ఓ పచ్చటి కోన అంచున 'నెమలి కోన' అని ఓ చిన్న పల్లె. కోన వైపున ఉన్న చివరి ఇంట్లో ఓ అందమైన పాప పుట్టింది. ఆమెకు 'మయూరి' అని పేరు పెట్టారు.

మూడేళ్లు నిండబోతున్నా, ఆ పిల్లకు నడకరాలేదు. నేలమీద దోగాటడమే తప్ప, ఒక్కసారైనా లేచి నిలబడలేదు. ఇరుగు-పొరుగు వాళ్ళు ఆ పాపను 'మయూరి- మయూరి' అని పిలుస్తుంటే తమ బిడ్డను వ వెక్కిరిస్తున్నట్లుగా అనిపించేది వాళ్ల అమ్మకి, నాన్నకి.

ఆ యేడు తొలకరి వానలు మొదలైనాయి.

ఓ నాటి సాయంత్రం పావుగంట సేపు వాన కురిసి ఆగింది. ఇంట్లోంచి మయూరి దోగాడుతూ వాకిట్లోకి వచ్చింది. మామూలుగా కోనలో తిరిగే ఓ నెమలి అప్పుడు ఇంటి ముందుకు వచ్చి నిలబడింది. మెడ తిప్పుతూ, పాప కళ్లలోకి సూటిగా చూసింది. మెల్లగా పాప దగ్గరికి వచ్చి, ఆమె చుట్టూ వయ్యారంగా నడవసాగింది.

మయూరి దాని వెంట దోగాడుతూ పోయింది. చేతులు చాపి దాన్ని పట్టుకోబోయింది. అది అందలేదేమో, చటుక్కున లేచి నిలబడింది. నెమలి పరుగుతీసింది. పాప తల్లి ముఖం కలువ పువ్వబోయింది. ఆమె సంతోషంతో చప్పట్లు చరిచింది. పాప చప్పున చతికిల బడింది.

మరునాటి సాయంత్రం తడినేలలో కాలి ముద్రలు వేసుకుంటూ మళ్లీ వచ్చింది నెమలి. ఈసారి అది పాప చుట్టూ కొంచెం వేగంగానే నడుస్తూ వయ్యారాలు ఒలకబోసింది. మయూరి దానికేసే చూస్తూ కాసేపు ఆడుకొంది. అందుకోవాలనుకున్నది.

ఒక్కసారిగా తటాలున లేచి నిలబడింది. చక చకా నాలుగు అడుగులు వేసి దాన్ని పట్టుకోబోయింది. నెమలి పరుగు అందుకున్నది. పాప తుపుక్కున కూలబడింది.

మూడో రోజున మళ్ళీ వాన కురిసాక, ఆకాశంలో ఏడు రంగుల ఇంద్ర ధనస్సు వెలిసింది. ఇప్పుడు నెమలి కోసం ఎదురుచూస్తూ నుంచున్నది మయూరి. రానే వచ్చింది నెమలి!

పాప ఎదుట నిలబడి, ఒళ్లు విదిలించుకుంది. మెల్లమెల్లగా పురివిప్పింది. మనోహరంగా నాట్యం చేసింది. నాట్యం పూర్తయ్యేసరికి మయూరి లేచి నెమలి చెంతకు పరుగుతీసింది. అందకుండా పారిపోయింది నెమలి.

ఇప్పుడది రోజూ వస్తూనే ఉంటుంది. పాప దాని వెంట పరుగులు తీస్తుంది కానీ, పడిపోదు. నెమలిని సున్నితంగా పట్టుకుంటుంది. అది కూడా సుతారంగా విడిపించుకుంటుంది.

వాన వెలిస్తే చాలు- ఇద్దరూ నెమలికోనలో ఒకరినొకరు తరుముకుంటూ కనిపిస్తారు. ఎవరైనా 'మయీరీ!' అని పిలిస్తే నెమలి వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు "ఓయ్! వాళ్ళు పిలిచింది నిన్ను కాదు- నన్ను!" అంటుంది మయూరి ఎగతాళిగా!