రామాపురంలో సుమిత్ర , నాగప్ప అనే దంపతులు ఇద్దరు ఉండేవారు. వాళ్ల కొడుకు చరణ్ చాలా తుంటరి వాడు. వాడంటే సుమిత్రకు, నాగప్పకు కూడా చాలా ఇష్టం. వాళ్ళు చాలా ఎక్కువ గారాబం చేయటంతో‌ వాడి తుంటరితనం మరీ ఎక్కువైపోయింది.

ఒకసారి చరణ్ పుట్టినరోజు వచ్చింది. తన పుట్టిన రోజు కనుక తను 'ఒక కేకు కొనాల్సిందే' అనుకున్నాడు చరణ్- కానీ వాడి దగ్గర డబ్బులు లేవు!

తుంటరివాడు కదా, అందుకని వాడేం చేశాడంటే, నేరుగా కేకు అమ్మే అంగడి దగ్గరికి వెళ్ళాడు. "ఒక కేకు ఇవ్వండి" అన్నాడు దర్జాగా. అంగడిలో వాళ్లకు వీడి దగ్గర డబ్బులు లేవని తెలీదు. అందుకని వాళ్ళు కేకును వీడి చేతికి ఇచ్చారు. అంతే- వాడు దానిని తీసుకొని, ఇక డబ్బులు ఇవ్వకుండా పరుగెత్తాడు.

దుకాణం వాళ్ళు వాడి వెంట పరుగెత్తి వాడి అంగీ పట్టుకున్నారు. అయినా వాడు ఆగలేదు. వాడి అంగీ చినిగిపోయి పీలికలైపోయింది. అయినా వాడు తువ్వాల కప్పుకొని పరుగెత్తాడు! వాడు అట్లా పరుగెత్తుతుంటే ఒక చెప్పు ఊడి పోయింది. అయినా వాడు అలాగే పరుగెత్తి, అంగడి వాళ్లనుండి తప్పించుకునేందుకని అడవిలోకి పారిపోయాడు.

ఇంక ఎంత దూరమని వెంబడిస్తారు, అంగడి వాళ్ళు? "ఇంక పట్టుకోలేం" అని వదిలేసి వెనక్కి మళ్ళారు.

ఆ సమయంలో అంగడాయన తన మనసులో గట్టిగా అనుకున్నాడు- "ఒరేయ్! నువ్వు నా వస్తువును దొంగతనం చేశావురా! దానిమీద నీకు ఏలాంటి అధికారమూ లేదు. కాబట్టి అది నీకూ దక్కదు, చూస్తూండు!" అని.

ఈ మాటలు విన్నారు, ఆ అడవిలో ఉన్న వన దేవతలు కొందరు.

వాళ్ళు అనుకున్నారు "అరే! వీడు చేస్తున్నది తప్పు పని కదా, ఇలా ఒకసారి వాడికి కేకు దొరికిందంటే వీడు మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులే చేస్తాడు. వీడిని మంచి మార్గంలోకి తేవాలి" అని, వాళ్ళు ఇట్లా చెయ్యి ఊపారు-

అంతే, ఆ కేకు చిన్న చిన్నగా అయిపోవటం మొదలు పెట్టింది!

"అరే, కేకు చిన్నగా ఐపోతోందే" అని చరణ్ గబగబా దాన్ని నేలమీద పెట్టాడు. క్యాండిల్ అంటిద్దామని అగ్గిపెట్టె కోసం చూశాడు హడావిడిగా. అదెక్కడుంది, ఎప్పుడో మాయం!

ఇంక అప్పుడు చరణ్ ఇంకొంచెం గందరగోళ పడి అనుకున్నాడు- "క్యాండిల్ తీసేసి తినేస్తాను- దానిదేముందిలే" అని. అట్లా అనుకొని, వాడు క్యాండిల్‌ని పీకి పారేశాడు.

అయితే ఆ సరికి కేకు మరీ చిన్నగా అయిపోయింది. వాడు దాని మీద చెయ్యి పెట్టే సరికి అది పూర్తిగా మాయమే అయిపోయింది!

అట్లా ఎందుకయిందో కూడా అర్థం కాని చరణ్ బిక్క ముఖం వేశాడు. దిక్కులు చూసి అటునుండి లేచి వచ్చాడు.

మిత్రులారా! వాడిలాగా ఆశకు పోయి ఏనాడూ తప్పుడు పనులు చేయకూడదు మనం ఎవ్వరమూ- సరేనా?