అనగనగా అడవికి దగ్గరగా ఉండే ఓ ఊళ్లో ఒక భార్య-భర్త నివసించే వాళ్ళు. దురదృష్టం, ఎంత కాలానికీ పిల్లలు కలగలేదు వాళ్ళకి!
దాంతో భార్య మానసికంగా కృంగిపోయింది. "ఓ చిట్టి పిల్లవాడిని ఉయ్యాలలో వేసి ఊపి, పెద్ద చేస్తామంటే అసలు మనకి బిడ్డే లేకపోయెనే!" అని తరచూ భర్తతో అంటూ, బాధపడుతూ ఉండేది.
ఒకరోజున భర్త కట్టెలు కొట్టుకు వద్దామని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక చెట్టు మొద్దు కనబడింది. అది చాలా ముచ్చటగా, చక్కగా నున్నగా ఉంది.
అతను దాన్ని నరికి అట్లానే ఇంటికి తీసుకొచ్చి భార్యకు ఇచ్చాడు- "ఇదిగో, ఎంత చక్కగా ఉందో చూడు. దీన్నే ఉయ్యాలలో వెయ్యి! ఇదే బిడ్డడనుకుని, దీన్నే ఊపుతూ జోలపాటలు పాడుకో!" అన్నాడు.
దాన్ని చూడగానే భార్యకు ఎందుకో చెప్పలేనంత సంతోషం వేసింది. ఆమెకది నిజంగానే పిల్లవాడిలాగా అనిపించిందేమో మరి! భర్త చెప్పినట్లే ఆమె ఆ మొద్దుని ఉయ్యాలలో వేసి “ఓ నా చిట్టి పాపా, తెల్లని భుజాల చిట్టి బాబూ, నల్లని కళ్ళ నా నాన్నా, నిదురపోరా నా తండ్రీ నిదురపో, హాయిగా నిదురపో" అంటూ పాడి మురిసిపోయింది.
రెండవరోజు కూడా అలాంటిదే మరో పాట పాడింది ఆమె. అయితే మూడవరోజున పాట పాడుతుంటే ఊయలలో నుంచి చిన్న పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఆమె చాలా ఆశ్చర్యపోయి భర్తను కేకేసింది-
చూస్తే ఉయ్యాలలో నిజంగానే ఓ చిట్టి బాబు! తెల్లటి భుజాలతో, నల్లనల్లని కళ్లతో, ముద్దుగా ఉన్నాడు వాడు!
భార్యాభర్తలిద్దరూ ఆ బాబుని చూసుకుని చాలా సంతోషపడ్డారు. పిల్లవాడికి 'పిలిప్కా' అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు.
పిలిప్కా పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజున వాడు వాళ్ళ నాన్నతో "నాన్నా, నేను చేపలు పట్టేందుకు వెళతాను. నాకు ఒక బంగారు పడవ, ఒక వెండి తెడ్డు తయారు చేసి ఇవ్వవా?” అని అడిగాడు.
"సరేలేరా! అంతకంటేనా!" అని కొడుకు అడిగిన వాటిని సమకూర్చి ఇచ్చి, చెరువులో చేపలు పట్టమని పంపించాడు తండ్రి.
ఇంక చూడాలి! పిలిప్కా రాత్రి-పగలు అదే పనిగా, ఎంతో ఇష్టంగా చేపలు పట్టి ఇవ్వటం మొదలు పెట్టాడు తండ్రికి. అన్నం తినడానికి కూడా తీరిక లేకుండా పనే చేస్తూ పోయాడు వాడు. వాడిని తలచుకొని వాళ్లమ్మకి ప్రాణం కొట్టుకున్నది- బిడ్డకోసం వేడి వేడి అన్నం వండుకుని, చెరువు గట్టుకు వెళ్ళింది.
“ఓ అబ్బాయ్, పిలిప్కా! నా చిన్నిబాబూ! గట్టుకు రా, నాన్నా! ఎంత రుచికరమైన భోజనం తెచ్చానో తెలుసా, తిన్నావంటే ఇంకా ఇంకా కావాలంటావు!" అని పెద్దగా అరిచి చెప్పింది.
