విక్రం ఎప్పటిలాగే స్టేషనుకు వెళ్లాడు.

ఎప్పుడూ‌ రకరకాల కేసులతో వ్యస్తంగా ఉండే స్టేషను కొన్నాళ్లుగా ఎందుకనో, కేసులేమీ లేక, బందురోజున బీసెంటు రోడ్డు లాగా ఖాళీగా ఉంది. కానిస్టేబుళ్లు, రైటరు, హోంగార్డులు అందరూ ఎక్కడివాళ్లక్కడ ఊరికే ఉన్నారు.

'ఏదో వింత కేసు రాబోతోంది' అని ఎదురుచూడటం మొదలెట్టాడు విక్రం-

'ఇట్లా చాలా సార్లు జరిగింది: స్టేషను ఖాళీ అయ్యిందంటే వింతకేసు ఏదో ఒకటి వస్తుంది' అనుకున్నాడు.

అంతలోనే ఫోను-"అయ్యా, ఇన్‌స్పెక్టరు గారూ! పెద్ద సమస్య ఒకటి వచ్చి పడింది. దాన్ని మీరేనట, పరిష్కరించగలవారు- రమ్మంటారా?" అని.

"ఇంతకీ మీరెవరో చెప్పారు కారు" అన్నాడు విక్రం. "సమస్యేంటో కూడా చెప్పలేదు. నా వల్ల అవుతుందో, లేదో చూడాలి."

"నన్ను ప్రొఫెసర్ సిద్ధప్ప అంటారు-రోబాటిక్స్ శాస్త్ర పరిశోధకుడిని. ఈ ఊరి చివర్లో మాకో ప్రయోగశాల ఉంది. మీరు చూసే ఉంటారు-"ఉజ్జా రోబోస్" అని పెద్ద క్యాంపస్.

"తెలుసు- చెప్పండి."

"మాకో పెద్ద సమస్య వచ్చి పడింది. మిమ్మల్ని కలిసి మనవిచేస్తాను-"

"సరే, రండి."

ప్రొఫెసర్ సిద్ధప్ప సన్నగా, పొడుగ్గా లావుపాటి కళ్ల జోడుతో బవిరిగడ్డంతో; జుబ్బా వేసుకొని స్వామీజీలాగా ఉన్నాడు. "మాకో సెంట్రల్ రోబాట్ ఉంది. దాని పేరు బేతాళం." వచ్చి కూర్చొని చెప్పసాగాడు.

"బేతాళం లేనిదే మాకు ఒక్క పూట గూడా గడవదు. దానికి సొంతంగా ఆలోచించే శక్తి ఉంది- 'అదెలా సాధ్యం అనకండి. ప్రస్తుతపు మనిషి మెదడు కంటే వందరెట్లు చురుకుగా పనిచేసే సామర్థ్యం ఉండేట్లు, దానంతట అది- తార్కికంగానే కాక, సృజనాత్మకంగా కూడాను-పనిచేసేట్లు, దాన్ని తయారు చేశాం. బయటి ప్రపంచంతోటి సంబంధం లేకుండా కృత్రిమ వాతావరణంలో పెంచాం. వెలుతురు నుండి అది తన శక్తిని గ్రహించగలదు; బ్యాటరీలను ఛార్జ్ చేసుకోగలదు..."

"చెప్పండి, ఇప్పుడేమైంది"

"అది ప్రకృతిలోకి వచ్చింది! ఖచ్చితంగా చెప్పాలంటే చెట్టెక్కి కూర్చున్నది. మా క్యాంపస్‌లో వెనకగా ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది. నాలుగురోజుల క్రితం బేతాళం తన గదిలోంచి పారిపోయి ఆ చెట్టెక్కి కూర్చున్నది. వాతావరణాన్ని, గాలి కదలికలనీ, చెట్టు కణాలలో మార్పునీ, మేఘాల సాంద్రతనీ, ఎండ వేడిని- ఇంకా రకరకాల మార్పులు అన్నిటినీ కొలుచుకుంటూ, అక్కడే కూర్చున్నది. ఏం చేసినా క్రిందికి దిగి రావట్లేదు- వేరే ఏమీ మాట్లాడట్లేదు.."

"మరి నేనేం చేయగలను?"

"బేతాళాన్ని ఎలాగైనా ఒప్పించి క్రిందికి దాని గదిలోకి తేవాలి. దాన్ని ఎవ్వరమూ బలవంత పెట్టలేం; పెట్టి ప్రయోజనం లేదు- దానంతట అది రావాల్సిందే. ఎలాగో ఒకలాగా దాన్ని ఒప్పించి క్రిందికి తేవటం మీ ఒక్కరికే సాధ్యం. దయచేసి రండి. దాంతో మాట్లాడండి. మీ కష్టాన్ని వృధా పోనివ్వం- మీరు ఎంతంటే అంత ప్రతిఫలం ఇస్తాం" చెప్పాడు సిద్ధప్ప.

విక్రం అతనితో బాటు పోయి వాళ్ల క్యాంపస్‌లోని భవనాలన్నీ చూశాడు.

చెట్టుమీద ఎక్కి కూర్చొని ఉంది బేతాళం.. తను చెట్టెక్కేందుకు వీలుగా పెద్ద నిచ్చెన ఒకటి వేసి ఉన్నది.

విక్రం చిరునవ్వు నవ్వి నిచ్చెన ఎక్కటం మొదలెట్టాడు..

వెంటనే బేతాళం 'కికికికి' అని నవ్వింది.

"వచ్చావా, నీ కోసమే ఎదురుచూస్తున్నాను. నన్ను ఒప్పించి మళ్లీ ఎసి గదిలోకి తీసుకెళ్దామనేగా, నువ్వొచ్చింది? నాకు తెలుసు. కానీ అసలు సంగతేంటో తెలీనిది, పాపం నీకే. అయినా నిన్ను చూస్తే నాకు కోపం రావట్లేదు; జాలివేస్తున్నది. ఎందుకంటే నీది మంచి మనసు, నీ శరీరం గట్టిది.' అట్లాంటి మనసును, శరీరాన్ని యీ సిద్ధప్పలాంటి వాళ్ళకు తాకట్టు పెడుతున్నావే!' అని నాకు చాలా బాధవేస్తున్నది-”

"అయినా నువ్వొచ్చావు కాబట్టి, నిన్ను కాదనలేక, చెట్టుదిగి నీతో వస్తా; అలసట తెలీకుండా ఉండేందుకు గాను దారిలో నీకో కథకూడా చెబుతా. అయితే నేను చెప్పే కథని నువ్వు నోరెత్తకుండా వినాలి. ఇది మరచిపోయి నోరెత్తావంటే, ఆ తర్వాత ఇక నా చెట్టు నాది, నీ దారి నీది- సరేనా?" అని ఓ కథ మొదలు పెట్టింది...
(సశేషం)