ఒక ఊరిలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతనికి ఒక కూతురు. రామయ్య ఆమెను ప్రక్క ఊరిలో‌ఉండే తన స్నేహితుడి కొడుక్కే ఇచ్చి పెళ్ళి చేశాడు. ఇంట్లో రామయ్య దగ్గర రాజశేఖర్ అనే పనివాడు మాత్రం ఉండేవాడు. అతను పని బాగా చేస్తాడు; కానీ ఒక్క అక్షరం ముక్క రాదు.

ఒకరోజు రాజశేఖర్‌ను పిలిచి "ఈ మామిడి పండ్లు తీసుకెళ్ళి పక్క ఊర్లో ఉన్న అమ్మాయిగారికి ఇచ్చిరా!” అని చెప్పాడు రామయ్య.

రాజశేఖర్ సరేనని బయలుదేరి, "అమ్మాయిగారితో ఏమన్నా చెప్పాలా, బాబుగారూ?” అని అడిగాడు.

"నువ్వేమీ చెప్పద్దులే, అన్నీ ఈ ఉత్తరమే చెబుతుంది" అని ఒక ఉత్తరం రాసి, చేతికిచ్చాడు రామయ్య- ”దీన్ని అమ్మాయి చేతికి ఇవ్వు- చాలు" అన్నాడు.

అలాగేనని, రాజశేఖర్ మామిడి పండ్ల గంపని నెత్తికి ఎత్తుకొని పక్క ఊరికి నడక సాగించాడు. నడుస్తూనే ఉన్నాడు; కానీ అతనికి రామయ్య మాటలే గుర్తుకు వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ: "ఉత్తరం అమ్మాయిగారితో ఎట్లా చెబుతుందబ్బా?” అని చాలా ఆలోచించాడు; కానీ అతనికి ఏమీ బోధ పడలేదు.

అట్లా నడుస్తూ పోతుంటే, సగం దూరం వెళ్ళేసరికి అతనికి ఆకలయ్యింది: "మామిడి పళ్ళు బుట్టనిండా ఉన్నాయి; కానీ ఏం లాభం? తిన్నానంటే ఈ ఉత్తరం చూసి అమ్మాయి గారితో చెబుతుంది" అనుకున్నాడు. "ఈ‌ ఉత్తరానికి తెలీకుండా ఆకలి తీర్చుకునేది ఎట్లాగబ్బా?” అని ఆలోచించసాగాడు.

అతనికి ఒక ఉపాయం తట్టింది. అదేమిటంటే, "ముందుగా ఉత్తరాన్ని గుంత తవ్వి పూడ్చి పెట్టేయాలి- అప్పుడు ఉత్తరం ఏమీ చూడలేదు కదా? అందుకని ఎన్ని కావాలంటే అన్ని మామిడిపళ్ళు తీసుకొని తినేయచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఉత్తరాన్ని బయటికి తీసి, దులిపి మామూలుగానే తీసుకు పోవచ్చు!” అనుకున్నాడు. తనకు ఇంత తెలివైన బుర్ర ఉన్నందుకు చాలా సంతోషపడ్డాడు.

వెంటనే ఉత్తరాన్ని పూడ్చిపెట్టేసి, కొన్ని మామిడి పండ్లు తినేశాడు. మామిడి పండ్లు తిన్నాక ఆ ఉత్తరాన్ని తీసి "ఇప్పుడు నువ్వేమీ చెప్పలేవులే, అమ్మాయి గారితో" అన్నాడు; మళ్ళీ నడక సాగించాడు.

మెల్లగా అమ్మాయి గారి ఊరికి చేరుకున్నాడు. అమ్మాయి గారి ఇంటికి వెళ్ళి ఆ పండ్ల గంపను, ఉత్తరాన్ని అందించాడు. ఆమె ఉత్తరం తీసి చదివి, గంపలోని మామిడి పండ్లు లెక్కచూసుకొని, "పండ్లు తిన్నావు కదూ?” అని అడిగింది. "లేదు అమ్మాయి గారూ" అన్నాడు రాజశేఖర్ కలవరపడుతూ. "నిజం చెప్పు" అన్నది ఆమె. ఇక రాజశేఖర్‌కు నిజం ఒప్పుకోక తప్పలేదు. అతని అమాయకత్వాన్ని చూసి అమ్మాయి కూడా నవ్వింది.

ఇక అతన్ని తిరిగి వాళ్ళ నాన్నగారి ఊరికి పంపించింది- వేరే ఏవో సామాన్లిచ్చి. దారిలో వెళ్ళేటప్పుడంతా రాజశేఖర్ ఒకటే ఆలోచించాడు- "ఉత్తరం ఎట్లా చూసింది? అమ్మాయిగారికి ఎట్లా చెప్పింది?” అని. ఎంత ఆలోచించినా ఆ సంగతి ఇప్పటికీ‌ అతనికి అర్థం కాలేదు!