అమ్మ గొంతు విని పిలిప్కా గట్టుకు వచ్చాడు. భోజనం చేసి మళ్ళీ చేపల వేటకి వెళ్ళాడు.
చెరువును ఆనుకొని ఉండే అడవిలోనే 'బాబాయాగా' అనే ఊచకాళ్ళ మంత్రగత్తె ఒకతె ఉండేది. తల్లి రావటం, పిలిప్కాని పిలవటం, వాడు బయటికి రావటం, భోజనం తినటం అంతా చూసింది ఆమె. వాడిని చూస్తే ఆమెకి చాలా ఆశ వేసింది. 'వాడి మాసం ఎంత రుచిగా ఉంటుందో' అని ఆమెకు నోరు ఊరిపోయింది.
'ఎట్లా అయినా వాడిని చంపి తినెయ్యాలి' అని ఆ మంత్రగత్తె ఒక సంచిని, ఇనుప చువ్వను తీసుకుని చెరువు గట్టు మీదికి వచ్చింది. తల్లి లాగానే గొంతు మార్చి "ఓ పిలిప్కా, నా చిన్ని బాబూ! భోజనానికి రా, నాన్నా! ఎంత రుచికరమైన తినుబండారాలు తెచ్చానో చూడు!" అని పిలిచింది.
పిలిప్కా పాపం, అనుమానించలేదు. 'తల్లే పిలిచింది' అనుకున్నాడు; ఒడ్డుకు వచ్చాడు. చివరి నిముషంలో ప్రమాదం కనిపెట్టి పడవని వెనక్కి తిప్పుకునే లోపు బాబాయాగా కాస్తా తన ఇనుపచువ్వని పడవ కొక్కేనికి వేసి, ఒడ్డుకి లాక్కున్నది. పిలిప్కాని ఒడిసి పట్టుకుని తన సంచిలో కుక్కింది- “హా! ఇంక నువ్వేం చేపలు పట్టగలవు?! ఎంచక్కా నాకు ఆహారంగా మారగలవు గానీ!" అంటూ సంచిని తన వీపుకు తగిలించుకుని, దట్టమైన ఆ అడవి లోపల ఎక్కడో ఉన్న తన ఇంటికి మోసుకెళ్ళ సాగింది.
బాబాయాగా ఇల్లు చాలా దూరమే. ఇంటికి పోతూ పోతూ ఉంటే- పిలిప్కా చాలా బరువు ఉండే పిల్లవాడు కదా- అందుకని వాడిని మోస్తున్న బాబాయాగాకి చాలా అలుపు వచ్చింది. ఇంకా ఇల్లు చేరుకోకనే, దారి మధ్యలో సంచిని ప్రక్కన పెట్టుకుని, దాని పైన కాలు వేసి, నిద్రలోకి జారుకుంది ఆ మంత్రగత్తె.
'ఏంటి, సంచి కదలట్లేదు?' అని గమనించిన పిలిప్కా మెల్లగా సంచిలోంచి పాకుతూ బయటకు వచ్చాడు. అయినా అలసిపోయిన మంత్రగత్తెకు వాడు బయటికొచ్చిన సంగతి తెలీలేదు. అప్పుడు వాడు సంతోషంగా ఊపిరి పీల్చుకొని, అక్కడే ఉన్న గులకరాళ్ళతో సంచిని నింపేసి, గబగబా చెరువు దగ్గరికి పరుగు పెట్టాడు.
ఆలోగా బాబాయాగా మేలుకున్నది. మెల్లగా సంచిని ఎత్తుకొని ఇంటికి చేరుకున్నది. ఇంట్లో ఉన్న తన కూతురిని పిలిచి, "ఇదిగో, ఈ బెస్తవాడిని మన కొలిమిలో వేసి, చక్కగా వేయించి కూర వండు" అంటూ సంచిని తలక్రిందులుగా చేసి కొలిమి ముందు విదిలించింది.
