భారతిమాయమ్మ బంగారు తల్లి
కరుణించరావమ్మ ఓ కల్పవల్లి

మరుమల్లె దండలు 
మాలలె అల్లి 
విరజాజి చేమంతి 
విరులు వెదజల్లి   ।భారతి ।

ప్రేమలూరగ నిన్ను పూజింతుమమ్మా
అమరవీరులగన్న అన్నపూర్ణమ్మ
ప్రమదంబులొలుకగా ప్రార్థింతుమమ్మా
కామితార్థములిచ్చి  కరుణించవమ్మా   ।భారతి।

గంగ సింధునది కావేరి పెన్న
తుంగభద్ర పుణ్యగోదారి కృష్ణ
పొంగిపొర్లెనమ్మ నీ పుడమిలోన
బంగారుపంటలు భాగ్యంబులొలుక  ।భారతి ।

వన్య భూములు ఎన్నో వసుధలో వెలసి
అన్యోన్యమైనట్టి అమరావతీ స్థూప-
పుణ్య క్షేత్రములెన్నొ పునితమైనవిగా, 
ధన్యమాత మమ్ము దయగాంచవమ్మ  ।భారతి ।

అంబ ఓ జగదంబ అమ్మ మాయమ్మ
సంబరముగ నిన్ను స్మరియింతుమమ్మా
కంబుకంఠి మమ్ము కరుణించుమమ్మా
అమ్మ భారతిమమ్ము ఆదుకోవమ్మా  |భారతి ।

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song