ఐకా సుబోటా జపాన్‌లోని ఒక చిన్న పట్టణానికి చెందిన అమ్మాయి. 1991లో పన్నెండేళ్ళ వయసులోనే బ్రెయిన్ హేమేరేజ్ కారణంగా చనిపోయింది. కానీ, అంత చిన్న వయసులోనే ఆమె చేసిన ఒక పని వల్ల, ఇప్పటికీ ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం.

పేరుకి చిన్నమ్మాయే అయినా, ఐకా కు మన పర్యావరణం గురించి, 'దాన్ని పరిరక్షించడం ఎలా?' అన్న అంశం గురించి చాలా ఆలోచనలు ఉండేవి. ప్రకృతి అంటే ఇష్టంగా ఉండేది. ఈ నేపథ్యంలో నుంచే "పుడమి రహస్యాలు" పుట్టింది.

స్వతహాగా పిల్లలందరికీ ఉన్నట్లే ఈమెకి కూడా బొమ్మల పుస్తకాలన్నా, బొమ్మలు గీయడం అన్నా చాలా ఇష్టం. అలా నెమ్మదిగా, తన సొంత బొమ్మలు, పాత్రలు సృష్టిస్తూ, కార్టూన్లు గీయడం నేర్చుకుంది. దీనితో పాటు, వాళ్ల అమ్మానాన్నల సాయంతో పర్యావరణం గురించి రకరకాల విషయాలు తెలుసుకున్నది. మనుషులు చేసే పనుల వల్ల పర్యావరణానికి ఎలా హాని కలుగుతోందో, పర్యావరణ పరిరక్షణ మనకెందుకు అవసరమో అర్థం చేసుకుంది. స్కూల్లో ఇదే అంశం పైన ఒక హోం వర్కు ఇచ్చేసరికి, తనకు బొమ్మలు వేయటం బాగా వచ్చు కదా, అందుకని పిల్లలందరికీ అర్థమయ్యేటట్లు పర్యావరణం గురించి కామిక్స్ తయారు చేయడం మొదలుపెట్టింది.

అట్లా తయారు అయిన పుస్తకమే "సీక్రెట్స్ ఆఫ్ ఎర్త్". ఇందులో, మూడు ప్రధాన పాత్రలుంటాయి - ఒక చిన్న అమ్మాయి, ఒక చిన్న అబ్బాయి, భూమి! అవును, ఇందులో మన భూమి కూడా ఒక పాత్ర! ఈ పిల్లలిద్దరూ వాళ్ల లైబ్రరీలో వెతుక్కుంటూ ఉంటే "సీక్రెట్స్ ఆఫ్ ఎర్త్" అని ఒక పుస్తకం దొరుకుతుంది. వాళ్ళు దాన్ని తెరిచేటప్పటికి, "హాయ్!" అంటూ అందులోంచి భూమి బయటకు వచ్చేస్తుంది. తన కథ చెబుతుంది; వీళ్ళ సందేహాలు తీర్చడం మొదలుపెడుతుంది. తనకు కలిగిన ఇబ్బందుల గురించి చెబుతుంది. వాటిని విని కదిలిపోయిన పిల్లలు "నీకు మేమేం సాయం చేయగలం" అని అడుగుతారు. అప్పుడు భూమి పర్యావరణ కాపాడుకునేందుకు మనం ఏమేం చెయ్యాలో చెబుతుంది. అదన్నమాట, ఐకా రాసిన పుస్తకం కథ-

చక్కటి ఆలోచన కదూ?!

ఇలా పుస్తకం పూర్తి చేసిన తర్వాత కొద్ది రోజులకే ఐకా ఉన్నట్లుండి బ్రెయిన్ హేమరేజ్‌తో చనిపోయింది. 'పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయగలరు' అని నమ్మకం, ఐకా వాళ్ల అమ్మానాన్నలకు. ఐకా కు గుర్తుగా వాళ్ళు తను రాసిన ఈ పుస్తకానివి యాభై కాపీలు ముద్రించి, ఆమె క్లాసు పిల్లలకి, టీచర్లకి పంచి పెట్టారు.

తరువాత ఆ పుస్తకం అలా అలా జపాన్‌లో చాలామంది పిల్లలకు నచ్చింది! జపాన్‌ను దాటి చాలా చోట్లకి విస్తరించింది. ఇంగ్లీషు, అరబిక్, చైనీస్ భాషల్లోకి అనువదితమయింది. చాలా స్కూళ్ళలో పాఠ్య పుస్తకం కూడా అయ్యింది. తెలుగులోకి కూడా వచ్చేసింది!

ఆపైన పర్యావరణం కోసం పని చేస్తున్న ఎన్నో సంస్థలు ఆమె పుస్తకాన్ని గురించి ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆ పుస్తకంలోని కథని వీడియో సినిమాగా కూడా తీసారు. అట్లా, ఐకా మన మధ్య లేకున్నా కూడా, చిరంజీవి అయ్యింది అన్నమాట!

మనకు వచ్చిన కళలు చిన్నవే కావొచ్చు, కానీ అవకాశం ఇస్తే అవి మనకున్న పెద్ద పెద్ద ఆలోచనల్ని కూడా గొప్పగా ప్రతిఫలిస్తాయి. వాటి ద్వారా మనం ఉండే ఈ ప్రపంచానికి ఏ కొంచెం మేలు జరిగినా చాలా బాగుంటుంది, కదూ?!