చైనాను చింగ్ చక్రవర్తులు పరిపాలిస్తున్న రోజుల్లో 'చెంగ్-పాయ్-లిన్' అనే సాధారణ వ్యక్తి ఒకడుండేవాడు.
అతను తన పని తాను చేసుకునేవాడు; బుద్ధిని పదునుగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తూండేవాడు. అతనికి ఒకరోజున అద్భుతమైన కల ఒకటి వచ్చింది.
కలలో అవలికితేశ్వర బోధిసత్త్వుడు కనిపించాడు అతనికి: "రేపు చింగ్ సైన్యాలు మీ ఊరిమీద దాడి చేస్తాయి. మీ కుటుంబంలో ఉన్న పదిహేడు మందిలో పదహారు మంది ప్రాణాలతో బయట-పడతారు.
కానీ నీ రాతనుండి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. 'వాంగ్-మా-ట్జె' అనేవాడు నిన్ను రేపు చంపేస్తాడు. ఎందుకంటే, గత జన్మలో నువ్వు ఇరభై ఆరు సార్లు కత్తితో పొడిచి చంపావు, వాడిని'! అని చెప్పాడు అతనికి!
'చెంగ్-పాయ్-లిన్' ఏమీ అనలేదు. బోధిసత్త్వుడు ఇంకా చెప్పాడు: "అయితే దీనినుండి తప్పించుకునే పద్ధతి ఒకటి ఉంది: అదైనా ఎంతవరకు పనిచేస్తుందో, తెలీదు- రేపు మధ్యాహ్నానికల్లా చక్కటి విందు ఒకటి తయారు చెయ్యి. 'వాంగ్-మా-ట్జె' రాగానే అతన్ని నీతో బాటు భోజనానికి ఆహ్వానించు. ఆ తర్వాత, అతను నిన్ను చంపేందుకు కూడా వీలు కల్పించు- అట్లా చేస్తే, మరి, పరిస్థితి ఏమైనా మారుతుందేమో".
ఉదయాన్న లేచేసరికి కల ఇంకా స్పష్టంగానే గుర్తున్నది 'చెంగ్-పాయ్-లిన్'కు. అతని మనసును ఆ కల ఏదో బాగానే ప్రభావితం చేసినట్లున్నది: అతను మెల్లగా బయటికి పోయి, రకరకాల కూరగాయలు, స్వీట్లు, సారాయీ అన్నీ కొనుక్కొచ్చి మధ్యాహ్నానికల్లా గొప్ప విందు భోజనం తయారు చేశాడు.
అంతలోనే ఎవరో తలుపు తట్టిన శబ్దం అయ్యింది! తలుపుతీస్తే, బయట ఎవరో పరిచయం లేని యోధుడు ఒకడు నిలబడి ఉన్నాడు.
"నువ్వేనా, 'వాంగ్-మా-ట్జె'?" అడిగాడు చెంగ్-పాయ్-లిన్.
"ఆశ్చర్యంగా ఉందే, నా పేరు నీకెట్లా తెలుసు? ఉత్తరాన ఉన్న దూరదేశం నుండి నేను ఇప్పుడే యీ ఊర్లో అడుగుపెట్టాను." అన్నాడు తలుపు దగ్గరి యోధుడు.
చెంగ్ అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి, అతను లోనికి అడుగు పెడుతుండగా చెప్పాడు- "స్వాగతం! నీకోసం విందు భోజనం ఎదురు చూస్తున్నది. ఇద్దరం కలిసి భోంచేస్తూ మాట్లాడుకోవచ్చు" అని.
ఆశ్చర్యపోతున్న వాంగ్‌కు అతను ముందురోజు తనకొచ్చిన కలను వివరించి, చెప్పాడు- "పోయిన జన్మలో నేను నిన్ను ఇరవై ఆరు సార్లు కత్తితో పొడిచి చంపాను. కాబట్టి యీసారి నీవంతు. నన్ను ఇరవై ఆరు సార్లు పొడిచి చంపేందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఒకసారి మనం భోజనం చేసేశాక, అప్పుడు నీపని నువ్వు కానిస్తువు. ముందు భోంచేద్దాం."
'వాంగ్ మాట్జె' దాన్ని గురించే ఆలోచిస్తూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు- చివరికి అన్నాడు- "ఇదంతా చాలా చిత్రంగాను, గందరగోళంగాను ఉన్నది. నువ్వు నన్ను పోయిన జన్మలో చంపావు; మళ్లీ అందుకుగాను నేను నిన్ను యీ జన్మలో చంపుతాను; అందుకు గాను మళ్లీ వచ్చే జన్మలో నువ్వు నన్ను చంపవా?- ఇది ఇట్లా పోతూనే ఉంటుంది కదా? అందుకని వద్దులే, నేను నిన్ను చంపను. ఏమైతే అది కానియ్యి" అని తన కత్తితో చెంగ్‌పాయ్‌లిన్ వీపు మీద ఇరవై ఆరు చిన్న చిన్న గాట్లు పెట్టాడు- "దీంతో మన ఋణం తీరిపోయిందని భావిద్దాం!" అంటూ.
వాంగ్‌మాట్జె అట్లా తనకు భోజనం పెట్టిన వాడిని చంపక వదలటమే కాదు, తర్వాతి కాలంలో అతనికి గొప్ప స్నేహితుడు కూడా అయ్యాడు. అతనే చెంగ్‌కు చెప్పాడు- "నేను వచ్చేదారిలో చూశాను: అనంతమైన చింగ్ సైన్యం ఇటువైపుగానే వస్తున్నది. వాళ్లంతా క్రూరులు, మెండివాళ్లు. తప్పక ఈ ఊరినంతా నేలమట్టం చేసుకుంటూ పోతారు. అందుకని నువ్వు, నీ కుటుంబం మొత్తం వెంటనే బయలుదేరి 'సు-చౌ' కి చేరుకోండి. అక్కడైతే అంతా భద్రంగా ఉండచ్చు" అని. చెంగ్‌పాయ్‌లిన్ అతను చెప్పినట్లే చేశాడు. ఎవరికీ ఏమీ నష్టం కాకుండా అందరూ క్షేమంగా బయట పడ్డారు!
అపకారాన్ని సద్భావనగాను, స్నేహంగాను మార్చుకొనే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. పగతీర్చుకోవటమా, లేక దాన్నే మైత్రిగా మలచుకోవటమా అనేది ఎప్పటికప్పుడు మనమే ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి. విధిరాతని కూడా మార్చే శక్తి మన మనసుకు ఉన్నదనటంలో సందేహం లేదు!