చిన్న మోహన్‌దాస్‌కి సూటూ బూటూ‌ అంటే చాలా ఇష్టం. పోరుబందర్ మహారాజా వారికి దివానుగా ఉండేవాడు వాళ్ళ నాన్న. పెద్ద ఉద్యోగం; బ్రిటిష్ వారితో పరిచయాలు. ఐతే ఇంట్లో‌ మోహన్‌దాస్‌ వాళ్లమ్మ పుత్లీబాయి మటుకు శ్రోత్రియురాలు. భక్తిపరురాలు. ఆమెనుండి మోహన్‌దాస్‌కి 'మామూలుగా' బ్రతకటం కొంచెం‌ కొంచెం అలవాటైంది.

పెద్దయ్యాక మోహన్‌దాస్‌ లండన్‌ కు వెళ్ళాడు. ఆ రోజుల్లో కూడా లండన్ అంటే కేవలం‌ డబ్బున్న వాళ్లకే. మరి మోహన్ వాళ్ల ఆ సరికి రిటైర్ అయిపోయాడు, చనిపోయాడు కూడా. ఇంట్లో డబ్బుల కొరత ఏమీ లేదు అంతగా. అయినా పొదుపుగా లేకపోతే డబ్బులు చాలకొస్తాయి.

లండన్ అంటే, అందులోనూ‌ లాయర్ చదువంటే, మరి సూటూ బూటూ కావాలి. దర్జా రావాలి. చక్కని మీసకట్టు పెట్టుకున్న స్టైలు మోహన్ ఆ నియమాలని బాగా పాటించాడు. 'కోటూ, ప్యాంటూ, లోపల బుషర్టూ, మెడలో టై'! చదువైపోయాక, ఇంటికొచ్చాక, అన్ననుండి వత్తిడి- 'ఉద్యోగం‌ చెయ్యి. డబ్బులు సంపాదించు' అని.

మోహన్‌దాస్‌ లాయర్ అయితే అయ్యాడు కానీ‌ అనుభవం లేదు. అనుభవం‌ ఉంటే గానీ పని దొరకదు. చివరికి అతి కష్టం మీద దక్షిణఆఫ్రికాలో లాయర్ పని ఒకటి దొరికింది. అక్కడి భారతీయ వ్యాపారులకు న్యాయ సలహాలనివ్వటం.

సూటూ బూటుకి మరలా పని పడింది. డబ్బులు కూడా బానే ఆడాయి చేతిలో. కుటుంబం అంతా దక్షిణాఫ్రికా చేరుకున్నది.

అయితే అక్కడ మోహన్‌కు వివక్ష అంటే ఏంటో అర్థమైంది. డబ్బులు ఉంటై. అయినా తెల్లవాళ్ళు మనవాళ్లని చిన్నచూపు చూస్తారు. తమతో కలవనివ్వరు, కూర్చోనివ్వరు, తిననినివ్వరు, కలిసి ప్రయాణంచేయనివ్వరు, ఓటు హక్కు కూడా ఇవ్వరు.

మోహన్‌దాస్ కు ఆవేశం వొచ్చింది. గొడవ మొదలెట్టాడు. బాగా తిరిగాడు. మాట్లాడాడు, రాసాడు. "సహనాన్ని కోల్పోకుండా నిరంతరంగా డిమాంండ్ చెయ్యాలి. మనలో సత్యం ఉంటే ఎవరైనా దిగి రావలసిందే" అని నమ్మాడు, అందరికీ చెప్పి ఒప్పించాడు. పెద్ద పెద్ద గొడవలయ్యాయి. పోలీసులు, జైళ్ళు.. చివరికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం దిగి వచ్చింది. అక్కడి భారతీయులకు ఓటు హక్కు లభించింది. అప్పటివరకూ ఇంకా సూటూ బూటూ‌ అంటే మోజే, మోహన్‌దాస్‌ కు.

దక్షిణాఫ్రికాలో విజయం సాధించే సరికి మన దేశంలో‌ స్వాతంత్ర్య పోరాటం చేస్తున్న గోపాల కృష గోఖలే, తిలక్ వంటి నాయకులు అతన్ని మనదేశం రమ్మన్నారు. "ఇక్కడి బానిసత్వం పోగొట్టాలి" అన్నాడు. సూటూ వేసుకొని వచ్చిన మోహన్‌దాస్‌కు "ముందు మనదేశం అంతా బాగా తిరిగి చూడాలి. అన్ని ప్రాంతాలనూ చూసి, ఇక్కడి మనుషుల్లో‌ కలిసిపోయి గమనించాలి. వీళ్ల మనసుల్లో‌ ఏమేమి ఉన్నాయో చూడాలి" అనిపించింది.

