చాలా సంవత్సరాల క్రిందట ఒక ఊళ్ళో ఒక అమ్మ ఉండేది. ఆ అమ్మకు అక్కి అనే కూతురు ఉండేది. ఆ కూతుర్ని వాళ్లమ్మ అడవికి పంపించి, ’అడవిలో పెద్ద ఇప్ప మాను క్రింద రాలిన ఇప్పపూలన్నీ ఏరుకుని రా’ అని చెప్పింది. ’సరే’ అని అక్కి అన్ని పూలనూ ఏరుకొని వచ్చింది.
తరువాతి రోజున తల్లి అన్నది "నిన్నటి పూలన్నీ నేను ఎండబెట్టాను, నువ్వు వీటికి జాగ్రత్తగా కాపలా కాయి, ఇవాళ్ల నేను అడవికి వెళ్లి ఇంకా పూలు తెస్తాను’ అని. అక్కి అన్ని పూలనూ ఎండనిచ్చి, సాయంత్రం కాగానే ఎత్తి పెట్టింది. ఇలా మూడు నాలుగు రోజులు పూలన్నీ బాగా ఎండాయి. ఎండిన కొద్దీ పూలు దగ్గరయ్యాయి. గంపెడు పూలు ఎండబెడితే, ఎండిన తరువాత అవి సగం గంపెడే అవుతున్నాయి.
అయితే అయిదవ రోజున అమ్మ అక్కిమీద కోపం చేసుకున్నది: ’కాదు, నేను ఇన్ని పూలు తీసుకొచ్చాను, ఎక్కడికి పోయినై, ఈ పూలన్నీ? నువ్వేం చేస్తున్నావు? వీటిని తినేశావా? అసలు నేను సంచులు సంచులు పూలు తీసుకొస్తున్నాను ప్రతిరోజూ, కానీ నువ్వు చూస్తే మొత్తం దానిలో సగాన్నికూడా మిగల్చలేదు’ అని తిట్టింది. ఆ మాటలకు బాధ పడిన అక్కి అలిగి మారు మాట్లాడకుండా ఎక్కడికో వెళ్లిపోయింది.
తరువాతిరోజున అక్కివాళ్ల అమ్మే పూలన్నీ తెచ్చి ఎండబెట్టింది. ఎండిన తరువాత చూస్తే పూలన్నీ తక్కువైపోయాయి. ’ఏమిటిది? ఎందుకిలా తక్కువైపోయాయి? అనుకుంది. దాంతోపాటు ’అయ్యో, నాకూతురిమీద నేను ఊరికే అనవసరంగా కోప్పపడ్డానే, ఎండిపోయిన తరువాత పూలు తక్కువైపోతాయనికూడా నాకు తెలీలేదే" అని బాధ పడింది.
ఆ తల్లే తరువాత పక్షిగామారి, అడవిలో అంతటా ఎగురుతూ, తన కూతురు అక్కిని వెతుక్కుంటూ, ’కూతురక్కీ, కూతురక్కీ’ అని పిలుస్తూ తిరుగుతున్నది.