కొత్తపల్లి జులై సంచికకు మీకందరికీ స్వాగతం.

బడులు తెరిచిన హడావిడిలోపడి గత మాసపు సంచికను తేలేక- పోయినందుకు క్షంతవ్యులం. అయితే ఈ సంచికనుండి కొత్తపల్లికి కొన్ని మెరుగులు దిద్దాం. ఈ మార్పుల్ని మీరు గమనిస్తారనీ, అవి మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాం.

ఈ సంచికలోని రచనల వివరాలు కొన్నింటిని చిత్తగించండి.

ఎంతవారికైనా మనసుని నిగ్రహించుకోవటం అనేది చాలా కష్టమైన విషయం. మన మనసే కోతిలాంటిది. మరి, కోతుల మనసులైతే మరీ కోతులు! అలాంటి కోతులు, ఓ యోగి మాటలు విని, శివరాత్రినాడు ఉపవాసం చేద్దామనుకున్నై. అప్పుడు ఏమైందో "కోతుల ఉపవాసం" కథలో చదవండి.

’డిడ్యుడూయిట్’ అని అరుస్తుందట, రెడ్ వాటిల్డ్ ల్యాపింగ్ అనే పక్షి, ఇంగ్లీషులో. మరి అదే పక్షి, తెలుగులోకి వచ్చేసరికి, "కూ.. తురక్కి" అంటుందని చెబుతారు. కూ.. తురక్కికి, డిడ్యుడూయిట్ కీ సంబంధం వేరే ఎవరైనా రాస్తే తెలుసుకుందాం, కానీ ప్రస్తుతానికి ఆ పిట్ట ’కూ..తురక్కి’ అని ఎందుకు అరుస్తోందో తెలుసుకోండి, అదే పేరుగల కథ చదివి.

మనలో భయం ఎంతపని చేస్తుందో గంగమ్మక్క రాసిన ’భయం భయం’ లో చూడచ్చు. భయాలకి అసలు అర్థం ఉండదు; కేవలం భయంగా ఉంటుంది అంతే. కానీ నిజం తెలుసుకుంటే మాత్రం భయానికి బదులు నవ్వు వస్తుంది. చదివి చూడండి.

ఏదైనా తప్పు పని చేస్తే అంతరాత్మ ఘోషిస్తుంది. " తప్పు చేశావ్, తప్పు చేశావ్" అంటుంది. దానితో మన జీవితం నరకప్రాయమౌతుంది. తప్పు చేయకుండా ఉంటే ఈ నరకం తప్పుతుంది గదా? దీన్ని గురించి మనకు "రాజు మంగలి" కధ బాగా చెబుతుంది. చదవండి.

’పంది-నక్క-ఏనుగు’ కథ తెలుసా? ఈసారి అవి మంచి బుద్ధులు నేర్పేందుకు మీ ముందుకు వస్తున్నాయి. అవి ఏమనేదీ ’దుర్బుద్ధి’ కథలో రామాంజన్న చెబుతున్నారు, చూడండి.

తెలివిలేని వాళ్లతో పనిచేయటం చాలా కష్టం. కొన్నిసార్లు అది ప్రమాదకరం కూడా. అయితే పరమానందయ్యగారి శిష్యుల్నించి మొదలుకొని బారిస్టరు పార్వతీశం వరకు అనేక వందలమంది తెలుగు సాహిత్యంలో నవ్వుల రాజులై, హాస్యపు పంటలు పండిస్తూనే వచ్చారు. తాజాగా ఇదేవరసలో నిలిచే ఖద, "నలుగురు మూర్ఖులు" ను 5వ తరగతి స్టీఫెన్ పండించాడు మీకోసం. ఆస్వాదించండి.

పిల్లల జానపదంలో కొన్ని అర్థంలేని కథలుంటాయి. వీటికి నిజంగా వెతికితే అర్థం ఏమీ ఉండదు. కానీ వీటిని తలుచుకున్నప్పుడల్లా పిల్లలు నవ్వుతూనే ఉంటారు. పిల్లే బిత్తురవాడు, బంగారక్కలు జానపదుల తోలుబొమ్మలాటలో పేరుగాంచిన హాస్యపాత్రలు. అనంతపురం జిల్లాలో తోలుబొమ్మలాట జరిగిందంటే ఈ సారధులు ఉండవలసిందే. వీళ్లిద్దరూ కలిసి చేయలేని పనీ లేదు, పండించలేని హాస్యమూ లేదు. కనక వీళ్ల గోలను మీరూ చదవండి, ఆలోచించి ఈకలు పీకకండి, ఊరికే నవ్వేసి ఊరుకోండి.

ఒక ప్రాణికి మహాద్భుతంగా తోచిన సంఘటనే మరొక ప్రాణిని ఆలోచించేలా చేయవచ్చు. ’పరుగో పరుగు’ కథ ఇలాంటిదే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారు ముద్రించిన మూడవ తరగతి తెలుగు వాచకంలో ఉన్న ఈ అద్భుత కథనం పుకార్ల మహత్తును కూడా వివరిస్తుంది. చదివి చూడండి. ఆకాశం విరిగి పడిందో లేదో చెప్పండి.

అనంతపురం జిల్లా పిల్లల భాషలో ’కుంటికోతి’కి వ్యతిరేకపదం ’మంచికోతి’. మంచికోతి అంటే మంచి-కోతి అని కాదట! రెండు కాళ్ళూ మంచిగా ఉన్న కోతన్నమాట! వీటి కథను "కుంటికోతి" కథలో చదవండి. మన గ్రామీణ సమాజం వికలాంగత్వాన్ని ఎలా చూసిందో తెలుసుకొని, మీరూ ఒకింత ఆలోచించండి.

ఇవి కాక ఈ సంచికలో మీకోసం తొమ్మిది పాటలు ఇస్తున్నాం. ఎప్పటిమాదిరే ఈ పాటల్ని మీరు చదవచ్చు, బొమ్మల్ని చూడచ్చు, వినచ్చు. ఈసారి ఈ పాటల్లో వైవిధ్యతను గతంలో కంటే మరింత పెంచేందుకు ప్రయత్నించాం. ఎలా ఉన్నాయో మీరే చెప్పండి. పోతే ఈమాసం జోకులు దొరికాయిగానీ వాటికి బొమ్మలు రాలేదు. వచ్చే సంచికలో డబల్ జోకులు వెలువరించే ప్రయత్నం చేస్తాం.

మీరు రాసిన కథలు, వేసిన బొమ్మలు, పాడిన పాటలు ఇతరులతో పంచుకోవాలనిపిస్తే మాకు పంపండి, మీ ఫొటో ఉంటే జత చేయండి. తదుపరి సంచికల్లో వాటికి స్థానం కల్పించేందుకు ప్రయత్నిస్తాం.

ఉంటాం మీ- కొత్తపల్లి బృందం.