేస్తారా, తప్పుకదూ?! మన ఇంటికి అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళకు స్వాగతం పలకాలి. మర్యాదలు చెయ్యాలి. ఊరికే కొట్టకూడదమ్మా" అని మంచి మాటలు చెప్పింది.

ఆ రోజు సాయంత్రం చీకటి పడుతుండగా ఎవరో ఇంటికి వచ్చారు- కిట్టు ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. "ఏం బాబూ?! అమ్మని పిలువమ్మా" అన్నాడు వచ్చినతను. "అమ్మ బజారుకెళ్ళింది" చెప్పాడు కిట్టు. "మరి నాన్న ఉన్నాడా?" అడిగాడు అతను.

"లేడు. నాన్న కూడా అమ్మతోబాటే వెళ్ళాడు. ఎనిమిది గంటలకు గానీ‌ రారు ఇద్దరూ" అని చెప్పి, "ఇంతకీ మీరెవరు?" అడిగాడు కిట్టు.

అతను కొంచెం దిక్కులు చూశాడు. అంతలో కిట్టుకి అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి- అతిథి! "ఇతనే అతిధి" అని వెంటనే ఆ వచ్చిన వాడికి స్వాగతం పలికాడు. కూర్చోబెట్టాడు; మర్యాదలు చేశాడు.

అయితే ఆ వచ్చినవాడు ఒక దొంగ- వాడు కిట్టు సేవలన్నిటినీ స్వీకరించి, ఆ తర్వాత చేతికందిన నగలు డబ్బు తీసుకొని చక్కా పోయాడు. ఆ రోజున అమ్మ ఒక్కతే వచ్చింది ముందుగా. తన నగలు నట్రా పోవటం చూసి ఆవిడ లబోదిబో మన్నది.

అయినా వాడికి ఇంకో అవకాశం ఇస్తూ- "కిట్టూ! జాగ్రత్తగా ఉండాలి. ఇంటికొచ్చిన వాళ్లంతా అతిథులు కారు. ఎవరైనా అనూహ్యంగా రాత్రి పూట చీకట్లో మన ఇంటికి వచ్చారనుకో, వాళ్ళు అతిథులు కాకపోవచ్చు. అలాంటప్పుడు ఈ తాడుతో వాళ్ళని కుర్చీకి కట్టేసి, కర్రతో బలంగా వాయించేయ్యాలి. అందరూ‌ మనవాళ్ళే ఎలా అవుతారు?" అన్నది.

ఆరోజు రాత్రి ఆలస్యంగా వచ్చిన నాన్నను కుర్చీకి కట్టేసి కొట్టాడు కిట్టు.

అమ్మ ఇక మాట్లాడలేదు. కిట్టుకు ఏం చెప్పినా ప్రమాదమే అని గ్రహించినట్లుంది!

అయితే సంవత్సరం గడిచేసరికి కిట్టుకి తెలివి పెరిగింది. ఏది మంచి ఏది చెడు గ్రహింపుకు వచ్చింది. రాను రాను కచ్చలాగానే వాడి అల్లరి కూడా‌ తగ్గిపోయింది!