నా పేరు నకుల్. నేను ఆరవతరగతి చదువుతున్నాను. మాది బోర్డింగ్ స్కూల్. మా హాస్టలు రూమ్‌లో నాతో పాటు ఎనిమిది మంది ఉంటారు. మేడ మీద పెద్ద గది అది. ఆ గదికి మూడు వైపులా మూడు మూడు మంచాలు ఉంటాయి. పడమర వైపు వాకిలి, వా‎కిలికి ఒక ప్రక్కగా సామాన్లు ఉంచుకునే ఇంకో గది ఉంటుంది. ఎదురుగ్గా స్నానాల గదులు, టాయిలెట్స్ ఉంటాయి.

ఒక రోజు నేను స్కూలు నుండి వచ్చేప్పటికి నా మంచం మీద ఒక డ్రాయర్ పడేసి ఉంది. 'ఇది సూర్య డ్రాయర్ కదా!' అనుకుని నా మంచం ఎదురుగా ఉన్న సూర్య మంచం మీద దాన్ని పడేసి, స్నానానికి వెళ్ళాను. స్నానం నుండి వచ్చేప్పటికి అది మళ్ళీ నా దిండు ప్రక్కగా పెట్టి ఉంది.

"అరే! సూర్యా! సూర్యా!" అని పిల్చా. సంజయ్ బయటనుండి వస్తూ "వాడింకా స్కూలు లోనే ఉన్నాడురా! అన్నాడు. "ఈ డ్రాయర్ని నువ్వేనా, నా మంచం మీద పెట్టింది?" అడిగాను.

"ఊహు! నేను పెట్టలా" అన్నాడు వాడు టాయిలెట్ లోకి పరిగెడుతూ.

"మరి, ఇది నా మంచం మీదకు ఎలా వచ్చిందబ్బా? నేను ఇప్పుడే దీన్ని సూర్య మంచం మీద పెట్టాను కదా?!" అనుకుంటూ దాన్ని తీసి స్నానాల గదుల ముందు బట్టలు ఆరేయడానికి కట్టిన కమ్మీ మీద వేశాను.

మర్నాడు ఉదయం నిద్రలేచి చూసేటప్పటికి మళ్ళీ అది నా మంచం మీద- కాళ్ళ చాపున- కనిపించింది.

కోపంగా లేచి, అందరినీ వరసగా నిద్రలేపి అడిగాను "ఇది ఎవరిదిరా? ఎవరు, దీన్ని నా మంచం మీద వేస్తున్నారు?" అని.

నిద్రమత్తులో ఉన్నారు అందరూ. నిర్లక్ష్యంగా "మాకేం తెలుసురా!" అని ఒకడూ, "నేను వేయలేదురా!" అని ఒకడూ, "చూడలేదురా!" అని ఒకడూ, "తెలియదు" అని ఒకడూ చెప్పారు.

"అయితే మరి ఇది ఎవరిదిరా?" అని అడిగాను. అందరూ 'మాదికాదంటే మాదికాదు ' అన్నారు.

దాన్ని తీసుకెళ్ళి సామాన్లు ఉంచుకునే గదిలోకి కోపంగా విసిరేశాను. మధ్యాహ్నం డైనింగ్ హాల్‌లో భోజనం చేసి గదిలోకి రాగానే అది మంచం మీద ఉందేమోనని చూశాను, లేదు.

సామాన్ల గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడా లేదు!

'మరేమయి ఉంటుంది? క్రింద గదుల్లో వాళ్లదేమో! తీసుకున్నారేమోలే!' అనుకుని కాసేపు విశ్రాంతి తీసుకుని స్కూలుకి వెళ్ళాను.

సాయంత్రం స్కూలు నుండి వచ్చి స్నానం చేసి బట్టల కోసం నా అలమర తెరిచాను. బట్టల మీద చక్కగా మడత పెట్టి ఉన్న ఆ డ్రాయర్ ని చూడగానే నా కళ్ళు పెద్దవయ్యాయి.

బాగా కోపం వచ్చింది. నా స్నేహితుల వైపు చూస్తూ "ఎవరు పెడుతున్నారురా దీన్ని, నా మంచం మీద, నా అలమరాలో?! ఇది నాది కాదు!"అని అరిచాను కోపంగా. నా కోపాన్ని చూసి అందరూ తెల్లబోయారు. అందరూ ఒట్టేసి చెప్పారు "మేం కాదంటే మేంకాద"ని.

