మూడవ తరగతి చదివే రాజు, రమేష్ మంచి స్నేహితులు. కలిసి తిరిగేవాళ్ళు, కలిసి చదివేవాళ్ళు, ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళు.

ఒక రోజు రాజు వాళ్ళమ్మకు వంట్లో అస్సలు బాగలేకుండా అయ్యింది. రాజు చాలా బాధపడ్డాడు. "పదరా, నేనూ వస్తాను. ఇద్దరం మీ అమ్మను డాక్టరు దగ్గరికి తీసుకెళ్దాం" అని రమేష్ ముందుకొచ్చాడు.

ఇద్దరూ కలసి రాజు వాళ్లమ్మని హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు.

డాక్టర్ వైద్యం చేసిన తర్వాత డబ్బులు అడిగాడు. "ఎంత ఇమ్మంటారు సార్?" అడిగారు పిల్లలిద్దరూ. "500రూపాయలు ఇవ్వండి" అన్నారు డాక్టరుగారు.

మిత్రులిద్దరి ముఖాలూ వాడిపోయాయి. ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గరా కలిపి మొత్తం 150 రూపాయలే ఉన్నాయి!

కొంచెంసేపు తటపటాయించాక, వాళ్ళు ఆ డబ్బునే డాక్టరుగారికి ఇచ్చారు.

"మిగతా డబ్బుల సంగతేంటి బాబూ?" అడిగారు డాక్టరుగారు.

రమేష్ వెంటనే తన చేతికున్న ఉంగరాన్ని తీసి ఇస్తూ చెప్పాడు- "సార్! రాజు వాళ్ళు కొంచెం పేదవాళ్ళు. ప్రస్తుతానికి మా దగ్గర అన్ని డబ్బులు లేవు. యీ ఉంగరం నాది. దీన్ని మీ దగ్గర ఉంచుకోండి. రేపటికల్లా మా నాన్ననడిగి మీ డబ్బులు మీకిచ్చి, ఈ ఉంగరం తీసుకెళ్తాను" అని.

"నువ్వెవరు?"అడిగారు డాక్టరుగారు, కొంచెం ఆలోచిస్తూ.

"మేమిద్దరం ఫ్రెండ్స్ సార్!" అన్నారు ఇద్దరూ ఒకేసారి.

డాక్టరుగారు నవ్వారు. "మీ ఫ్రెండు వాళ్లమ్మకు బాగాలేదని నీ ఉంగరాన్నిస్తున్నావన్నమాట! బాగుంది. మీ స్నేహం నాకు చాలా నచ్చింది. ఇలాగే మంచి మిత్రులలాగా ఉంటానంటే ఒక పని చేద్దాం-" అన్నారు.

"చెప్పండి సార్" అన్నారిద్దరూ.

"ఈ ఉంగరాన్నీ, డబ్బుల్నీ‌ మీరే ఉంచుకోండి. ఈవిడకు నా తరపున వైద్యం ఉచితం. మీ స్నేహానికి నా బహుమతి, ఇది!" అంటూ డాక్టరుగారు ఉంగరాన్నీ, డబ్బుల్నీ వాళ్ల చేతుల్లో పెట్టారు!