అడవిలో ఒక సింహం ఉండేది. అది కొంచెం ముసలిదైంది. వేటాడే ఓపిక తగ్గిపోయింది దానికి. రాజునన్న అహంకారం మాత్రం నిలచి ఉన్నది.

దాంతో అది జంతువుల సమావేశం ఒకటి ఏర్పాటు చేసింది. "నన్ను మీ రాజుగా కొనసాగనిస్తున్నందుకు ధన్యవాదం. ఇక నుండి నేను మాంసాహారాన్ని ముట్టను. వేటాడను. సాధు జీవితం గడపాలనుకుంటున్నాను" అంటూ సభను ముగించింది. జంతువులన్నీ చాలా సంతోషపడ్డాయి.

"ఇక మీద మనం అడవిలో నిర్భయంగా తిరగొచ్చు" అనుకున్నాయి.

గుహకు చేరగానే సింహరాజు నక్కమంత్రిని పిలిచింది. "అడవిలో ఒంటరిగా కనబడ్డ జంతువును దేన్నైనా నేను పిలుస్తున్నానని చెప్పి తీసుకురా, బాగా ఆకలిగా ఉంది. త్వరగారా!" అంటూ దాన్ని అడవిలోకి పంపింది.

కొద్ది దూరం అలా పోగానే నక్కకు ఒక జింక కనబడింది. "ఏం, జింకా! బాగున్నావా?" అంది నక్క.

"ఏదో, ఇలా ఉన్నాం" అంది జింక.

"ఏమైనా కష్టాలుంటే సింహరాజుకు విన్నవించుకో, ఇప్పుడైతే ఆయన కొంచెం విశ్రాంతిగా ఉన్నారు" అని దానికి మాయమాటలు చెప్పి, దాన్ని వెంటబెట్టుకొచ్చింది సింహం గుహ దగ్గరకి. గుహ బయట నిలబడి 'రాజా'అని పిలవగానే సింహం బయటికి వచ్చి క్షణాల్లో దాన్ని చంపేసి గుహలోకి ఈడ్చుకుపోయింది. అది తినేసి వదిలిపెట్టిన జింక ముక్కల్ని నక్క తిన్నది- మెల్లగా చప్పరించుకుంటూ.

అట్లా రోజూ ఏదో‌ ఒక జంతువును చంపి తినటం మొదలుపెట్టాయి సింహం-నక్క.

అడవిలోని ముఖ్యమైన జంతువులన్నీ ఒక్కటొక్కటిగా కనబడటం మానేస్తున్నాయి. దాంతో ఎలుగుబంటికి, ఏనుగుకు కొంచెంగా అనుమానం వచ్చింది. అవి రెండూ ఒకనాడు సాయంత్రం సింహం గుహకు ఎదురుగా ఉన్న పెద్ద బండ వెనక దాక్కున్నై. నక్క గుహలోంచి బయటికి వెళ్ళటం, కొద్ది సేపటికి ఒక జంతువును వెంటబెట్టుకు రావడం, సింహం చంపడం, అవి రెండూ తినడం- మొత్తం చూసినై.

"అబ్బ సింహమూ! ఇంత మోసమా! నీకు బుద్ధి చెబుతాం ఆగు" అని దీనికి పరిష్కారం ఆలోచించిపెట్టుకున్నై. మరునాడు గుహలోంచి బయటికి రాగానే నక్కకు ఎదురైంది ఎలుగుబంటి. "ఇవాల్టికి ఇదే మనకు ఆహారం" అనుకున్న నక్క దాన్ని ఆప్యాయంగా పలకరించింది. మాయ-మాటలు చెప్పి, దాన్ని సింహం దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంది.

కానీ ఎలుగుబంటి ముందుకు దూకి నక్కనే చంపేసింది గభాలున. అప్పటికే విషపు ఆకుల కట్టనొకదాన్ని తీసుకొచ్చి ప్రక్కన నిలుచున్నది ఏనుగు.

రెండూ కలిసి విషపు ఆకులను పిండినై. ఆ రసాన్ని నక్క కడుపునిండా పోసి, దాన్ని తీసుకెళ్ళి సింహం గుహ దగ్గర పడేసినై. కొద్దిసేపటికి ఇక ఆకలికి ఆగలేక పోయింది సింహం. మెల్లగా నడచుకొంటూ బయటికి వచ్చింది. ఎదురుగుండా కనబడింది నక్క శరీరం! ఆకలిగొని ఉన్న సింహం ఉచితానుచితాలు మర్చిపోయింది. దాని ఆలోచన కూడా బాగా మందగించింది. నక్క శవాన్నే గుహలోకి గుహలోకి ఈడ్చుకు పోయి తిన్నది.

ఇంకేముంది, ఎలుగుబంటి-ఏనుగుల ఉపాయం పారింది. కొంత సేపటికి సింహం కూడా చనిపోయింది.

ఆనాటినుంచి అడవిలోని జంతువులన్నీ సంతోషంగా జీవించినై.