అనగా అనగా చాలా కాలం క్రితం మాల్యవంతం అనే రాజ్యాన్ని చక్కని రాజు ఒకడు పరిపాలిం‌చేవాడు. అతనికి తగినట్లే ఉండేది, అతని భార్య. సీతారాముల- లాంటి దాంపత్యం వారిది; కానీ వాళ్లిద్దరికీ ఒకటే చింత- సంతానం లేదు.

పిల్లల కోసం రాజు- రాణి నోమని వ్రతం లేదు; చేయని పూజా లేదు. వారి ప్రార్థనలు ఫలించినట్లు, చివరికి రాణికి చందమామ లాంటి కుమార్తె పుట్టింది. ఆమె పుట్టిన రోజును రాజ్య ప్రజలందరూ ఒక పండుగలాగా జరుపుకున్నారు.

రాజు రాణి ఆ పాపకు 'లలిత ప్రియ' అని పేరుపెట్టారు. ఒక్కగానొక కూతురు-కాబట్టి వాళ్లు ఆమె ఏది కోరితే అది ఇచ్చారు; అన్ని విద్యలూ నేర్పారు,; కంటికి రెప్పలాగా చూసుకున్నారు.

ఇప్పుడు ఆ పాపకు యుక్త వయస్సు వచ్చింది, సౌందర్యంలో అప్సరసలను తలదన్నేది ఆమె. రాజు, రాణి ఆమెకిక వివాహం చేయాలని సంకల్పించి, తగిన వరుడి కోసం వెతకసాగారు.

ఒకనాడు, యువరాణి లలితప్రియ ఉద్యానవనంలో తన చెలికత్తెలతో ఆడుకుంటున్న వేళ- ఉన్నట్లుండి మేఘాలు క్రమ్ముకున్నాయి! పెను తుఫానులాగా గాలి చెలరేగింది- వాయు గుండం ఒకటి ఏర్పడి, వాళ్ళు ఆడుకుంటున్న తోట చుట్టూ క్రమ్ముకున్నది!

దాని అనంతరం చూస్తే యువరాణి మాయం! చెలికత్తెలందరూ హాహాకారాలు చేశారు. "నా కుమారైను నా ముందుకు తేవాలి" అని ఏడుస్తూ మూర్చపోయింది రాణి. రాజ్యంలోని ప్రముఖులు అందరూ ఎవరికి వాళ్ళు తలా ఒక దిక్కునా వెతికారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి కానీ యువరాణి జాడ మాత్రం దొరకలేదు!

చివరికి రాజు గారు దండోరా వేయించారు: "ఎవరైతే నా కుమారైను నాకు తెచ్చి ఇస్తారో వాళ్ళకు నా రాజ్యం అంతా ఇచ్చేస్తాను. నా కుమారైను కూడా వారికే ఇచ్చి వివాహం జరిపిస్తాను" అని. రాకుమార్తె అందం గురించి తెలిసిన క్షత్రియ యువకులు అనేక మంది దేశ విదేశాల నుండి వచ్చి యువరాణి కోసం వెతికారు. ఎవరెంత వెతికినా యువరాణి జాడ మాత్రం అంతు చిక్కలేదు.

వచ్చిన వారిలో కొందరు వెతికి-వెతికి వేసారి తమ తమ రాజ్యాలకు వెళ్లి-పోయారు. మరి కొందరు పూర్తిగా‌ అదృశ్యమే అయిపోయారు. చివరికి ఇక ఎవ్వరూ ముం‌దుకు రావటమే మానివేశారు. రాజు-రాణిల విచారానికి మేరలేదు.

అదే రాజ్యంలో నివసించేవాడు, వివేక చంద్రుడనే నిరుద్యోగ యువకుడు. యుద్ధ విద్యలు బాగానే వచ్చినా, ఉద్యోగం మాత్రం ఏదీ రాలేదు. చివరికి అతను మాత్రం ముందుకు వచ్చాడు, యువరాణిని వెతికేందుకు.

