అనగనగా ఒక ఊళ్ళో ఒక మనోజ్ అనేవాడు ఉండేవాడు, అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నకు మాత్రం క్రికెట్ అంటే ఇష్టం లేదు. ఎందుకు కంటే అతను తాగుబోతు. మనోజ్ వాళ్ల నాన్న వాడికి ఎప్పుడూ ఏదో ఒక పని చెబుతూనే ఉండేవాడు. క్రికెట్ ఆడితే ఏమీ లాభం లేదనీ, దాని బదులు వేరే ఏ పని చేసుకున్నా హాయిగా బ్రతుక్కోవచ్చనీ ఆయన నమ్మకం. మనోజ్ క్రికెట్ పిచ్చిని వదిలించేందుకు ఆయన వాడికి గేదెలు కాసే పని పెట్టాడు.

మనోజ్ గేదెల్ని తోలుకొని అడవికి వెళ్లి, అక్కడ గేదెలు గడ్డి మేస్తా ఉంటే తను కూర్చొని, ఒక చెక్కతో బ్యాటు చెక్కుకున్నాడు. తర్వాత వికెట్లు తయారు చేసుకున్నాడు. వాళ్ల ఇంటి వెనకాల చిన్న పూరి గుడిసె వేసుకొని, అందులో తన క్రికెట్ సామాన్లు పెట్టుకున్నాడు.

ఊళ్ళో కొందరు పిల్లలతో కలిసి, వాళ్ల నాన్నకు తెలీకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు క్రికెట్ ఆడుకోవటం మొదలు-పెట్టాడు. ఆ ఊళ్లోనే ఒక వింత మనిషి ఉండేవాడు. అతను ఊళ్లో వాళ్లెవరితోటీ సరిగ్గా మాట్లాడేవాడు కాదు. అందరూ 'అతనికి తిక్క ' అని చెప్పుకునేవాళ్లు , కానీ నిజానికి అతను ఒక గొప్ప క్రికెట్ ప్లేయర్- చాలా ధనవంతుడు కూడాను.

పెద్దవాళ్లందరూ మోసం చేస్తున్నారని కోపం వచ్చి, అతను క్రికెట్ ఆడటం మానేసి, మనోజ్ వాళ్ల ఊరు చేరుకొని, మామూలు మనిషిలాగా బ్రతుకుతు-న్నాడు. మనోజ్ ఒకవైపున గేదెల్ని కాస్తూ , ఇంకో వైపున క్రికెట్ ఆడుకోవటం చూసి అతనికి మనోజ్ అంటే ఇష్టం ఏర్పడింది. ముందు కొన్ని సార్లు మనోజ్ ని పరీక్షించి చూసి, అతను వాడికి క్రికెట్ కోచింగ్ ఇవ్వటం మొదలు పెట్టాడు.

ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అతను ఎట్లా చెబితే అట్లా శ్రమపడి పనిచేశాడు, మనోజ్. చివరికి ఒక రోజున రంజీ ట్రోఫీ సెలక్షన్లు అవుతుంటే అతను మనోజ్ ను వెంట బెట్టుకొని వెళ్లాడు. వాటిలో మనోజ్ ఎంపిక అయిపోయాడు. ఇంత జరుగుతున్నా కూడా మనోజ్ వాళ్ల నాన్నకు సంగతులేవీ తెలీవు.

చివరికి పేపర్లో ఆ సంగతి వచ్చి, ఊళ్లో అందరూ మనోజ్ ను మెచ్చుకోవటం మొదలు పెట్టే సరికి, వాళ్ల నాన్న కూడా వాడిని ప్రోత్సహించటం మొదలు పెట్టాడు. ఇట్లా అందరి సహకారంతో, తన సొంత పట్టుదలతో మనోజ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అయ్యాడు. పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలం.