"పిల్లలు ఇళ్లలో ఏం చేయాలి?"
అరవకూడదు - చెవులు గింగురుమంటాయి. ఎగరకూడదు - ఇంట్లో బండలు పగిలిపోతాయి. కొట్టుకోకూడదు - దెబ్బలు తగులుతాయి. పరుగులు తీయకూడదు - పడతారు. తినకూడదు - ఎప్పుడూతింటూనే ఉంటే ఎలాగ? ఆడుకోకూడదు - విలువైన వస్తువులు పగిలిపోతాయి. ఏడవకూడదు - పెద్దవాళ్లకు నచ్చదు. గట్టిగా నవ్వకూడదు - అలవాటైపోతే కష్టం.
"మరి పిల్లలు ఇళ్లలో ఏం చేయాలి?"
కదలకుండా కూర్చోవాలి - బండరాళ్లలాగా
ఎప్పుడూ పుస్తకాలు ముందు వేసుకోవాలి - పెద్దవాళ్ళకు అవే ఇష్టం.
నిర్ణయించిన సమయాల్లోనే టివి చూడాలి; చెప్పిన ఛానెళ్లే చూడాలి.
- అలా చేసేవాళ్లు ఎవరూ దొరక్కపోయినా సరే, మనకు మనమే ఆదర్శం కావాలి.
ఇంకా అక్కడే ఉన్నాం అందరం.
వీటన్నిటికీ చాలాభిన్నంగా చెప్పాడు గిజుభాయి బడేకా, 1920 లో:
- కాయితాల్ని కత్తిరించాలి - కత్తెరతో: చాలా మజా వస్తుంది. రకరకాల ఆకారాల్లో చిల్లులు వస్తై!
- అగ్గిపుల్లల్తోటీ, అగ్గిపెట్టెల్తోటీ నిర్మాణాలు: భలే ఇళ్లు కట్టొచ్చు!
- కొయ్య ఇటుకలతో నిర్మాణాలు: రోడ్లు, ఇళ్లు, వంతెనలు, ఇంకెన్ని తయారౌతాయో!
- చిత్రాలు చూడటం, చిత్రాల్ని గీయటం: చిత్ర కళ మనకు వచ్చు!
- మట్టితో ఆటలు: ఎన్నెన్ని బొమ్మలు చేయొచ్చో!
- కాయితం- గుండుసూది: జాగ్రత్తగా ఉండటం నేర్వాలి మరి!
- బట్టలు మడత పెట్టడం: ఇదీ ఒక కళే!
- వంటల ఆటలు- గుడి ఆటలు: ఎన్ని పిండి వంటలైనా చేసి పంచచ్చు, ఇసుకతో ఏమీ ఖర్చవదు.
- మొక్కల్ని పెంచే ఆట: వృక్షశాస్త్రం ఇలాగే మొదలౌతుంది.
- జంతువుల సంరక్షణ: పిల్లులు, కుక్కలు, చేపలు - జాగ్రత్తగా పెంచుకోవాలి!
- నాటకాలు వేయటం: ఎవరం ఎవరిలాగా అయినా అయిపోవచ్చు!
- చిన్న చిన్న పనిముట్లతో పనులు: పార, నెయిల్ కటర్, స్టేప్లర్, పంచింగ్ మిషన్ లు ఏవైనా పనిముట్లే!
- ఆకులు, పూలు, రాళ్లు, పుల్లలు, గవ్వలు: సేకరించుకునేందుకు అన్నీ ఉంటై!
- ఇసుక కుప్పలు, గుజ్జన గూళ్లు: గుహల్నించి దేవాలయాల వరకూ అన్నీ చేయొచ్చు!
ఇవన్నీ కొన్నేనట. ఇంకా చాలాచెయ్యొచ్చట!
మనం ఏమేం చేస్తున్నాం...?
...ఎవరికి వాళ్లం చూసుకోవాలి.
గిజుభాయి లాంటి ఉత్తమ గురువులకు కొత్తపల్లి బృందం వందనాలు.
1980లో కర్నూల్ పబ్లిక్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్ గా పనిచేసిన నర్సన్ గౌడ్ మాస్టారుగారు 2'x3' సైజులో చిత్రించిన గిజుభాయి వర్ణపటపు ప్రతిరూపాన్ని ఈ సంచికలో మీరు చూస్తున్నారు. మాస్టారుగారికి అనేకానేక నమస్కారాలు.
శుభాకాంక్షలతో-
కొత్తపల్లి బృందం.