రాజ్యంలోని ప్రజలందరూ అతనిని చూసి నవ్వసాగారు కానీ, అతను మాత్రం ధైర్యంగా పోయి రాజు గారి ముందు నిలబడ్డాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, "ఇంత మంది వీరులు, శూరులైన యువ రాజులు చేయలేని పనిని సామాన్యుడివి, నిరుద్యోగివి, నువ్వెలా చేయగలవు? అయినా ఏ పుట్టలో ఏమున్నదో? కానివ్వు" అని చెప్పి, అతనికి కావలసిన సామగ్రి అంతా తయారు చేసి ఇచ్చి, వీడ్కోలు పలికాడు. వివేక చంద్రుడు బయలు దేరి దక్షిణ దిశగా పోసాగాడు. అలా పోయి పోయి చాలా అడవులను, కొండలను, సరస్సులను దాటి పట్టుదలతో ముందుకు సాగాడు.

అట్లా పోతూ ఉంటే వివేకచంద్రుడికి ఒక కొలను ప్రక్కన ఏడుస్తూ కనబడింది ఒక హంస. అతను దాన్ని పలకరించి, "మామూలుగా హంసలన్నీ కలిసి జట్టుగా ఉంటాయి కదా, నువ్వెందుకమ్మా, ఒక్కదానివే ఉన్నావు?" అని అడిగాడు. "మా అమ్మావాళ్లంతా నన్ను వదిలేసి దూరంగా ఆ కొండల అవతల ఉన్న సరస్సుకు ఎగిరిపోయారు. నా కాలుకి దెబ్బతగిలింది. నేను అక్కడికి ఎగరలేను" అని ఏడిచింది హంస. వివేకచంద్రుడు దాన్ని ఎత్తుకొని తీసికెళ్లి, మిగిలిన హంసలతో కలిపాడు దాన్ని.

అవన్నీ సంతోషించి "నువ్వెందుకు, ఈ అడవుల్లో తిరుగుతున్నావు?” అని అడిగాయి. రాకుమార్తె అదృశ్యం గురించి చెప్పిన మీదట, అవి "ఓహో! వాత- రాక్షసుడి పనే ఇది! వాడుండేది ఇక్కడికి దగ్గర్లోనే. కొంత ముందుకి పోయావంటే ఒక పెద్ద మర్రిచెట్టు కనబడుతుంది. దాని ముందు నిలబడి నువ్వు ఈ మంత్రం చదివి "తెరుచుకో" అనాలి. అప్పుడు ఆ చెట్టు తెరచుకొని అక్కడో దారి ఏర్పడుతుంది. అదే వాతరాక్షసుడి ఇల్లు! కానీ జాగ్రత్త! వాడు చాలా భయంకరుడు!" అని చెప్పాయి.

వివేకచంద్రుడు అవి చెప్పిన విధంగానే పోయి, చివరికి ఇంద్రభవనం లాంటి ఒక ఇంటిని చేరుకున్నాడు. అక్కడ ప్రతి వస్తువూ వింత వింతగానే ఉన్నది. అలా లోపలికిపోయాడు- అక్కడ అతనికి ఒక కాళీమాత విగ్రహం కనిపించింది. దానికి రోజూ పూజలు జరుపుతున్నట్లు గుర్తులు కనబడ్డాయి.

మెల్లగా ఆ భవనంలోని గదులన్నిటినీ చూస్తూ పోయాడు వివేకచంద్రుడు. అక్కడ ఒక గదిలో వివిధ దేశాల యువరాణులు కనబడ్దారు. "వాళ్ళలో తమ యువరాణిని గుర్తుపట్టడం చాలా కష్టం" అనుకున్నాడు అతను! కానీ వాళ్లందరిలోకీ అందంగా ఉన్న యువరాణి దగ్గరికి వెళ్లి అడిగితే ఆమే అని తెలిసింది!

అంతలో అతనికి బయట నుండి అడుగుల శబ్దం వినబడింది. వెంటనే అతను పరుగున వెళ్లి ఓ మూలన దాక్కొని చూశాడు.

ఆ వచ్చింది వాతరాక్షసుడే! వాడు నేరుగా లోపలికి వచ్చి యువరాణి దగ్గరికి పోయి ఆమెతో "నువ్వుగనక నన్ను పెళ్లాడితే ఈ ప్రపంచమంతా నా గుప్పిటిలో ఉంటుంది, అప్పుడు నీకు ఏ లోటూ లేకుండా చూసుకొంటాను. నువ్వెందుకు నన్ను కాదంటున్నావు?" అని ప్రాధేయ పడ్డాడు.

