అనగనగా ఒక అడవిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక మొసలి, ఒక పీత ఉండేవి. వాటికి చెరువులో‌ ఉండే చేపలన్నా, పురుగులన్నా చాలా ఇష్టం. రోజూ లెక్కలేనన్ని చేపల్ని, పురుగుల్నీ‌ పట్టుకొని నములుతూ ఉండేవి ఆ రెండూ.

ఒకరోజున అవి రెండూ ముచ్చట్లు పెట్టుకుంటూ చేపల్ని నములుదామని చూస్తే అసలు ఎక్కడా ఒక్క చేప కూడా లేదు! చెరువులో అంతటా కనీసం ఒక్క పురుగు కూడా లేదు!

"అయ్యో! మనం అన్ని చేపల్నీ, అన్ని పురుగుల్నీ కూడా తినేసినట్టున్నామే! మరి ఇప్పుడు ఏం చెయ్యాలి?" అంది పీత బాధగా, కడుపు పట్టుకొని.

మొసలి కొంతసేపు మౌనంగా ఆలోచించి, "ఆ...ఐడియా! మనం ఇప్పుడు ఇంక జంతువులని పట్టుకొని తినాలి!" అంది. ఆ మాట వినగానే పీతకు నీరసం వచ్చేసింది. "ఐడియా బాగుంది; కానీ జంతువులు ఎప్పుడోగానీ మనం ఉండే ఈ చెరువుకు రావు కదా, మరి వాటిని మనం ఎలా పట్టుకోగలం, అసలు?" అన్నది.

"ఏమో! మన అదృష్టం‌ బాగుంటే ఒకదాని తర్వాత ఒకటి లెక్కలేనన్ని జంతువులు వచ్చి నేరుగా మన నోట్లోకే పడచ్చు!" అన్నది మొసలి "అంతగా జంతువులు మన నోట్లోకి దూకకపోయినా ఏమీ‌ పర్లేదు. నువ్వు వాటితో‌ ఏమైనా ముచ్చట్లు పెట్టుకొని వాటి మనసు మళ్ళిస్తూ ఉండు. నేను దొంగగా వచ్చి వాటి మీదికి దూకి చంపేస్తా. అప్పుడు ఇక మనిద్దరి సమస్యలూ‌ తీరతాయి" అని జోడిస్తూ.

కానీ మూడు రోజుల పాటు ఒక్క జంతువు కూడా‌ ఆ చెరువు దరిదాపుల్లోకి రాలేదు! పీత దాదాపు నిరాశ చెందుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక జింక అటువైపుగా వచ్చింది.

పథకం ప్రకారం దాన్ని పలకరించేందుకు వెళ్లసాగింది పీత. అయితే ఆకలి పట్టలేని మొసలి ఆ లోగానే జింకమీదికి దూకబోయింది. అలికిడికి భయపడ్డ జింక ఒక్క ఉదుటున బయటికి గెంతి, పరుగే పరుగు!

అట్లా చేతికందిన ఆహారం‌ తప్పించుకొని పోయాక, మొసలి మరొక పథకం వేసింది. "ఇదిగో చూడు! మనం ఇక్కడ ఇట్లా కూర్చుంటే జంతువులేవీ ఇటువైపుకు రావు; మన ఆకలీ తీరదు. అందుకని నువ్వు ఇప్పుడు అడవిలోకి ఏడుస్తూ వెళ్ళి, కనబడ్డ జంతువుకల్లా చెప్పు- నేను చనిపోయానని! బాగా నటించాలి. నీ కళ్ళనీళ్ళు నిజం అనుకొని కనీసం ఒక వంద జంతువులన్నా ఇటు చెరువు ప్రక్కకు రావాలి. అప్పుడు నేను రహస్యంగా వాటిని ఒక్కొక్కదాన్నే చెరువులోకి లాక్కొని పోయి చంపేస్తాను" అన్నది.

పీత అడవిలోకి బయలుదేరింది. అది ఇంకా పది అడుగులు అటు వేసిందో లేదో, దానికో‌ నక్క ఎదురైంది. పీత గబగబా కొంత ఉమ్మిని కళ్ళక్రింద పులుముకొని నక్క దగ్గరికి వెళ్ళి "నక్కమామా! నీ పియమైన అల్లుడు మొసలి ఇక లేడు. మీ కడసారి చూపు కూడా దక్కకుండానే తనువు చాలించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు" అన్నది బొంగురు గొంతుతో.

"అవునా! మొసలి చచ్చిపోయిందా! నిజంగానే?! అంత బలంగా ఉండేదే!!" అన్నది నక్క అనుమానంగా.

"పాపం, మరి, అవును" అన్నది పీత, ఇంకేమనాలో తెలీక.

"ఊరికే మూర్ఛ పోయిందేమో, నాకు చూపించు కొంచెం " అని నక్క చెరువు వైపుకు దారి తీసింది.

అక్కడ చెరువు అంచున ఇసకలో కదలకుండా పడి ఉన్నది మొసలి. నక్క దానికి బాగా దూరంగా‌ నిలబడి "ఇదేంటి, చచ్చిపోయిన నక్కలు గాలి పీల్చుకోవాలి కదా! దీని గాలి నిలబడింది- అంటే దానర్థం‌ ఇది కేవలం మూర్ఛ పోయిందని!" అన్నది.

దాని మాటలు వినగానే మొసలి గాలి పీల్చుకొని వదలటం మొదలు పెట్టింది.

దాన్ని చూడగానే నక్కకు అర్థం అయిపోయి, నవ్వు వచ్చింది. అయినా ఐ నవ్వును ఆపుకొని అన్నది "ఊఁ అవును. గాలి పీలుస్తున్నది. అంటే చచ్చిపోయినట్లే. కాని మా అమ్మ నాకు చెప్పేది, చనిపోయిన నక్కలు తోక ఊపుతాయి అని. మరి ఈ మొసలి తోక ఊపట్లేదేమి?" అంది పీతతో.

మొసలి తటాలున తోక లేపి ఊపింది.

నక్క నవ్వుతూ దూరంగా జరిగి- తిక్క మొసలీ! చనిపోయిన జంతువులు ఎక్కడైనా గాలి పీలుస్తాయా, తోకలు కదిలిస్తాయా! పిచ్చి అబద్దాలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తారా!" అంది వెళ్లిపోతూ.

తరువాత ఆ నక్క అడవిలోకి వెళ్లి అడవిలో ఎంతమందికి ఈ విషయం చెప్పిందో గాని, ఒక్క జంతువు కూడా ఆ చెరువు వైపుకు రాలేదు. తిండి లేక పీత, మొసలి రెండూ చనిపోయాయి.