అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు ఉండేది. దాని మీద గూడు కట్టుకొని ఓ కాకి నివసిస్తూ ఉండేది. కొంచెం దూరంలోనే మరో చెట్టు మీద ఒక కోయిల నివసించేది.
ఒకసారి ఓ పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలివానకు కోయిల గూడు కాస్తా చెదిరి పోయింది. కోయిల పూర్తిగా తడిసిపోయింది. అయినా గాలివాన ఎంతకీ తగ్గలేదు. కోయిల, పాపం, తట్టుకోలేకపోయింది.
చివరికి అది చలికి వణుక్కుంటూ కాకి దగ్గరికి వెళ్లి, "కాకమ్మా, కాకమ్మా!ఈ ఒక్క రోజూ నన్ను నీ గూటిలో తల దాచుకోనివ్వమ్మా! గాలి వానలో నా గూడంతా కూలిపోయింది!" అంది.
కానీ కాకి అన్నది- "నా గూటిలో పిల్లలు నిద్రపోతున్నారు తల్లీ. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపో, లేదంటే వాళ్ల నిద్ర చెడిపోతుంది. ఎట్లాగూ నేను నిన్ను నాగూట్లోకి రానిచ్చేది లేదు" అని.
"కనీసం ఈ వాన ఆగేంతవరకూ నీ గూటి అంచునైనా తలదాచుకోనివ్వు" అంది కోయిల చలికి వణుకుతూ.
"నీకు ఎన్ని సార్లు చెప్పాలి?! పిల్లలు నిద్రపోతున్నారు. ఇక్కడి నుండి వెళ్లు!" అని దాన్ని తరిమేసింది కాకి.
అంతలోనే గాలివాన ఆగిపోయింది. మెల్లగా మేఘాలన్నీ తొలగిపోయాయి. ఎప్పటిలాగే సూర్యుడు ప్రకాశించాడు. కోయిల మళ్ళీ తన పాత చెట్టు మీదే ఇంకో గూటిని కట్టుకున్నది. గత అనుభవం ఉంది కనుక, ఈసారి మరింత గట్టిగా కట్టుకున్నది ఇంటిని.
కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఇంకొక గాలివాన మొదలయింది. కోయిల ఇల్లు గట్టిగా కట్టుకున్నది కదా, అందుకని అది ఇప్పుడు చక్కగా నిలబడింది. కానీ, ఈసారి కాకి గూడు మటుకు ఘోరంగా చెదిరిపోయింది. ఆ గూటిలో పాపం దాని పిల్లలు కూడా ఉన్నాయి! అందుకని అది పడుతూ లేస్తూ కోయిల ఇంటి దగ్గరకు వెళ్ళి "కోయిలమ్మా, కోయిలమ్మా! దయ తలచి మమ్మల్ని నీ గూటిలోకి రానిస్తావా, పిల్లలు తడిసిపోయి వణుకుతున్నారు. కాస్తంత సేపు, ఈ గాలి, వాన ఆగేదాకా నా పిల్లల్ని నీగూటిలో తలదాచుకోనివ్వవా, నీకు పుణ్యం ఉంటుంది" అన్నది- "నేను ఇంతకు ముందు దాన్ని మా ఇంట్లోకి రానివ్వలేదుగా, ఇప్పుడు అది నన్ను రానివ్వదు- తరిమేస్తుంది" అని మనసులో భయపడుతూనే.
కానీ కోయిల కాకిలాంటిది కాదు. "ఏమీ పరవాలేదు, నువ్వు మళ్లీ గూడు కట్టుకునేంత వరకూ మీరంతా ఇక్కడే ఉండవచ్చు" అని తలుపు తీసి వాటిని లోపలికి రానిచ్చింది.
దాని మంచితనాన్ని చూసి కాకికి సిగ్గు వేసింది. "పోయినసారి గాలివాన వచ్చినప్పుడు నేను నిన్ను నా గూట్లో కనీసం అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఇప్పుడు నువ్వు ఆ సంగతిని మనసులో పెట్టుకోకుండా నన్ను, నా పిల్లల్ని లోపలికి రానిచ్చావు. నీ మంచితనం నా కళ్ళు తెరిపించింది. ఇకమీద ఎవ్వరితోటీ తప్పుగా ప్రవర్తించను. నన్ను క్షమించమ్మా, కోయిలమ్మా" అని కంట తడి పెట్టింది.
"ఏమీ పర్వాలేదులే, తోటి ప్రాణులం, ఒకరికొకరం ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగ? ఇందులో క్షమాపణలేమీ అక్కర్లేదులే" అన్నది కోయిల తేలికగా. అటుపైన కోయిల, కాకి అడవిలోని పక్షులన్నిటికీ సాయం చేస్తూ సుఖంగా ఉండినై.