వాతరాక్షసుడికేసి చూస్తూ యువరాణి "నీ వికార రూపం, నీ దుశ్చేష్టలు- రెండూ నాకు అసహ్యం కలిగిస్తున్నాయి. ఇంత మందిని బంధించిన నీకు చాలా పాపం వస్తుంది. నీ చావు దగ్గర పడుతున్నట్లున్నది. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు" అన్నది.
వాతరాక్షసుడు పెద్దగా నవ్వి "నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. పున్నమి రోజున కొలనులో స్నానానికి వచ్చిన హంసలన్నీ తాము తెచ్చుకున్న హారాలను ఒకచోట వదిలి వెళ్లి, స్నానం చేసి తిరిగి వస్తాయి. వాటిలో ఒక విచిత్ర హంస వదిలిన హారాన్ని తీసుకొచ్చి, ఈ కాళీమాత మెడలో వేస్తే తప్ప, నేను నశించను. అయినప్పటికీ ఆ పని చేసిన వాడు అంతకంత అనుభవిస్తాడు- నా యీ వికారరూపాన్ని వాడు ధరించాల్సి ఉంటుంది! అంత పని ఎవ్వరూ చెయ్యరు! కనుక నాకిక చావే లేదు! ఇంకా నీకు రెండు నెలల సమయం ఇస్తాను. ఆలోగా నువ్వు నా దారికి రాకపోతే నిన్నూ తినేస్తాను- నీ ఇష్టం!" అని బెదిరించి వాడు ఎక్కడికో వెళ్లిపోయాడు.

చాటు నుండి అంతా విన్న వివేకచంద్రుడు బయటికి వచ్చి, యువరాణికి ధైర్యం చెప్పాడు. తను వెళ్లి హారం తెస్తాననీ, ఓపికతో వేచి ఉండమనీ చెప్పాడు. "కానీ వికార రూపం?" అని బాధపడింది యువరాణి. "ఏమీ పరవాలేదు, ఆ సంగతి మళ్లీ చూద్దాం" అని వివేకచంద్రుడు మళ్లీ హంసల దగ్గరికి వెళ్లాడు. అతను హంసలున్న చెరువును చేరుకునే సరికి సాయంత్రం అవుతున్నది.

పున్నమి చందమామ అప్పుడప్పుడే బయటికి వస్తున్నాడు, ప్రతి హంస ముక్కునా ఒక హారం వ్రేలాడుతున్నది. చూస్తే అన్నీ ఒకేలాగా ఉన్నాయి, అంతలో అక్కడ ఒక విచిత్రం జరిగింది! అన్ని హంసలూ హారాలను ఒకచోట వదిలి వెళ్ళిపోసాగాయి!

చివరికి ఒక అందమైన హంస మాత్రం అక్కడే ఆగింది, అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ హారాన్ని తెచ్చి వివేకచంద్రుడికి ఇచ్చి ఎగిరిపోయింది! అతను కాపాడిన హంసే, అది!

వివేకచంద్రుడు ఆ హారాన్ని తీసుకెళ్లి ఇక్కడ కాళీమాత మెడలో వేశాడో లేదో, అక్కడ రాక్షసుడు పెడబొబ్బలు పెడుతూ మండి బూడిద ఐపోయాడు. అదే క్షణంలో వాడి వికారరూపం కాస్తా వివేకచంద్రుడికి వచ్చేసింది! స్వేచ్ఛ పొందిన యువతులందరూ యువరాణికి, వివేకచంద్రుడికి ధన్యవాదాలు చెప్పి ఎవరి దారిన వాళ్లు వెళ్లారు.

యువరాణి, వివేకచంద్రుడు తమ రాజ్యం చేరుకున్నారు. అయితే సమస్య తీరలేదు: "నువ్వెవరో నాకు తెలీదు, నువ్వు యువరాణిని కాపాడావంటే నాకు నమ్మకం కుదరట్లేదు" అంటూ మనసుకు నొప్పి కలిగించేలా మాట్లాడారు రాజుగారు. అయినా యువరాణి, తండ్రిని వారించింది. పూలమాలను తీసుకొని, వికారంగా ఉన్న వివేకచంద్రుడినే వరించింది. అంతే! వివేకచంద్రునికి పూర్వరూపం తిరిగి వచ్చేసింది! యువరాణి ప్రేమ వల్ల రాక్షసుడి వికార రూపపు పొరలన్నీ తొలగి పోయాయి. రాజుగారు క్షమాపణ చెప్పి తన కుమార్తెను వివేకచంద్రుడికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపించారు!