కరటకుడు వినయం ఉట్టిపడేట్లు వచ్చి నమస్కరించగానే, సింహరాజు దాన్ని మర్యాదగా పలకరించి, కూర్చొనేందుకు తగిన ఆసనం చూపించింది. ఆపైన అది దమనకుడివైపుకు చూసి "ఆ విషయాన్ని సంపూర్ణంగా వినిపించు ఇతనికి" అని ఆదేశించింది. అప్పుడు దమనకుడు లేచి నిలబడి, సంజీవకుడు గతంలో ఎట్లా ఉన్నదీ, ఇప్పుడు ఎట్లా ఉన్నదీ చెప్పింది, కరటకుడికి. ఆపైన తానూ, రాజుగారూ ఏమనుకున్నదీ వివరించింది. "నేను చెప్పిన సంగతీ, రాజుగారి అభిప్రాయమూ-రెండూ విన్నావు గదా? ఇప్పుడు నీకేమి అనిపిస్తున్నదో చెప్పు" అన్నది.

అప్పుడు కరటకుడు కొంచెం సేపు ఆలోచించి, దమనకుడి వైపుకు చూసి "ఫ్రభువులవారికి తెలీని విషయం అంటూ లేదు- ఏది సరైనదో, ఏది కాదో‌నిర్ణయించేందుకు మనం ఎంత వాళ్ళం? అయినప్పటికీ, మంత్రి పదవిలో ఉన్నవాళ్ళం- కనుక సందర్భం కొద్దీ మనసుకు తోచినది చెప్పక ఊరకుండకూడదు. అవకాశం చూసుకొని రాజద్రోహం చేసినవాడిని ఊరికే బహిష్కరిస్తే చాలదు- అట్లా బహిష్కరింపబడ్డవాడు శత్రువుతో కలిసి పగ సాధించుకునేందుకు ప్రయత్నిస్తాడు తప్ప, తన తప్పును గుర్తించడు. గోటితో‌ పోయేదాన్ని అప్పుడు గొడ్డలితో తీర్చవలసి వస్తుంది. అలాకాక, ద్రోహిని ఎప్పటిలాగానే కలుపుకొని పోతూ, అతని దుష్కార్యాన్ని ఉపేక్షించినట్లైతే, ఒక సారి తప్పుడు ప్రయత్నం చేసి విఫలమైన మనస్సుతో గల ఆ ద్రోహి 'మరొకసారి ఆపద ఎలా తేవాలా' అని ఆలోచించటానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది- అట్లాంటివాడి వల్ల అపాయమే తప్ప, ప్రయోజనం ఏముంటుంది? అందువల్ల రాజు తనకు కీడు తలపెట్టినవాడిని ఊరికే వదిలిపెట్టకూడదు" అన్నది.

ఆ మాటలు విని పింగళకుడు "కరటకా, నువ్వు అన్నది నిజమే. అయినప్పటికీ చిరకాల స్నేహం వల్ల, వాడికి ఇప్పుడు ఏదైనా పెద్ద శిక్ష వేయాలంటే నాకు మనస్సు రావటం లేదు. నేనేం చేసేది?" అన్నది.

అప్పుడు కరటకుడు "ఆరోగ్యం కావలసినవాడు వైద్యుడినుండి ఔషధాన్ని ఎలాగైతే ఆశిస్తాడో, అదే విధంగా రాజన్నవాడు తన సేవకుడినుండి సద్భావనను ఆశించాలి. దేవరవారికి తెలీనిది ఏమున్నది? కొంచెం దూరదృష్టితో ఆలోచించారంటే, ఏమి చేయాలో దానంతట అదే మనసుకు తట్టగలదు. నీతి ఎఱిగిన రాజు- జాగ్రత్తగా పరీక్షించి, 'మంచివాడు' అని తేలిన వాడిని చేరదీయాలి తప్పిస్తే, ఎవరిని పడితే వారిని దగ్గరచేసుకుంటే చివరికి ముప్పు తప్పదు. 'మంద విసర్పిణి' అనే పేను ఒకటి, 'డిండిమం' అనే నల్లితో సహవాసం చేసి ఆపదల పాలు కాలేదా? ఆ కథ చెబుతాను వినండి" అన్నది.

నల్లి-పేను కథ

అనగా అనగా 'మంద విసర్పిణి' అనే పేను ఒకటి ఉండేది. అది చాలాకాలంగా ఒక రాజుగారి మంచాన్ని ఆశ్రయించుకొని, జాగ్రత్తగా మసలుకుంటూ జీవించేది.

అంతలో ఒకనాడు 'డిండిమం' అనే నల్లి ఒకటి ఆ మంచంలోకి వచ్చి చేరుకున్నది. మందవిసర్పిణి దానికి ఎదురేగి స్వాగతం ఇచ్చి, అతిథి మర్యాదలు చేసి, కుశల ప్రశ్నలు వేసి, 'ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటి?' అని అడిగింది.

అప్పుడా నల్లి "నాకు పరమ మిత్రుడివైన నీనుండి ఒక సహాయాన్ని కోరి ఇట్లా వచ్చాను. నీ అనుగ్రహం ఉంటే నా కోరిక అవలీలగా నెరవేరగలదు" అన్నది.

"అయ్యో, నాకు ప్రాణ సమానుడివే, స్నేహితుడివే, నీ కోరిక నా వశంలో ఉన్నదైతే దానికి ఇంతగా అడగాలా? నీకు ఇవ్వటానికి పనికిరాని సంపద నాకంటూ‌ ఉండి ఏమి ప్రయోజనం? నా సంపద అంతా నీదే- యధేచ్ఛగా వాడుకో" అన్నది పేను.

సంతోషించిన నల్లి "ఎంతో కాలంగా రకరకాల మనుషుల రక్తాలను రుచి చూసి ఉన్నాను గాని, రాజుగారి రక్తాన్ని ఏనాడూ రుచి చూసి ఎరుగను. బియ్యపు అన్నాన్ని, ఎప్పటికప్పుడు చిలికిన ఆవు వెన్నను కాచిన నేతిని, తియ్యని పప్పు చారును, అద్భుతమైన కూరలను, రుచికరమైన పిండివంటలను, వివిధ ఫలాలను, బలాన్నిచ్చే రకరకాల పానీయాలను, పలు రకాల మాంసాలను, ఆవు పాలను, సారాయాలను, అనేక రకాల ఊరగాయలను, మీగడ పెరుగును, చక్కెర, పటిక బెల్లంలను, సువాసనలీనే పలు ద్రవ్యాలను- ఇంకా ఇట్లాంటి మరెన్నో మంచి మంచి పదార్థాలను తింటూ, ఎండకన్ను ఎరుగని రాజుల ఒంటి రక్తం చాలా రుచిగా ఉంటుందని విన్నాను- తప్పిస్తే ఎన్నడూ రుచి చూడలేదు. ఈ మంచం మీద నేనుకూడా నివసించేందుకు అంగీకరించావంటే చాలు- నా యీ ఒక్క కోరిక నెరవేరుతుంది- దయచేసి సరేనను!" అన్నది.

అప్పుడు మందవిసర్పిణి మొహమాట పడింది- నల్లికి ఎదురు చెప్పలేకపోయింది. "సరైన సమయం చూసుకొని, తొందర పడకుండా, రాజు గారు ఒళ్ళు మరచి నిద్రపోయిన తరుణంలో, ఆయనను మెల్లగా కొరికి, నొప్పి తెలియనివ్వకుండా రక్తం పీల్చుకొని, మెలకువతో ప్రక్కకు తప్పుకోవాలి- జాగ్రత్తగా మసలుకోవాలి- సరేనా?" అని మాత్రం అనగల్గింది.

"నువ్వు ఎట్లా చెబితే అట్లాగే చేస్తాను" అని మాట ఇచ్చి, నల్లి ఆ మంచంలోకి చేరుకున్నది. తను ఇంతకాలంగా అనుభవించటానికి వీలు కానిది ఇప్పుడు తన చేజిక్కేసరికి, అది సంతోషం పట్టలేకపోయింది. ఆశ యొక్క వేగాన్ని ఇక ఆపుకోలేక పోయింది, రాజుగారు ఇంకా నిద్రలోకి జారీ జారకుండానే అది పోయి, ఆయనను తనివితీరా కుట్టింది.

మరుక్షణం ఆ రాజు "ఛీ! ఛీ!" అని చీదరించుకుంటూ ఉలిక్కిపడి లేచి, తన కాళ్ళు ఒత్తుతూ దగ్గరలోనే నిలబడ్డ సేవకుడిని చూసి "ఓరీ! ఏదో‌ తేలు కుట్టినట్లు నా శరీరమంతా మండుతున్నది. వెంటనే దీపాన్ని ఒకదాన్ని దగ్గరికి తీసుకురా" అని ఆజ్ఞాపించాడు. వాడు వెళ్ళి దీపం తెచ్చేంతలో నల్లి జారుకొని దూరంగా నక్కింది. దీపాన్ని తీసుకువచ్చిన పరిచారకులు మంచాన్ని అన్ని వైపులనుండీ అనేక విధాలుగా‌ పరీక్షించి చూసారు. వాళ్ళకు నల్లి అయితే కనబడలేదుగానీ, మంచానికి ఒక ప్రక్కన- చిన్న నలుసులాగా పట్టుకొని ఉన్న పేను కనబడింది! 'రాజుగారిని కరిచింది ఇదే' అని వాళ్ళు కాస్తా దాన్ని చంపేశారు. కాబట్టి, స్వభావం ఎలాంటిదో‌ తెలుసుకోకుండా ఇతరులను దరి చేరనిచ్చినవాడికి కీడు తప్పదు.

ఆ కథను విని, పింగళకుడు "నాకు కోపం తెప్పించిన జంతువు ఎంతటిదైనా సరే- ప్రాణాలతో‌ ఉండలేదు: ఈ సంగతి లోకం అంతటికీ తెలుసు. సంజీవకుడు నాతో పోరు కోరటం నిజంగా ప్రళయకాలపు అగ్నిలోకి దూకటమే కదా? అయినా నువ్వే చెప్పు, సంజీవకుడు నాకు ఏం కీడు చెయ్యగలడంటావు?" అన్నది.

అది విని కరటకుడు "మనతో చాలా కాలంగా పరిచయం ఉన్నవాడికి మనగురించిన రహస్యాలు అనేకం తెలిసి ఉంటాయి. అలాంటివాడు అల్పజీవి అయినప్పటికీ, ఏదో ఒక విధంగా మనల్ని సాధించగలడు. ఏలాంటివారైనా ఒకప్పుడు కాకపోతే మరి ఒకప్పుడు పరాకుగా ఉండవచ్చు కదా?, అలా పరాకుగా ఉన్నప్పుడు అల్పుడైన శత్రువుకు కూడా అవకాశం లభిస్తుంది. నీతి తెలిసినవాడు శత్రువుని 'అల్పుడేలే' అని వదిలిపెట్టడు" అన్నది.

అదివిని, పింగళకుడు కొంచెం ఆలోచించి, "మనం ఈ సమయంలో సంజీవకుడికి ఏదైనా కీడు చేశామంటే లోకం మనల్ని నిందిస్తుంది తప్ప, అసలు రహస్యం బయటికి రాదు. లోకంలో రాగల చెడ్డ పేరుకు భయపడాలి. అంతేకాదు, ఆలోచించకుండా త్వరపడి నిర్ణయాలు తీసుకొనే రాజుని చూసి, మంత్రివర్గం విరక్తి పాలౌతుంది. దానివల్ల ఇక పనంతా చెడిపోతుంది.

