1.బడిగంట

బడిలో గంట ఏమంది?
వేళకు బడికి రమ్మంది.
గుడిలో గంట ఏమంది?
దేవుడి పూజకు రమ్మంది.
సైకిల్ గంట ఏమంది?
దారికి అడ్డం రాకండది.




2.చిలకా చిలకా

చిలకా చిలకా చిన్నారి మొలకా
మంచం కోసం ఎందుకే అలక
మామ కేమో మడత మంచం
అన్నకేమో నవారు మంచం
తాతకేమో నులక మంచం
నాకు నీకు పందిరి మంచం !




3.చారెడు కళ్లకు

చారుడు కళ్లకు కాటుక పెట్టి
నుదుట కుంకమ బొట్టును పెట్టి
జడ కుచ్చులను జంపుగా అల్లి
తెల్లని మల్లెలు జడలో ముడిచి
ఇరుగు పొరుగు పిల్లలతో
చేయి చేయి కలుపుకొని
కలసి మెలసి ఉందాము;
వేళకు బడికి పోదాము.


4.పిల్లలం బడి పిల్లలం

పిల్లలం బడి పిల్లలం
ఆడే పాడే పిల్లలం
కళ్ళకు గంతులు కట్టుకొని
దాగుడు మూతలు ఆడేస్తాం
కప్పగంతులు తొక్కుడు బిళ్ల
కబడ్డి ఆటలు ఆడేస్తాం.
ఆటలంటే మాకిష్టం
పాటలంటే మాకిష్టం.

5. బలే పనస

బలే బలే పనస
పసందైన పసన
పచ్చా పచ్చని పనస
తోలు ఉన్న పనస
బలే బలే పనస
పసందైన పనస