
అచ్చచ్చర పిల్లవాడు చిచ్చరపిడుగే! అచ్చమైన ఊరిలోన బుజ్జి బాలుడే! ఎండినట్టి తుమ్మకాయ నేరుకొచ్చెనే! ఇరిచి గడ్డి తీగ తోని గజ్జెలల్లెనే! గమ్మతైన తుమ్మ గజ్జె ఘల్లుమన్నదే! ఆట జూస్తె జానపదుల అందమున్నదే! తీగమల్లె పువ్వు లిరిసి పీక జేసెనే! పిప్పీపి పిల్లలారా రండి అన్నడే! తాటి కమ్మ చీరి గాలి గిర్ర చేసెనే! తోటివాళ్ళ కిచ్చి తిరిగి రమ్మనంటడే! గడ్డిపూలు పేనీ గడియారమల్లెనే! గంట చూసి బడికి తాను పోతనంటడే! ఈత కమ్మలల్లి మంచి బొమ్మ చేస్తడే! రాత రాయమంటు సుద్ద చేతికిస్తడే! పుటపుటాల మేరుకొచ్చి కర్ర బొగ్గునే కలిపి కాటికోలె దంచి పలక కంటడే! సక్కనైన రొట్టె పెంక పలక మీదనే సుద్దముక్క తోటి రాత రాస్తనంటడే! చొప్పదండు తెచ్చి చీరి పుల్లలిరిసెనే! చొప్పబెండు కేసికుచ్చి బండి చేసెనే! బంతి పూల చెండ్లు బండి పెయ్యెలంటడే! బండి మీద రండి బడికి పోదమంటడే!