అందువల్ల, నాకు చివరగా ఏమనిపిస్తున్నదో చెబుతాను- వినండి: దమనకుడు సంజీవకుని దగ్గరికి పోయి, అతనితో- "నువ్వు రాజద్రోహులతో స్నేహం చేస్తున్న సంగతి రాజుగారికి తెలిసిపోయింది. ఆయన చాలా కోపంగా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన దీనవత్సలుడు- దీనుల పట్ల దయగలవాడు- కనుక, నువ్వు నా వెంట వచ్చి, నీ తప్పును ఒప్పుకొని ప్రార్థించినట్లైతే నిన్ను క్షమించగలడు" అని చెప్పు. మనకు చేతనైనంత వరకు కలుపుగోలుగా ఉండటానికే ప్రయత్నిద్దాము. "నీచా: కలహమిచ్ఛంతి-సన్ధిం ఇచ్ఛంతి సాధవ:"- 'నీచులు పోరును కోరతారు; కానీ సజ్జనులు రాజీని ఇష్టపడతారు'- అని పెద్దలు చెబుతారు కదా. ఊరికే వేరుపడాలనుకుంటే దానికి ఎంతసేపు పడుతుంది? మనం సరైన మార్గంలోనే పోదాము. సంజీవకుడు నీ మాటలు విని, అనుకూలుడై, మన దారికి వచ్చినట్లైతే మేలు- లేదంటే తన చేతలకు తగిన ఫలం అనుభవిస్తాడు" అని, దమనకుడిని చూసి- "ఇక నువ్వు పోయిరా. మనం ఇక్కడ మాట్లాడుకున్న విషయాలేవీ అక్కడ ప్రస్తావించకు" అన్నది.

అప్పుడు దమనకుడు "సరే" అని తల ఊపి, మెల్లని నడకలతో సంజీవకుడిని చేరబోయాడు. ముఖంలో దీన భావనతోటీ, వణికే కాళ్లతోటీ తన దగ్గరికి వచ్చిన ఆ నక్కను చూసి సంజీవకుడు ఎదురేగి, తోడ్కొని వచ్చి, తగిన ఆసనం మీద కూర్చోబెట్టి 'ఎందుకు, ఇలా విచారంగా ఉన్నాడు?' అని మనస్సులో అనుకుంటూ, "మీరంతా కులాసాగా ఉన్నారు కదా!" అన్నాడు.

దానికి దమనకుడు నిట్టూరుస్తూ "ఇతరులకు ఊడిగం చేసుకునేవాడికీ, కులాసాకూ ఎంత దూరం! రాజ సేవకుడన్నవాడు చావుకు దగ్గరైనవాడితో సమానం. రాజుగారి అనుగ్రహం, నమ్మకం పొంది ఎక్కువ కాలం సుఖిద్దామను-కునేవాడు, ఎండమావుల్లో పారే ఏటిని చూసి దాహం తీర్చుకునేందుకు పరుగులెత్తేవాడే. రాజుగారి అనుగ్రహానికి ఏకాంతంలోకూడా ఆరాటపడే వెర్రివాడు ధీరుడు అనిపించుకోడు" అన్నది.

అది విని సంజీవకుడు "నీ మాటల తీరును బట్టి చూస్తే ఏదో విశేషం ఉన్నదని తోస్తున్నది" అని, తమను ఒంటరిగా వదలి అవతలికి వెళ్ళమన్నట్లుగా తనకు ఇరువైపులా చూశాడు. దగ్గరలోనే ఉన్న కాటక-పాటకులిద్దరూ వెంటనే లేచి దూరంగా పోయారు. అప్పుడు దమనకుడు కళ్ళతోటే వారివైపు చూపిస్తూ "వీళ్ళను దగ్గర చేసుకోవటమే నీ కష్టాలకు మూలం అయ్యింది" అన్నది. అదివిని సంజీవకుడి మనస్సు భయంతో నిండిపోయింది- "ఏమైంది? అక్కడ ఏం జరిగింది?" అని ఆ ఎద్దు ఆత్రంగా ప్రశ్నించింది దమనకుడిని.
(మిగతాది వచ్చేసారి...)