"మరి ఎవరు వేస్తున్నారురా, వీడి మంచం మీద?!" అన్నాడు సూర్య.

"దీన్లో దయ్యం ఏమైనా ఉందేమోరా" అన్నాడు రాజుగాడు. వాడెప్పుడూ దయ్యం కథల పుస్తకాలు చదువుతుంటాడు. వాడు అట్లా అనగానే మాకందరికీ నిజంగానే భయమేసింది. డ్రాయర్ని కర్రతో తీసి, మేడ మీద నుండి క్రిందకు విసిరి వేశాము.

ఆ రాత్రి అందరం భయంగా ఉందంటూ మంచాలన్నీ దగ్గరకు చేర్చుకుని పడుకున్నాము.

తెల్లవారి లేచి చూసేటప్పటికి మళ్ళీ అది నా మంచం మీద పడి ఉంది! భయంతో పెద్దగా కేక వేశాను.

అందరూ కూడా దాన్ని చూసి అరుస్తూ క్రింద హాస్టల్‌కి ప్రక్కనే ఉండే వార్డెన్ ఇంట్లోకి పరిగెత్తారు. జరిగిందంతా వార్డెన్‌కి చెప్పాము అందరమూ.

ఈ హడావుడికి క్రింద గదిలో ఉండే తొమ్మిది మంది కూడా వార్డెన్ ఇంట్లోకి వచ్చారు.

మా వార్డెన్ వాళ్ళల్లో ఒకడిని పంపి క్రిందినుండి డ్రాయర్ తెప్పించింది.

మా గదిలో ఉండే తొమ్మిది మందిమీ దాని వైపు భయంగా చూడసాగాము.

"ఎవరిది ఇది?" అని అడగ్గానే, క్రింద గదిలో ఉండే నిర్మాణ్ ముందుకొచ్చాడు- "ఇది నాదే మేడం! దీని కోసం రెండు రోజులుగా వెతుకుతున్నాను!" అన్నాడు తాపీగా.

"మరి దీన్ని నకుల్ మంచం మీద ఎవరు పెడుతున్నారు?" అంది ఆమె.

"తెలియదు - మేం పెట్టలేదు " అని అరిచారు అందరూ గోలగోలగా.

"రమా! రమా!" అంటూ మా స్వీపర్ ని పిలిచింది వార్డెన్.

చీరను పైకి దోపుకుని, చేత్తో చీపురుతో వార్డెన్ గదికి వచ్చింది, మా స్వీపర్ రమాదేవి.

వార్డెన్ చేతిలో ఉన్న డ్రాయరుని చూసి ఆమె "చూడమ్మా! ఈ నకుల్ బాబు - దీన్ని ఎక్కడంటే అక్కడ పడేస్తున్నాడు! నేను భద్రంగా పెట్టనూ-ఆ బాబు పారేయనూ! మీకు చెబ్దామనుకుంటూనే మర్చిపోతున్నా పనిలో పడి !" అంది తిప్పుకుంటూ.

వార్డెన్‌తో సహా అందరూ నా వైపు చూసి నవ్వసాగారు.

నవ్వు ఆపుకుంటూ "ఇది నకుల్ దని ఎందుకనుకున్నావు, రమక్కా?" అంది వార్డెన్ మా స్వీపర్ వైపు చూస్తూ.

ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాని రమక్క "వస్తువులన్నీ నిర్లక్ష్యంగా పారేసుకునేది ఈ బాబేగా అమ్మా!" అంది.

నవ్వటం ఆపేసి సూటిగా నా కళ్ళల్లోకి చూసింది వార్డెన్- 'ఇంకెప్పుడూ నిర్లక్ష్యంగా వస్తువులను పడేయను. భద్రంగా పెట్టుకుంటాను అన్నట్లు తల దించుకున్నాను.

"మొత్తం మీద దీనిలో దయ్యం లేదనైతే అర్థమైందిగా, అందరికీ?!" అన్నది వార్డెన్, నవ్వు తూ.

"అర్థమైంది అర్థమైంది" అంటూ అందరం గోలగోలగా బయటికి పరుగు తీశాం.