అనగనగా ఒక కలుగులో ఒక చిట్టి ఎలుక, వాళ్ళ అమ్మ నివసిస్తూ ఉండేవి. చిట్టి ఎలుక పుట్టాక ఏనాడూ కలుగులోంచి బయటికి అడుగు పెట్టి ఎరుగదు- వాళ్ళమ్మ ముందుచూపుతో దానికి ఆర్నెల్లకు సరిపడా ఆహారాన్ని కలుగులో జమ చేసి పెట్టింది కదా, అందుకని.
అయితే కలుగులో పెరిగీ పెరిగీ చిట్టి ఎలుకకు బయట ప్రపంచంలో ఏముంటుందో చూడాలని కోరిక బలపడిపోయింది. ఒక రోజున అది వాళ్ల అమ్మతో "అమ్మా...అమ్మా...నేను అట్లా కొంచెం సేపు బైట తిరిగి, ఎక్కడ ఏముందో చూసి వస్తానమ్మా, ప్లీజ్!" అని అడిగింది.
వాళ్ళ అమ్మకి దాని తెలివిని చూసి ముచ్చటేసింది. "సరేలే, పోయి చూసి రా! కానీ జాగ్రత్త, మరి- ఏది కనిపించినా దూరం నుంచే చూడు, తప్ప దగ్గరికి మాత్రం పోకు! వెనక్కి తిరిగి వచ్చాక ఏది ఎట్లా ఉందో చెప్పాలి నాకు, సరేనా?" అని హెచ్చరించి పంపింది.
కలుగులోంచి బయటికొచ్చిన చిట్టి ఎలుకకి ఈ ప్రపంచం అంతా చాలా అందంగా కనిపించింది. ఉషారుగా పాటలు పాడుకుంటూ అది కొంచెం దూరం పోయేసరికి దానికి భయంకరమైన జంతువొకటి కనిపించింది- పెద్దగా, నల్లగా, రెండు కొమ్ములు పెట్టుకొని- అది చిట్టి ఎలుక దగ్గరికల్లా మూతి తీసుకొచ్చి ఇట్లా "ఉఫ్......" అన్నది!
చిట్టి ఎలుక కాస్తా వణికి పోయి, ఎటుపోతోందో కూడా చూసుకోకుండా పరుగు పెట్టింది. అంతలోనే ఆ జంతువు గట్టిగా "బా......వ్" మని అరిచింది!
ఎలుక పిల్ల చటుక్కున దగ్గర్లో ఉన్న ఓ బండ మూలన నక్కి వెనక్కి చూసింది. ఆ జంతువు ఇప్పుడు తన ప్రక్కనే ఉన్న గడ్డిని పీక్కొని తింటున్నది: తెల్లగా మెరుస్తున్న దాని పళ్ళు గడ్డి పరకల్ని నములుతుంటే కరకరా శబ్దం వస్తున్నది.
వాటిని చూసే సరికి చిట్టి ఎలుకకు చెమటలు పోసాయి. కొద్ది సేపు దాన్ని అలాగే చూసాక అది మెల్లగా బండ వెనకకు అడుగులు వేసి, చటుక్కున కలుగు వైపుకు పరుగు పెట్టింది.
అట్లా అది కలుగు అంచుకి చేరుకుని లోనికి దూరబోతుండగానే అల్లంత దూరాన మరొక జంతువు కనిపించింది దానికి. ఇది అస్సలు భయంకరంగా లేదు. మెత్తగా, తెల్లగా, ముద్దుగా ఉంది. దానికో చక్కని కుచ్చు తోక ఉంది. కళ్ళు పచ్చగా లేత ఆకులలాగా మెరుస్తున్నాయి. సన్న గొంతుతో "మ్యా..వ్" అంటోందది!
"ఇది బలే ఉంది! వెళ్ళి దీంతో పరిచయం చేసుకుంటాను.." అనుకున్నది ఎలుక పిల్ల. కానీ అంతలోనే కలుగులోంచి చటాలున దాన్ని లోపలికి లాక్కున్నది వాళ్ళ అమ్మ. అప్పుడు అమ్మ ఊపిరి బరువుగాను, ముఖం గంభీరంగాను ఉండినై.
ఎలుక పిల్లకి భయం వేసింది- "కొంచెం సేపు అమ్మని మాట్లాడించ కూడదు" అని ఊరుకున్నది.
కొంచెం సేపటికి అమ్మ మామూలుగా అయ్యాక, అది అమ్మతో అన్నది- "అమ్మా! ఇవాళ్ల నాకు రెండు జంతువులు కనబడ్డాయి తెలుసా? ఒకటేమో మన ఇంటికి అల్లంత దూరాన ఉండింది. ఎంత నల్లగా భయంకరంగా ఉందో తెలుసా?! నామీద మూతి పెట్టి 'ఊఫ్..' అని ఊదితే, నేను ఎక్కడికో ఎగిరిపోయి పడ్డాను. ఆ తర్వాత అది 'బా...' అని ఎట్లా అరిచిందో! నేను భయపడి పోయాను" అన్నది.
"గడ్డి తింటున్నదా, అది?" అడిగింది అమ్మ ఎలుక ఊపిరి బిగబట్టి.
"అవునవును. దాని పళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి" అన్నది ఎలుక పిల్ల.
అమ్మ నవ్వింది. "దాన్ని బర్రె అంటారు. అది మనల్ని ఏమీ చెయ్యదు. చాలా మంచిదది" చెప్పింది అమ్మ.
"మరి ఇంకొకటేమో చాలా అందంగా, ముద్దుగా ఉంది. దానికో చక్కని కుచ్చుతోక, మూతికంతా మీసాలు- బలే నవ్వొచ్చింది నాకు. అది నన్ను చూడగానే "మ్యా...వ్" అని ఎంచక్కా పలకరించింది. నాకు అది బలే నచ్చిందిలే. రేపు వెళ్ళి దానితో పరిచయం చేసుకుంటాను" అన్నది చిట్టెలుక నవ్వు ముఖంతో.
అమ్మ ముఖం భయంతో వణికింది. "ఆ పని మాత్రం చెయ్యకు. దాన్ని పిల్లి అంటారు. అది మనకు శత్రువు. నువ్వు దొరికావంటే చాలు- గబుక్కున మింగేసి పోతుందది. అది కనిపిస్తే చాలు- పారిపోవాలి మనం. ఊరికే రూపాన్ని చూసి మోసపోకు పాపా, జాగ్రత్త!" అని హెచ్చరిస్తూ దాన్ని హత్తుకున్నది తల్లి ఎలుక.