దానికోసం రైల్లో జనరల్ బోగీ ప్రయాణం‌ ఎంచుకున్నాడు. తను ఇప్పుడు 'అనామకంగా తిరుగుతాడు-అన్నీ గమనిస్తాడు-అందరితో మాట్లాడతాడు.." అలా సూటూ‌బూటూ‌విడిచేసి, గుజరాత్‌లో సాధారణ ప్రజలు వేసుకునే కుర్తా, ధోతి, తలపాగాలోకి మారాడు.

ఆ ప్రయాణాల్లో‌ మోహన్ దాస్ "గాంధీజీ" అయ్యేందుకు పునాది దొరికింది. అతనికి అప్పుడే 'భారతదేశపు ఆత్మ' లభించిందని చెబుతారు.

అతనికి అర్థమైంది- "మన దేశం వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నిక గన్న దేశం! ప్రత్తిపంట బాగా పండుతుంది, మన దగ్గర! అన్ని ఊళ్లలోను, అన్ని కుటుంబాలు నూలు వడికి దారాలు తీస్తాయి! ఊరూరా చక్కని వస్త్రాలు నేస్తారు మనవాళ్ళు. స్వతంత్రంగా బ్రతుకుతారు. కుటుంబ పరిశ్రమలు ఆయా కుటుంబాలకు ప్రాణాధారాలు. మన ఆర్థిక వ్యవస్థకు అవి మూల స్తంభాలు! బ్రిటిష్ వారు వచ్చి బట్టల ఫ్యాక్టరీలు పెట్టారు. యంత్రాలతో మిల్లు బట్టని ఉత్పత్తి చేసి చవకగా మన మీదికి వదిలారు; మనం‌ కూడా ఎగబడి వాటిని కొన్నాం. ఇటు మన వేతగాళ్ల కడుపు కొట్టాం! ఇదే పనిని మనం‌ అన్ని వృత్తులతోటీ చేసాం! వృత్తికారులందరినీ‌ దెబ్బతీసాం! మన దేశాన్ని సంఘటితం చేసే పని చేతివృత్తులవారిని కలుపుకోవటంతోటే జరగాలి!"

అట్లా మొదలైంది, భారత దేశంలో, ఖద్దరు బట్ట ఉద్యమం. "మన పంటలకు, మన వృత్తికారులకు, మన దేశానికి మనం‌ ప్రాధాన్యనివ్వాలి. ఖద్దరు ధరించాలి..." ఈ ఉద్యమాన్ని తానే స్వయంగా ముందుండి నడిపాడు, గాంధీ. అంటే తనిప్పుడు మిల్లు బట్టని విడిచివేసాడు. ఊళ్ళో తయారైన దారంతో, ఊళ్ళలో మగ్గాలమీద తయారయ్యే ముతక బట్టని ధరించటం మొదలుపెట్టాడు.

ఆ తర్వాత కొన్నేళ్లకు మళ్ళీ రైల్లో‌ పోతూ తోటి ప్రయాణీకుల్ని అడిగాడు గాంధీ- "మీరంతా ఖాదీ వేసుకోవచ్చు కదా? మిల్లు బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు?" అని.

"మీకంటే డబ్బులున్నై, కాబట్టి ఖద్దరు వేసుకుంటారు. అంత ఖర్చు మేం‌ ఎక్కడ పెడతాం?" అన్నారు వాళ్ళు.

గాంధీని ఆ మాటలు ఆలోచనలో‌ పడేసాయి. "ఖాదీని చవకగా అన్నా తేవాలి.. కానీ‌ అలా చేస్తే నేతగాళ్లకు డబ్బురాదు. దానికంటే మేలు, ఎవరికి తోచినంత ఖాదీ వాళ్ళనే వాడమని చెప్పాలి. నేను మాత్రం పూర్తిగా ఖాదీనే వాడతాను- అది కూడా ఇన్నిన్ని బట్టలు వద్దు. ఒక ధోవతి, ఒక ఉత్తరీయం- అంతే" అని.

అట్లా గాంధీ తను జీవితాంతం గమనించి నేర్చుకుంటూ‌ పోయాడు; నేర్చుకున్న దానిని ఆచరణలో పెడుతూ పోయాడు; తనని తాను మార్చుకునేందుకు ఎన్నడూ సిగ్గు పడలేదు. మన దేశం అన్నా, ఇక్కడి మనుషులన్నా, వాళ్ల బ్రతుకు తెరువులన్నా ఆపేక్షతో "వీటికోసం నేను ఏం చేయగలను?" అని చూసి, దానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ పోయిన గాంధీ నిజంగానే మహాత్ముడు.

దుస్తులు అందాన్ని, హుందాతనాన్ని ఇస్తాయి. అయితే అవి కేవలం అలంకరణ ప్రాయాలు కాకూడదు. మనం ధరించే దుస్తులు, మనం వాడే వస్తువులు అన్నీ మన ప్రజలకు జీవనాధారాలు కావాలి. మన కుటీర పరిశ్రమల్ని, చేతి వృత్తుల్ని మనమే నిలబెట్టుకోవాలి.

అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలతో,
కొత్తపల్లి బృందం.