కానీ పిలిప్కా అందులో లేడు! వాడికి బదులు అక్కడంతా గులకరాళ్ళు వచ్చి పడ్డాయి! దాంతో బాబాయాగాకి పట్టరాని కోపం వచ్చింది. ఆ ప్రదేశం అంతా దద్దరిల్లేట్లు అరిచింది: “హు! వేలెడంత లేవు; నామీదే జిత్తులు ప్రయోగిస్తావా? నీకు సరైన గుణపాఠం నేర్పకపోతే నా పేరు బాబాయాగానే కాదు చూసుకో!" అని అరిచింది, చిందులు వేస్తూ.
మళ్ళీ చెరువు గట్టుకు వెళ్ళింది. ఈసారి కూడా తల్లిలాగే నటిస్తూ పిలిప్కాను పిలవడం మొదలు పెట్టింది: “పిలిప్కా, నా చిన్ని బాబూ! ఒడ్డుకు రా, నాన్నా! నీకు రాత్రి భోజనం తెచ్చాను!" అని పిలిచింది.
“నేను రాను. నువ్వు మా అమ్మవి కావు- మంత్రగత్తె బాబాయాగావి. నీ గొంతు నాకు బాగా తెలుసు. మా అమ్మ గొంతు సన్నగా ఉంటుంది" అన్నాడు పిలిప్కా.
బాబాయాగా ఎంత పిలిచినా పిలిప్కా మటుకు ఒడ్డుకు రాలేదు. ఆమె పిలుపుని లెక్క చేయలేదు. బాబాయాగా ఆలోచించింది- తన నాలుకని, గొంతును సన్నబరుచుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే కమ్మరి దగ్గరకి పరుగెత్తింది:
“కమ్మరీ, కమ్మరీ! నా నాలుకని సన్నగా చెయ్యి- చాలా సన్నగా!" అంది.
అప్పుడా కమ్మరి "సరే సన్నబరుస్తాను. నీ నాలుకని ఈ డాకలి మీద పెట్టు!" అన్నాడు.
బాబాయాగా పొడవాటి నాలుకని డాకలి మీద పెట్టింది. కమ్మరి తన సుత్తి తీసుకుని ఆమె నాలుక సన్నబడేంత వరకూ అణగగొట్టాడు.
తర్వాతి రోజున బాబాయాగా చెరువు గట్టుకు వచ్చింది. ఈసారి సన్నటి గొంతుతో పిలిచింది- "పిలిప్కా! ఒడ్డుకు రా, నాన్నా! భోజనం చేద్దువు గాని!" అంది.
గొంతు సన్నగా ఉండటంతో తల్లే వచ్చిందనుకున్నాడు పిలిప్కా. చూసుకో-కుండానే ఒడ్డుకు వచ్చాడు. వెంటనే బాబాయాగా వాడిని పట్టుకుని సంచిలో కుక్కింది: “ఇప్పుడు ఇంక నువ్వు నన్ను మోసం చేయలేవు! నాకు ఆహారం కాక మానవు!" అని సంతోషంతో కేరింతలు కొడుతూ ఇంటికి నడిచింది.
ఇక ఈసారి ఎక్కడా ఆగకుండా ఇల్లు చేరుకున్నది ఆమె. వెంటనే కూతురుని పిలిచి, "ఇదిగో, అమ్మాయ్! ఆ జిత్తులమారి వాడిని తెచ్చాను. త్వరగా భోజనం సిద్ధం చెయ్! నేను వెళ్ళి ద్రాక్షరసం తీసుకుని వస్తాను" అని బయటకి వెళ్ళిపోయింది. మంత్రగత్తె కూతురు కొలిమిని వెలిగించింది. ఒక పెద్ద కొయ్య పెనాన్ని తెచ్చి, పిలిప్కాతో "ఒరేయ్! ఇదిగో, ఈ పెనం మీద పడుకో; నిన్ను కొలిమిలో పెట్టి వేయిస్తాను!" అంది కరకుగా.
