మా ఊరు పుట్టినప్పటినుంచి కోడికూతల ప్రవాహమే!

కొండమీద పోతున్న నదిని లాగి నేల సేద్యానికి దారి తీసిందో ఇంద్రకోడి (ఇంద్రుడు)

పాల గంపలోనుంచి తొంగి చూసి ధర్మగీత గీసిందో నల్లకోడి (విష్ణుమూర్తి)

అహంకరించి కంగుతిన్న ఓ కోపిష్టికోడి జ్ఞానమంత్రం పంచి ఇచ్చింది (విశ్వామిత్రుడు)

పుట్టలో మునిగి లేచిన ఓ వేటకోడి, రాలిన పిట్టపై జాలిగొంది- సిసలు మనిషి కథను వేకువ కావ్యం‌చేసింది (వాల్మీకి)

సంసారాన్ని, రాజ్యాన్ని విసిరేసి కోరికల చరమ గతి గుట్టు విప్పిందో చెట్టుకింద కన్ను తెరిచిన కోడి (గౌతమ బుద్ధుడు)

పందెం గెల్చిన మరో రాచకోడి దారి ప్రక్కన శాంతి వృక్షమైంది (అశోకుడు)

మా ఊరి కోడే శూన్యంతో అంకెలను సంకెలచేసి అనంతాన్ని దర్శింపజేసింది-లెక్కలకు రెక్కలిచ్చింది (ఆర్య భట్ట)

జంతువులతో‌ నీతి కథలు పలికించిందొక చతుర కోడి (విష్ణుశర్మ)

పసిప్రాయంలోనే మనసు గెల్చిన కాలడి కోడి మాయ సౌందర్యం అంతరాల్ని చీల్చి అంతా ఆ 'ఒక్క' పదార్థమేనని నిగ్గు తేల్చింది (ఆది శంకరాచార్య)

అవమానాన్ని దిగమ్రింగిన మరోకోడి పరాయి పాలనపై సాత్వికోద్యమంతో కన్నెర్ర చేసింది (మహాత్మా గాంధీ)

ఎక్కడినుంచో వచ్చిన ఓ తల్లి కోడి ఇక్కడి గాయాలకు మానవత్వపు కట్లు కట్టింది (మదర్ థెరెసా)

మా ఊరి ప్రతి మలుపులో ఏదో ఒక కోడి- పిల్ల కోళ్ళకు తత్వ బీజాలను కొసరి కొసరి తినిపిస్తూనే ఉంటుంది

ఒక్కో కోడి కూసినప్పుడల్లా మా ఊర్లో ఒక్కో ఉదయం పూస్తుంటుంది

మా ఊరి పేరు భరత జాతి-

మా కోడి కూత పేరు పురోగతి