ఒక ఊరిలో బంగారక్క, పిల్లేబిత్తురవాడు ఉండేవారు. వాళ్లిద్దరికీ ఒకరోజున కజ్జికాయలు తినబుద్ధయింది చానా. అప్పుడు బంగారక్క ఏమటుందంటే, ’రోడ్లో పప్పులలారీలు అన్నీ పోతున్నాయి, మనమూ పోయి రోడ్డు పక్కన గుంత తవ్వుకొని పప్పులమూటలు దొంగిలించుకొద్దాం’ అన్నది. ’సరే’ అని ఇద్దరూ ఒక సంచిపట్ట తీసుకొని పోతారు. పోయి, సంచిపట్టను గుంతలో పరిచి ఉంటారు, పోతున్న లారీల్లో పప్పులమూటలు, బెల్లం మూటలు చాలా ఉంటాయి. వాటిల్లోంచి ఒక్కొక్కమూటను గుంతలోకి దొర్లించి వాటిని సంపాదిస్తారు.

అయితే వాళ్లకి నూనె తక్కువ వస్తుంది. అందుకని ఈశప్ప పెట్టె దగ్గరకి, శంకరప్ప పెట్టె దగ్గరకి వెళ్దామనుకుంటారు. ముందుగా పిల్లేబిత్తురవాడు ఈశప పెట్టె దగ్గరకు వెళ్లి, ’ఈశప్పా, ఈశప్పా, కెజి నూనెంత’ అంటే, ’కెజి నూనొచ్చి యాభైరూపాయలంటాడు. పిల్లేబిత్తురవాడు ’అరే, అదిగో చూడువాళ్లంతా ఏం భజన చేసుకుటూ వస్తున్నారో త్రాగినవాళ్లమాదిరి.’ అని ఒక వైపుకు చూపించగానే, ఆయప్ప అటువైపుకు చూస్తాడు. ఆంతలోనే పిల్లేబిత్తురవాడు తన టోపీని నూనెడబ్బాలోకి ముంచి తీసి ’ఉండు, ఇప్పుడే యాభై రూపాయలు తెస్తాను’ అని వెళ్లిపోతాడు. ఇంటికెళ్లి టోపీలో నూనెను డబ్బాలోకి పిండితే, అయినా ఇంకొంచెం తక్కువపడుతుంది. ’ఎట్లా, తక్కువ వచ్చింది, మళ్ళీ పోయి రావాలి ఈసారి శంకరప్ప పెట్టె దగ్గరకి’ అని శంకరప్ప పెట్టె తావుకు పోతాడు. ’శంకరప్పా శంకరప్పా కెజినూనెంత?’ అంటే యాభై రూపాయలు అంటాడు. ’అదిగో వాళ్లు చూడు, తాగినారు, అట్లే ఊగుకుంటూ వస్తున్నారు మళ్లీ’ అని ఒక వైపుకు చూపించగానే, ఆయప్ప అటుదిక్కుకు చూస్తాడు. ఆయప్ప అటువైపుకు మళ్లేలోపలే ఈయప్ప టోపీని నూనెలో అద్ది, మళ్లో టోపీ పెట్టుకొని ’ఉండు, ఇప్పుడే తెస్తాను మళ్ళీ యాభై రూపాయలు’ అని ఇంటికి పోతాడు. ఇంటికి పోతూనే ఆ టోపీని కూడా పిండితే మొత్తం రెండు కెజిల నూనె అవుతుంది.

మళ్లీ ఇక కట్టెలు తక్కువ వస్తాయి వాళ్లకి. పిల్లేబిత్తురవాడు పోయి బంగారక్కను అడుగుతాడు- ’బంగారక్కా బంగారక్కా మనకి కట్టెలు ఎట్లా?’ అని. బంగారక్క అంటుంది ’దయ్యంతోటలో కట్టెలుంటాయి, ఇప్పుడే పోయి ఏరుకొద్దాం’ అని. ’సరే’ అని ఇద్దరూ అట్లే పోతారు. దయ్యం తోటలోకి పోయి కట్టెలు కొడుతుంటారు. అంతలో దయ్యం వచ్చి ’ఎవరు నాతోటలో కట్టెలు కొడుతున్నారు’ అంటుంది. అప్పుడు వీళ్లంటారు, ’ఇదిగో, మా తోటలో కుడాలు, కజ్జికాయలు, ఓళిగలు అన్నీ చేసినాము, నువ్వూ రా, రాత్రికి, తిందువు’ అని. దయ్యం అనుకుంటుంది ’అయ్ఁ, నాకు ఈరోజున తిండి దొరుకుతున్నది’ అని సంతోషపడుతుంది. వీళ్లకు బండ్లు బండ్ల కట్టెలు ఎత్తిస్తుంది. వీళ్లేమో, ఇంటికి పోయి కజ్జికాయలు అన్నీ చేసుకొని తింటారు. చివరికి ఒక్క కజ్జికాయమాత్రం మిగులుతుంది. ’అరేఁ, ఇది దయ్యానికి ఎట్లా అవుతుంది? మనం ఇద్దరం చెరిసమానంగా తుంచుకొని తింటే బాగుంటుంది గదా, అని ఇద్దరూ కలిసి దాన్నికూడా తినేసి సొరకాయలో దాక్కుంటారు. అప్పుడు దయ్యం వచ్చి, ’ఎవరు నన్ను తినేకి పిలిచిండేది’ అంటుంది. కానీ ఇద్దరూ పలకరు. అప్పుడు అది వచ్చి, పెనంలో ఉండే నూనెను అంతా తాగేసి, సొరకాయను జేబులో పెట్టుకుని ఇంటికి నడిచి పోతుంటుంది.

దారిలో పిల్లేబిత్తురవానికి పిత్తు వస్తుంది. ’బంగారక్కా బంగారక్కా, పిత్తు వస్తోంది, ఏంచేయాలి?’ అంటాడు. ’దయ్యానికి తెలుస్తుంది, చిన్నగా పిత్తు’ అంటుంది బంగారక్క. కానీ పిల్లేబిత్తురవాడు పెద్దగా పిత్తుతాడు. అప్పుడు ఆ శబ్దం విని దయ్యం భయపడిపోతుంది. ’నన్ను చంపేకి ఎవరో బాంబు పెట్టినట్లుంది దాంట్లో’ అని సొరకాయను అది అక్కడేపడేసి పారిపోతుంది.