పిలిప్కా లేచి పెనం మీద కూర్చున్నాడు. బాబాయాగా కూతురికి చికాకు వేసింది: 'అలా కాదు!' అని మొరటుగా అరిచింది. పిలిప్కాని పట్టుకొని పెనంమీద నిలువుగా పడుకోబెట్టింది. వెంటనే పిలిప్కా ఈసారి కాళ్ళు రెండూ పైకి పెట్టాడు-
మంత్రగత్తె కూతురికి తిక్కరేగింది. "చూడు, చెబుతున్నాను- అట్లా కాదు, పడుకునేది! ఇట్లా పడుకోవాలి-" అంటూ పెనం మీద కాళ్ళు చాచి పడుకున్నది. మరుక్షణం పిలిప్కా పైకి లేచి, ఆమెతో సహా పెనాన్నంతా మొత్తంగా పట్టుకుని లేపి, కొలిమిలో పడేసి మూతపెట్టేశాడు!
ఆమె పెద్దగా కేకలు వేస్తూ కొలిమి లోంచి బయకి దూకబోయింది. వెంటనే పిలిప్కా గభాల్న అక్కడున్న బరువైన రోలుని ఒకదాన్ని ఎత్తి కొలిమి మూత మీద పెట్టేశాడు. దాంతో ఇక ఆమె కాస్తా బయటకు రాకుండా అయ్యింది.
ఆ వెంటనే ఇంట్లోంచి బయటకి పరుగు పెట్టాడు పిలిప్కా. అయితే సరిగ్గా ఆ సమయానికే అటుగా ఇంటికి వస్తున్నది బాబాయాగా! దాంతో పిలిప్కా గబుక్కున ఓ లావుపాటి చెట్టును ఎక్కి, దాని గుబురు కొమ్మల్లో దాక్కున్నాడు.
బాబాయాగా తటాలున ఇంట్లోకి పోయి ముక్కుతో గాలి పీల్చి, "ఆహా! ఎంత మంచి వాసన!" అని మెచ్చుకున్నది. ఆపైన నేరుగా కొలిమిలోంచే మాంసాన్ని బయటికి తీసి తిని, ఎముకలను బయట పారేస్తూ "పిలిప్కా, నా చిన్ని బాబూ, నీ మాంసాన్ని తృప్తిగా తిన్నాను! నీ రక్తాన్ని కడుపునిండా తాగాను! చూశావా!" అని గంతులేయసాగింది.
చెట్టు మీదున్న పిలిప్కా ఇంక ఆపుకోలేక "ఆఁ, చూశానులే! ఇంక ఇప్పుడు క్రింద పడి పొర్లు! నువ్వు తినింది నీ కూతురు మాంసాన్ని!" అన్నాడు గట్టిగా.
ఆ మాటలు వినగానే బాబాయాగా తల పైకెత్తి పిలిప్కాని చూసింది. ఆమెకు ఎక్కడలేనంత కోపం వచ్చింది. విపరీతమైన కసితో బాబాయాగా నల్లగా మారింది: వికృతంగా అరుస్తూ చెట్టు దగ్గరికి వెళ్ళి, తన పళ్ళతో కాండాన్ని కచకచా కొరికింది.
అయితే అది చాలా దృఢమైన చెట్టు- అందువల్ల కొరికీ కొరికీ మంత్రగత్తె పండ్లు విరిగాయి కానీ చెట్టు మటుకు చెక్కు చెదరలేదు. అప్పుడింక బాబా యాగా దగ్గరలోనే ఉన్న కమ్మరిని పిలిచింది: “కమ్మరీ, కమ్మరీ! త్వర త్వరగా నాకొక ఒక గట్టి ఉక్కు గొడ్డలిని తయారు చేసి ఇవ్వు!" అని అరిచింది.
కమ్మరి భయపడి, గబగబా ఒక గొడ్డలిని తయారు చేసి ఇచ్చాడు. దానితో చెట్టును నరకడం మొదలు పెట్టింది బాబాయాగా.
అయితే పిలిప్కా ఎక్కిన చెట్టు చాలా గట్టిది. దాంతో కాసేపటికే గొడ్డలి పదునంతా పోయింది.
అప్పుడింక బాబా యాగా మూలుక్కుంటూ కమ్మరిని పిలిచి, గొడ్డలికి పదును పెట్టమన్నది. కమ్మరి పదును పెట్టి ఇచ్చాక దాంతో మళ్ళీ చెట్టును నరకటం మొదలు పెట్టింది.
