ఒక ఊరిలో ఇద్దరు వ్యాపారస్తులుండేవారు. వాళ్ళు ప్రతిరోజు ఆ పల్లె నుంచి పట్టణానికిపోయి అక్కడ వ్యాపారం చేసుకొని సాయంకాలానికి తిరిగి పల్లెకు వచ్చేవారు. రోజూ మాదిరిగానే ఒక రోజు పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసుకున్నారు. వ్యాపారం అయిపోయేసరికి చాలా చీకటి పడింది. ’ఇంక ఇక్కడ ఉండటానికి వీలు కాదు మనం ఊరికి పోవాలంటే ఎట్లా’ అని ఆలోచించారు. ’సరే ఏదైతే అదవుతుంది; ఇద్దరం మాట్లాడుకుంటూ పోతే ఊరికి చేరుకుంటాము’ అని అనుకొని చిన్నగా నడక సాగించారు.

కొంత దూరం వచ్చాక వాళ్లకు ఒక నీళ్ళ బావి కనిపించింది. వాళ్ళు బావిలోకి దిగి నీళ్ళు తాగి, అక్కడ కొంతసేపు కూర్చొని, మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. నడక సాగిస్తూ వాళ్ళు, వాళ్ళ ఊరి దారిలో ఉన్న చింతతోపు గురించి మాట్లాడుకున్నారు: "చింతతోపు దగ్గర చాలా దయ్యాలున్నాయి. రాత్రిళ్ళు అక్కడ నడవడం చాలా ప్రమాదకరం. కష్టం. అసలు ఆ దారిలో రావడమే మహాగగనం" అని చెప్పుకుంటూ నడుస్తున్నారు.

వాళ్ళు దగ్గర దగ్గరగా చింతతోపు దగ్గరకు వచ్చేశారు ఇప్పుడు. ఇద్దరికీ మనసుల్లో భయం మొదలైంది. "ఇక్కడ దయ్యాలుంటాయి.. ఎట్లబ్బా, దీన్ని దాటడం" అనే ఆలోచిస్తున్నారు. "సరే, నాకు నువ్వు, నీకు నేను! ఇద్దరం తోడుగా ఉన్నాం కదా, ఎలాగో ఇంతదూరం వచ్చినాం కదా, వెనక్కి పోవడం కష్టమే. ముందుకు పోదాం" అనుకుంటున్నారు. ఒకరి నడుమును ఒకరు పట్టుకొని, దగ్గరగా వచ్చి భయపడుతూ భయపడుతూ నడుస్తున్నారు.

అంతలో వాళ్ళకు గజ్జెల శబ్దం వినిబడసాగింది! ఇద్దరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. ఒకడు ఇంకో ఆయనతో "అరే, నాకు గజ్జెల శబ్దంవిన్పిస్తున్నది, నీకూ వినిపిస్తోందా" అని అడిగాడు. "నాకు కూడా వినిపిస్తున్నది" అన్నాడు రెండవవాడు. "అయితే దయ్యాలు మనకు దగ్గరగా వచ్చేసినట్టున్నాయి" అని ఇద్దరూ తొందరగా నడవటం మొదలు పెట్టారు. గజ్జెల శబ్దం ఇంకా ఎక్కువగా వినిపించసాగింది. "అరే, దయ్యాలు ఇంకా దగ్గరికి వచ్చినాయి" అని నడక వేగాన్ని ఇంకా పెంచినారు. గజ్జెల శబ్దం ఇంకా చాలా చాలా ఎక్కువైంది. "అయ్యో! ఇక దయ్యాలు మన గొంతులు పట్టుకొవడమే తరువాయి" అని వాళ్లిద్దరూ పరుగు మొదలు పెట్టారు. ఇంకా ఎక్కువ శబ్దం, మరింత దగ్గరగా వినవస్తున్నది. "అమ్మో! మనం ఈ రోజు ప్రాణాలతో బయటపడటం కష్టం. ఏం చేయాలబ్బా" అని శతకోటి దేవుళ్ళని ప్రార్థించటం మొదలుపెట్టారు వాళ్ళు. అంతలో వాళ్ళకు వారి పల్లె కనిపించింది. కాలి బిర్రున పరుగెత్తుకొని వచ్చి తమ పల్లెను చేరుకొని "అమ్మయ్య, ఊర్లోకి వచ్చేశాము, ఇక భయం లేదు" అని అనుకుంటూ ఆయాసంతో రోడ్డు పక్కనే కూర్చుండిపోయారు ఇద్దరూ. ఆయాసం తీర్చుకొని, నీళ్ళుతాగారు; మళ్ళీ బయలుదేరుదామని లేచారు. ఇప్పుడు మనసులు కొంచెం తేరుకున్నాయి. గజ్జెల శబ్దం రావటం లేదు. "అమ్మయ్య! గజ్జెల శబ్దం ఆగిపోయింది. మనం త్వరపడి ఊర్లోకి రాగానే, దయ్యాలు భయపడి వెనక్కి వెళ్ళాయి. అందుకే శబ్దం రావటం లేదు" అనుకున్నారు ఇద్దరూ సంతోషంగా.

ఇంటికి పోగానే వాళ్ళల్లో ఒకాయన "బీగాలు(తాళం చెవులు) తీయాలి కదా" అనుకొని బీగాలను తడుముకొని, బీగాల గుత్తిని చేతికి తీసుకున్నాడు. "గల్లు గల్లు"మని శబ్దం అయింది. ఇద్దరూ ఒకళ్ల ముఖాలు ఒకళ్లు చూసుకున్నారు. ఇద్దరికీ ఒకేసారి అర్థం అయ్యింది- "ఇంత సేపూ తాము గజ్జెలమోత అనుకున్నది ఆ తాళాల గుత్తి శబ్దాన్నే అని! మరునాడు ఉదయం ఈ విషయం అందరికి చెప్తే, అందరూ పొట్ట చెక్కలయేలాగా నవ్వుకున్నారు!