బెజవాడలో కృష్ణ, అనూరాధ అనే దంపతులకు సాయి ఆదిత్య అనే‌ ఒక కొడుకు ఉన్నాడు సాయి ఆదిత్య రెండో తరగతి చదువుతున్నాడు. బెజవాడలో నివాసం ఉండేవారు దానిని 'బ్లేజ్‌వాడ' అంటుంటారు సరదాగా- ఎందుకంటే అక్కడ ఎండలు చాలా ఎక్కువ కదా, అందుకని.
ఎండాకాలంలో స్కూలు ఏడున్నర నుంచి పన్నెండుర వరకు ఉంటుంది. ఒకరోజు సాయి ఆదిత్య ప్రొద్దున్నే స్కూలుకు వెళ్లిపోయాడు. తను, తన స్నేహితుడు అర్జున్‌ ఇద్దరూ వాటర్ బాటిల్స్‌తో ఆడుకుంటూ ఉంటే మంచి నీళ్లు అన్నీ క్రింద పడిపోయాయి. దాంతో సాయి ఆదిత్య ఆరోజు ప్రొద్దున్న మొత్తం నీళ్లు తాగకుండా ఉండిపోయాడు."స్కూలులో కుళాయి దగ్గర నీళ్లు తీసుకొని త్రాగచ్చు కదా?"- ఉహు. వాడికి ఆ సంగతి అంత బాగా తెలీదు. చిన్న పిల్లవాడు కదా. "ఇంటికి వెళ్ళిన తర్వాత త్రాగొచ్చులే" అని అలా ఉండిపోయాడు.

మరి అసలే మండే ఎండలు, మధ్యాహ్నం స్కూలు వదిలి ఇంటికి వచ్చేసరికి రెండు దాటింది. వాడి ఒంట్లో నీళ్ళన్నీ ఆవిరి ఐపోయినట్లున్నాయి- దాంతో వాడు చాలా 'డీ హైడ్రేట్' అయిపోయాడు- ఇంటి గుమ్మం దగ్గరే కళ్లు తిరిగి పడిపోయాడు!అయితే వాళ్ళమ్మ చూసింది కదా, ఆవిడకు సంగతి అర్థమైంది. వెంటనే వాడిని ఇంట్లోకి తీసుకువెళ్లి, పడుకోబెట్టింది. గ్లాసెడు నీళ్ళలో చిటికెడు ఉప్పు, రెండు చెంచాలు చక్కెర వేసి కలిపి, అవి కరిగాక కొంచెం నిమ్మరసం పిండి తీసుకొచ్చి త్రాగించింది. ఆ తర్వాత వాడికి నిద్ర పట్టేసింది! అప్పుడు అమ్మే వాడి స్కూలు డ్రస్సు మార్చి, వదులైన కాటన్ డ్రస్ వేసింది.


సాయంత్రం కృష్ణ ఆఫీసు నుండి వచ్చేటప్పుడు కొబ్బరి బోండాలు, పుచ్చకాయలు తీసుకువచ్చారు. కొబ్బరి నీళ్ళు త్రాగి పుచ్చకాయలు తింటుండగా అనురాధ అడిగింది ఆదిత్యని- "ఎందుకు, అంత నీరసంగా అయిపోయావు? మంచి నీళ్లు సరిగా తాగలేదా?” అని. "ఆడుకుంటుంటే నీళ్లు ఒలికిపోయాయి కదా, అందుకని 'ఇంటికి వెళ్లిన తర్వాత తాగుదాం' అని అట్లా ఉండిపోయాను" చెప్పాడు ఆదిత్య.

“ఏ పని చేసినా కాలాన్ని చూసుకొని చెయ్యాలి నాన్నా! ఎండాకాలం ఎక్కువ నీళ్ళు తాగాలి. వీలైతే ప్రతి ఇరవై నిముషాలకి కొంచెం మంచి నీళ్లు తాగాలి. లేకపోతే వడదెబ్బ తగిలి, ప్రాణాలకు చాలా ప్రమాదం అయిపోతుంది. వానాకాలం అయితే వర్షంలో తడవకుండా గొడుగులు, రెయిన్ కోటులు వాడాలి. తడిగా, వాసనకొట్టే బట్టలు వేసుకోకూడదు. ఎండలో ఆరిన బట్టలే వేసుకోవాలి. వీలైతే గోరువెచ్చ నీళ్ళు త్రాగుతుండాలి. మరి చలికాలం అయితే ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి. స్వెట్టర్లు వాడాలి. ఛాతీని, చెవుల్ని కప్పి ఉంచుకోవాలి" చెప్పింది అనురాధ. "సరే, అయితే ఇప్పుడింక నేను ఎండ బాగా తగ్గిన తర్వాతే బయటికెళ్లి ఆడుకుంటాను. ఎక్కువ నీళ్లు కూడా తాగుతాను. వానాకాలం వచ్చాక గోరువెచ్చటి నీళ్ళు త్రాగుతాను" అన్నాడు, నోటినిండా పుచ్చకాయ ముక్కలు పెట్టుకొని.