రవి స్కూల్‌కి వెళ్ళే దారిలో ఒక పెద్ద చెట్టు ఉన్నది. వాడికి ఆ చెట్టంటే చాలా ఇష్టం. ఒక శనివారంనాడు సాయంత్రం వాడు బడి నుండి ఇంటికి వస్తుంటే ఆ చెట్టు తొర్రలోంచి "కీచ్ కీచ్" మని శబ్దాలు వినబడ్డాయి.

రవి మెల్లగా ఆ తొర్ర లోకి తొంగి చూశాడు. లోపల రెండు రామచిలుకలు! వాడు గబుక్కున ఆ రెండు చిలకలనూ పట్టేసుకొని, ఇంటికి తీసుకెళ్ళాడు.

రవివాళ్ళ అమ్మ ఆ చిలకలను చూసి మురిసిపోయింది. "వీటిని మనం పెంచుకుందామా, అమ్మా? ఒక పంజరం తెచ్చుకొని, దానిలో పెడదాం వీటిని!" అడిగాడు రవి. "అట్లా చేద్దాంరా, నాకుకూడా రామ చిలుకలంటే చాలా ఇష్టం. బజారుకెళ్ళి ఇప్పుడే ఒక పంజరం కొనుక్కురా" అని డబ్బులిచ్చి పంపింది అమ్మ.

రవి పంజరంతోబాటు చిలకలకోసమని కొన్ని అరటి పండ్లు, జామ పండ్లు, ద్రాక్షపండ్లు తీసుకొచ్చాడు. అమ్మ, రవి ఇద్దరూ కలిసి చిలుకలను పంజరంలో పెట్టారు. అటుపైన సన్నగా తరిగిన పళ్ళ ముక్కలను ఓ చిన్న గిన్నెలో వేసి పెట్టారు.

అయితే చిలుకలు రెండూ "కుయ్ కయ్ " మనకుండా కూర్చున్నై. వీళ్ళు పెట్టిన పళ్ళ వైపుకు కూడా‌ చూడలేదు.

"అమ్మా! అవి పళ్ళు తినటం లేదెందుకు?" అని చాలాసార్లు అడిగాడు రవి. "ఏమోరా, మీ నాన్న వచ్చాక అడుగుదాం" అన్నది అమ్మ. ఆరోజు రవి వాళ్ల నాన్నగారు వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలైంది. నాన్న రాగానే రవి ఉత్సాహంగా పంజరాన్ని చూపించాడు. దాన్ని చూడగానే నాన్నగారి ముఖం ఎందుకో రంగులు మారింది.

"ఈ చిలుకలు పళ్ళు తినటంలేదు నాన్నా. ఎందుకు?" అడిగాడు రవి.

"అవి బాధ పడుతూ ఉంటాయిరా, హాయిగా ఆకాశంలో తిరిగే పక్షుల్ని నువ్వు పట్టుకొచ్చి పంజరంలో పెడితే బాధ పడవూ? వాటికి ఆకలి ఎట్లా అవుతుంది?" అన్నాడు నాన్న, స్నానాల గదిలోకి వెళ్తూ.

మరునాడు ఆదివారం. రవి నిద్ర లేచేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. "అమ్మా! నాన్నా!" అని కొంచెంసేపు పిలిచి ఊరుకున్నాడు రవి. బయటికి వెళ్ళి చూద్దామనుకున్నాడు. ఇంటి తలుపులు బయటివైపు నుండి వేసి ఉన్నై. పాచి ముఖంతో‌ ఉండేదెందుకని వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చి కూర్చున్నాడు వాడు. లోపల, వంటగదిలో స్టౌ ప్రక్కనే బ్రెడ్డు పెట్టి ఉన్నది. కానీ వాడికి ఏమీ తినబుద్ధి కాలేదు. "వీళ్ళు ఎటు వెళ్ళారు? నన్నొక్కడినే వదిలి ఎందుకెళ్ళారు? ఇంటి తలుపులు వేసేసి వెళ్ళారెందుకు?" అని ఒకటే ఆలోచనలు. ఇంట్లో ఫోనులు ఏవీ పని చేయటం లేదు.

వెళ్ళి తలుపులు బాదాడు దబదబా. ఎవ్వరూ రాలేదు. రవికి ఏడుపొచ్చింది. సమయం గడుస్తూ పోయింది. పది గంటలు దాటాక వచ్చారు, అమ్మ-నాన్న ఇద్దరూ.

"ఏమిరా రామూ? ఏమీ తినలేదు?" లోనికి వస్తూనే అడిగింది అమ్మ.

"చాలా సంతోషంగా ఆటలాడుకొని ఉంటావు కదూ, ఇవాళ్ళ, ఆదివారమని!" అన్నాడు నాన్న. "ఇంతకీ మీ ఫ్రెండ్స్ రామచిలుకలు ఏమంటున్నాయి?" అంటూనే మూలన ముడుచుకొని కూర్చున్న రవిని చూసి ఇద్దరూ దగ్గరకొచ్చారు. "ఏమైంది?" అని అడిగారు.

"నన్ను ఇంట్లో పెట్టేసి మీరిద్దరూ ఎక్కడికెళ్ళారు? నాకు ఎంత ఏడుపొచ్చిందో తెలుసా?" అరిచినంత పని చేశాడు రవి.

నాన్న రామచిలుకలున్న పంజరం దగ్గరికెళ్ళి చూస్తున్నాడు. "ఇవి ఇంకా ఏమీ తినలేదు. అట్లాగే మూగగా కూర్చొని ఉన్నాయి. నిన్ను మీ ఇంట్లోనే రెండు మూడు గంటలపాటు బంధించి వెళ్తే ఇంత బాధ పడ్డావు రవీ, మరి వీటిని రాత్రంతా ఇలా ఒక క్రొత్త చోట, పంజరంలో బంధించి పెడితే అవి సంతోషంగా ఎలా ఉండగల్గుతాయి?" అన్నాడు మెల్లగా.

రవి ఏడుపు ఆగిపోయింది. అమ్మ కళ్ళలోకి చూశాడు. అమ్మ సీరియస్ గా తల ఊపింది. "నాకు అర్థమైంది నాన్నా! వాటిని వదిలేద్దాం.

ఆకాశంలో ఎగిరే పక్షుల్ని ఇలా బంధించి పెట్టకూడదు" అన్నాడు వాడు. నాన్న, రవి పంజరాన్ని మిద్దెమీదికి తీసుకెళ్ళి చిలుకల్ని వదిలిపెట్టారు.

రెక్కలు టపటప లాడించుకుంటూ పైకెగిరి, అవి వాళ్లింటి మామిడి చెట్టు మీద వాలి "కీచ్ కీచ్" మని అరిచాయి సంతోషంగా.