అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు చుక్కాపురం. ఊరు చాలా చిన్నది- అందుకని అక్కడ బడి లేదు. ఎవరన్నా బడికి వెళ్ళాలంటే పొరుగూరికి వెళ్లాల్సిందే.

ఆ ఊరికి కూడా‌ నడచుకొని వెళ్ళాలి- అందుకనే అప్పట్లో చుక్కాపురం వాళ్ళు ఎవ్వరూ అసలు ఏమీ చదువుకోలేదు: ఇప్పుడు కూడా ఎవ్వరూ‌ బడికి పోయేవాళ్ళు లేనే లేరు!

చిట్టి చిట్టి పిల్లలు ఊరికే రోజంతా ఆటలాడుకుంటూ ఉండేవాళ్ళు; కొంచెం పెద్ద పిల్లలు వాళ్లను చూసుకుంటూ ఉండేవాళ్ళు; ఇంకా పెద్ద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతోబాటు పొలంలో పనికి పోయేవాళ్ళు; మరీ పెద్ద పిల్లలు ఐతే పెళ్ళి చేసుకొని వంట పనుల్లో మునిగిపోయి ఉండేవాళ్ళు.

ఆ ఊళ్లో కమల, విమల అనే అమ్మాయిలు ఇద్దరూ మంచి స్నేహితులు. పట్నాల్లో ఉన్న బంధువుల పిల్లలు శుభ్రంగా చదువుకుంటుండటం చూసి, 'మేమూ బడికి పోతాం' అనటం మొదలు పెట్టారు వాళ్ళు.

వాళ్ళను వెనక్కి లాగేందుకు చాలామంది పెద్దవాళ్ళు ప్రయత్నించారు. "మీకెందుకే, చదువు?" అన్నారు. "పెద్ద పెద్ద మగోళ్ళే పొలం పనులు చేసుకుంటా ఉంటే, మీరేంటి చదివేది?" అన్నారు. "అబ్బ చదవొ-చ్చారమ్మా, చదివి కలెక్టర్లు అవుతారు!" అని ఎగతాళి చేశారు.

అయినా కమల విమల ఇద్దరూ‌ పట్టిన పట్టు విడవలేదు. "ఇక్కడికే కాదు- ఎంత దూరమైనా పోతాం. బడికి పోవాల్సిందే" అని పోరాడారు.

చివరికి వాళ్ల ఇంట్లోవాళ్ళు వీళ్ళ పోరు పడలేక, "సరే, మీకు కష్టమయ్యేంత వరకూ‌ బడికి పోండి. అటుపైన ఎట్లాగూ మీరే మానేస్తారు" అని వదిలిపెట్టారు.

దాంతో వాళ్లు ఇద్దరూ బడికి పోవటం మొదలెట్టారు. టీచర్లు చెప్పినవన్నీ శ్రద్ధగా విని, నోట్సులు రాసుకొని- మంచి పిల్లలు అనిపించుకోసాగారు.

అన్నీ‌ బాగున్నాయి కానీ వాళ్ళకు ఒక్కటే భయం- సాయంత్రం ఐదు గంటలకు వదులుతారు బడి. చలికాలంలో మరి ఐదున్నరకల్లా చీకటిపడిపోతుంది; ఆ చీకట్లో దారి సరిగ్గా కనిపించదు. అడవి దారి అసలు ఏమాత్రం సరిగ్గా ఉండదు. ఎప్పుడైనా దారి తప్పారంటే అంతే- ఇక రాత్రంతా అడవిలో తిరుగుతూ ఉండాల్సిందే.

"మన ఊరి వాళ్లను ఎవరినైనా మనకు ఎదురు రమ్మందాం" అన్నది కమల. "ఊరుకో, వాళ్లను ఎదురు రమ్మంటే ముందు మనల్నే బడి మాన్పిస్తారు. ఇంకో మార్గం ఏదైనా వెతకాల్సిందే" అన్నది విమల. చివరికి ఆ సంగతి ఎటూ తేలలేదు.

అయినా ఒక రోజున వాళ్ళు భయపడినంతా అయ్యింది: ఉదయాన్నే లేచి ఇద్దరూ చక్కగా నడుచుకుంటూ బడికి వెళ్లారా, కానీ సాయంత్రందారి తప్పి ఎటో అడవి మూలల్లోకి వెళ్లిపోయారు! చీకటి పడింది.. ఇంటికెళ్లే దారి ఇక ఏమాత్రం కనబడకుండా అయ్యింది!

పాపం ఇంక ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. "నాకు చాలా భయంగా ఉంది- ఏడవాలనిపిస్తున్నది. ఆకలి వేస్తున్నది" అన్నది విమల.

"ఇదిగో, ఊరికే భయపడకు. ఏదైనా కష్టం వస్తే ధైర్యంతో ఎదుర్కోవాలి తప్ప, భయపడకూడదు- అని చెప్పలేదా, టీచరుగారు? నువ్వు ఊరుకో. ఏమైతే అది కానియ్యి! రేపు ఎట్లాగూ సూర్యుడు వస్తాడు కద!" అంటూ బ్యాగులో ఉన్న మొక్కజొన్న కంకిని బయటికి తీసింది కమల. ఇద్దరూ కలిసి ఓ చెట్టెక్కి కూర్చొని, కంకిని తిన్నారు.

"మరి మనం పడుకోవచ్చా, పాములు పుట్రలు వస్తే ఎలాగ?" అన్నది విమల ఇంకా భయపడుతూ.

"ఆంజనేయస్వామిని తలచుకుంటే ఏవీ మనదగ్గరకు రావంటలే" అన్నది కమల. ఇక ఇద్దరూ ఆంజనేయస్వామిని తలచుకుంటూ ఆ కొమ్మ మీదనే కూర్చున్నారు.

అంతలో అటుగా పోతున్న వేటగాడొకడు వీళ్ళని చూసి దగ్గరికొచ్చి- "ఏ ఊరు పాపా, ఇంత చీకటి వేళ ఇక్కడున్నారు?" అని అడిగాడు. తమని కాపాడేందుకు ఆంజనేయస్వామే ఇట్లా వచ్చాడనిపించింది పిల్లలకు. ఇద్దరూ గబగబా కొమ్మ దిగి వచ్చి అతనికి గోడు అంతా వెళ్లబోసుకున్నారు.

"పెద్దల మాట వినాలి కదమ్మా, బడికి పోకపోతే మటుకు ఏమి? నాకూ ఓ పాప ఉన్నది మీ అంతది. బడికి పోతానంటే నేనే, పంపియ్యలేదు. ఇప్పుడు ఇంట్లోనే ఉంది. చక్కగా పనులు చేసుకుంటూ" అని, వాళ్లను వెంటబెట్టుకొని, కబుర్లు చెబుతూ అడవి దాటించాడు వేటగాడు.

ఆ సరికి చుక్కాపురం‌ మొత్తం గందరగోళమౌతున్నది- 'వద్దన్నా వెళ్ళారు పిల్లలు- ఇంత చీకటైనా వెనక్కి తిరిగి రాలేదు" అని. వీళ్లను చూడగానే అందరి ప్రాణాలూ లేచి వచ్చాయి. "ఇంక ఏనాటికీ పిల్లల్ని బడికి పోనివ్వం" అని పిల్లల్నిద్దరినీ దగ్గరికి తీసుకున్నారు.

కమల విమల ఏడుపు మొదలు పెట్టారు. "లేదు- మళ్ళీ ఇట్లా జరగదు- మేం బడికి వెళ్ళాల్సిందే" అనసాగారు. పెద్దవాళ్ళు వాళ్ళని కసరటం మొదలెట్టారు. అందరూ తమకు తోచిన విధంగా మాట్లాడుతుంటే వేటగాడు ఊరికే నిలబడ్డాడు కొంత సేపు.
అంతలో కమలవాళ్ళమ్మ అతని దగ్గరికొచ్చి "ఇంత జరిగినా బుద్ధి రాలేదు చూడయ్యా ఈ పిల్లలు ఎట్లా ఉన్నారో!" అంది.

వేటగాడు కొంచెంసేపు ఆలోచించి మెల్లగా అన్నాడు- "మీరేమీ అనుకోకపోతే నేనోమాట చెప్పనా తల్లీ-" అని. అందరూ నిశ్శబ్దం అయ్యారు- "ఈ పిల్లలిద్దరూ నిజంగా గొప్ప తెలివైన వాళ్ళు తల్లీ, గొప్ప ధైర్యవంతులు కూడా. చదువు వీళ్లకు చాలా సంగతులు నేర్పించింది. వీళ్ళతో అక్కడినుండీ మాట్లాడుతూ వచ్చాను కద, నాకు కూడా అర్థమైంది- పిల్లలకు చదువు చాలా అవసరం. నిజంగా ఇవాళ్ల నా మనసులో గట్టిగా అనిపించిందమ్మా- మా పిల్లనీ బడికి పంపాలని! మీరు ఏమీ అనుకోకపోతే, వీళ్లని బడికి పోనివ్వండి- నేను కూడా మా అమ్మిని అటునుండి బడికి పంపుతాను. అంతా కలిసి చదువుకుంటారు; కలిసి వెనక్కి తిరిగొస్తారు. ఎవరికీ ఏమీ కష్టం ఉండదు!" అని.

ఊళ్ళోవాళ్లంతా మౌనంగా తలలూపారు.

అటుపైన కమల విమలలతో పాటు చుక్కాపురం పిల్లలు అందరూ బడికి పోవటం మొదలెట్టారు!