ఆలోగా చెట్టు కొమ్మల్లో ఉన్న పిలిప్కా దిగులు పడటం మొదలు పెట్టాడు. 'పూర్తిగా ఆలస్యం కాకముందే తనను తాను రక్షించుకోవాలి! కానీ ఎలాగ? ఈ మంత్రగత్తె బారినుండి ఎలా తప్పించుకోవాలబ్బా', అని ఆలోచిస్తూ ఆకాశంలోకి చూశాడు పిలిప్కా. అంతలో దూరం నుండి ఓ బాతుల గుంపు ఆటువైపుగా వస్తూ కనిపించింది. వాటిని చూడగానే అతనికి ఓ మంచి ఆలోచన వచ్చింది-
ఆ బాతుల గుంపు తను ఉన్న చెట్టు దగ్గరికి రాగానే "ప్రియమైన ఓ బాతుల్లారా! మీరంతా తలా ఒక ఈకా విదిలించండి- వాటితో రెక్కలు తయారు చేసుకుంటాను- ఆపైన మీతో పాటు ఎగిరి నా తల్లిదండ్రుల దగ్గరకి వెళ్తాను. అక్కడ మీకు గింజలు తీసి ఇచ్చి, అట్లా మీ రుణం తీర్చుకుంటాను!" అన్నాడు. అది విని బాతులు తలా ఒక ఈకా విదిల్చాయి. పిలిప్కా అన్నీ కలుపుకుంటే, వాటితో ఒక పెద్ద రెక్క తయారైంది.
ఆలోగా బాబాయాగాకు ఇంకా చాలా కోపం వచ్చింది. చెట్టును ఇంకా వేగంగా నరకటం మొదలు పెట్టింది. అయితే పిలిప్కాకి
ఇంకా రెండో రెక్క కావాలి! 'ఎలాగ?' అనుకుంటుంటే అటుగా మరో బాతుల గుంపు వచ్చింది.
“ప్రియమైన బాతుల్లారా! మీరంతా తలా ఒక ఈక విదిలించండి- వాటితో ఇంకో రెక్క తయారు చేసుకుని, నా తల్లిదండ్రుల దగ్గరకి వెళతాను. అక్కడకి వెళ్ళాక మీకు గింజలు ఇచ్చి రుణం తీర్చుకుంటాను!" అన్నాడు. అవి కూడా తలా ఒక ఈకను విదిల్చాయి. పిలిప్కా గబగబా ఇంకో రెక్కను తయారు చేసుకుని, ఆ బాతుల గుంపు సహాయంతో ఎగిరిపోయాడు.
అయితే కోపం ఎక్కువైన బాబాయాగా ఇదంతా గమనించలేదు! అటూ ఇటూ చూసుకోకుండా చెట్టు కాండాన్నే నరుకుతూ పోయింది. తను నరుకుతున్న ఆ చెట్టు ఎటు వైపు పడుతోందో కూడా చూసుకోలేదామె- చివరికి అది పోయి బాబాయాగా మీదే ధడాలున పడింది! దెబ్బకు ఆ చెట్టు క్రింద నలిగిపోయి మంత్రగత్తె కాస్తా చచ్చిపోయింది.
అటుపైన మెల్లగా బాతులని పట్టుకుని, ఎగురుకుంటూ ఇంటికి చేరుకున్నాడు పిలిప్కా. ఆ సరికి వాళ్ల అమ్మా నాన్నా ఇద్దరూ భోజనం చేస్తున్నారు. పిలిప్కా రావటం చూసి వాళ్ళు ఎంతగానో సంతోషపడ్డారు.
గబగబా బయటికి వెళ్ళి బాతులన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అన్నిటికీ గింజలు వేశారు.
అవన్నీ కూడా "క్వాక్! క్వాక్!” అంటూ సంతోషంగా గింజలని తినేసి, వీడ్కోలు చెప్పి ఎగిరిపోయాయి.
అటుపైన వాళ్లమ్మ పిలిప్కాకి చక్కని వేడివేడి భోజనం వడ్డిస్తే, అది తింటూ జరిగిన కథంతా చెప్పాడు పిలిప్కా. అది విని వాళ్ల అమ్మా వాళ్ళు ఎంత ఆశ్చర్యపడ్డారో-మీరు అక్కడుంటే తెలిసేది!