ఒక ఊరిలో ఒక యజమాని ఉండేవాడు ఆయనకు మూర్ఖులుగా వున్నవాళ్ళని పనిలో పెట్టుకోవాలంటే ఇష్టము . ఆయన ఒకరోజు దారిలో పోతుండగా నలుగురు మూర్ఖులు కనపడినారు. ఆయనచాలా సంతోషముగా వద్దకు వెళ్ళి "మీరు మా ఇంటిలో పనివాళ్ళుగా ఉంటారా" అని అడిగాడు. ఆమూర్ఖులు "సరే" అన్నారు. యజమాని "మీరు రేపు పొద్దున మా ఇంటికి రండి" అని చెప్పాడు. అలాగే వారు వచ్చారు
యజమాని ఒక మూర్ఖుడిని అడవిలో మేకలను మేతకు తీసుకోని పొమ్మన్నాడు. రెండవ వానిని అడవిలో కట్టెలు కొట్టుకొని రమ్మన్నాడు. మూడవ వానిని ప్రక్క ఊరికి వెళ్ల్ నెయ్యి తెమ్మన్నాడు. నాలుగవ వానిని ఇంటిలోనే ఉండి తన తల్లి సంరక్షణ చూసుకొమ్మని చెప్పాడు.
ఒక మూర్ఖుడిని మేకలు మేపడానికి పొమ్మన్నాడు కదూ? అతడు బావి దగ్గర కూర్చొని ఎదో తింటున్నాడు. ఆ బావిలోని కప్పలు బెక, బెక, బెక, బెక అంటున్నాయి. ఈ మూర్ఖుడు ఏమి అనుకున్నాడంటే; ఈ కప్పలకు కూడా చాలా ఆకలి వేస్తోంది అని. అలా అనుకొని వాడు ఒక మేకను బావిలోకి వేశాడు. ఆ కప్పలు ఇంకా అరుస్తూనే ఉన్నాయి. వాడు ఒకదాని తరువాత ఒకటిగా అన్ని మేకల్నీ బావిలోకి వేసి ఉత్త చేతులతో ఇంటికి వచ్చాడు.
ఇంకొక మూర్ఖుడిని కట్టెలు కొట్టుకొని రమ్మన్నాడు కదూ! ఆ మూర్ఖుడు కట్టెలు కొట్టుకొని బండిలో వేసుకొని వస్తున్నాడు. ఎత్తులో వెళ్తున్నాడు. బండి చక్రాలు ’పర్ పర్’ అంటున్నాయి. ఆ మూర్ఖుడు ఏమనుకున్నాడంటే "పాపం చక్రాలు బరువు మోయలేక పోరున్నాయి’ అని. అలా అనుకొని వాడు కొన్ని కట్టెలు దింపేశాడు. అయినా అట్లే శబ్దం వస్తున్నది. అలా ఒక్కటొక్కటిగా కట్టెలన్నింటినీ తీసివేసి ఖాళీ బండిని ఇంటికి తీసుక వచ్చాడు వాడు..
ఇంకొక మూర్ఖుడిని పక్కనున్న ఊరికిపోయి నెయ్యి తీసుకొని రమ్మని చెప్పాడు కదూ? వాడు మొదట నెయ్యి డబ్బా తీసుకొని బయలుదేరినప్పుడు అది బరువని అనిపించలేదు. తేలికగానే ఉండింది. అయితే కొంతదూరం వచ్చాక డబ్బా చాలా బరువు అనిపించింది. ఇంకొంత దూరము నడిచాక వాడు ఏమనుకున్నాడంటే, "ఈ డబ్బాలో దయ్యం వుంది, లేకపోతే ఎందుకు బరువెక్కుతుంది?’ అనుకొన్నాడు. డబ్బాను దించి చూశాడు అందులో అతని ప్రతిబింబము కనిపించింది. అది దయ్యమే అనుకున్నాడు వాడు. పక్కనే ఒక బావి కనబడింది. ఆబావిలో వాడు నెయ్యి డబ్బాను పారవేశాడు. "అమ్మయ్య! దయ్యం పీడ వదిలింది" అనుకున్నాడు.
నాలుగోవాడిని తన రోగిష్టి అమ్మ సంరక్షణని చూసుకొమ్మన్నాడుకదూ? ఆ మూర్ఖుడు యజమాని గారి అమ్మ ప్రక్కన కూర్చున్నాడు. అంతలో ఒక ఈగ అమె మూతిపై వాలింది. ఆమూర్ఖుడు చూసి "మా అమ్మగారిమీద వాలుతావా, నీకెంత ధైర్యం, మా అమ్మగారి మీద వాలద్దు" అన్నాడు. ఆ ఈగేమో, పక్కకు పోయినట్టేపోయి మళ్లా వచ్చి వాలింది. పట్టరాని కోపం వచ్చిన ఆ మూర్ఖుడు రోకలి తీసుకొనివచ్చి, చూపించి, "చూడు ఈసారి మా అమ్మగారి మీద వాలావంటే దీనితో కొడతానన్నాడు. దానికేం తెలుసు, అది మళ్లా వచ్చి వాలింది. దాంతో విసుగెత్తిన ఆమూర్ఖుడు రోకలి బండ తీసుకొని ఆమె ముక్కుమీద ఒక్కదెబ్బ కొట్టాడు. ఆదెబ్బకు ముసలామె చచ్చి హరీమన్నది. ఈగ మాత్రం చనిపోలేదు. యజమాని ఇంటికి వచ్చిచూస్తే ’కట్టెలు పోయే, మేకలు పోయే, నెయ్యి పోయే, అమ్మా పోయే’ అన్నట్లయ్యింది. ’ఈమూర్ఖులను పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి శాస్తి జరిగింది’ అని చెంపలు వాయించుకున్నాడు యజమాని.