చాలా కాలం క్రితం పర్షియా దేశంలోని ఒక పట్టణంలో కొందరు సూఫీలు కలిసి ఒక హోటల్ నడిపించేవాళ్ళు. సూఫీ బాటసారులు, యాత్రీకులు వేరే చోట్లకాక, ఆ హోటల్లో‌ దిగేందుకు ఇష్టపడేవాళ్ళు.

ఒకసారి సూఫీ యాత్రికుడొకడు, చాలా దూరం నుండి ఒక మంచి గాడిదనెక్కి ప్రయాణిస్తూ, చీకటి పడే వేళకు ఆ సత్రం చేరుకున్నాడు. హోటల్ యజమాని అతన్ని సాదరంగా ఆహ్వానించి, అతను ఉండేందుకు ఒక చక్కని గది చూపించాడు. అతని గాడిదను ప్రక్కనే గల తమ జంతుశాలలో వదలమన్నాడు. యాత్రికుడు స్వయంగా తన గాడిదను అక్కడికి తీసుకెళ్ళి, ముందుగా దానికి పచ్చిగడ్డి, దాణా పెట్టించి, "బాబూ! నా యీ గాడిదంటే నాకు చాలా ఇష్టం; దీన్ని జాగ్రత్తగా చూసుకో. ఇలాంటి మేలురకం గాడిద ఖరీదు కూడా‌ బాగా ఎక్కువ" అని దాన్ని అక్కడి కాపలావాడికి అప్పగించి వచ్చాడు.

అదే రోజున, ఆ హోటల్లో దిగిందొక అల్లరి కుర్రాళ్ల మూక. వాళ్ళు అందరూ‌ మామూలుగా బాగా కట్టుదిట్టాలలో పెరిగినవాళ్ళే- అయితే అవకాశం దొరికితే చాలు- స్వేచ్ఛను- అదెంత క్షణికమైనా సరే- అనుభవించాలని తపన పడే రకాలు. ఆ రోజు సాయంత్రం నుండి బాగా ప్రొద్దు పోయేంతవరకు పార్టీ చేసుకోవాలని సంకల్పించారు వాళ్ళు.

అయితే వాళ్ల దగ్గర డబ్బులెక్కడివి? మన యాత్రికుడి గాడిదను చూడగానే వాళ్ళ కళ్ళు మెరిసాయి. వాళ్ళంతా జంతుశాల కాపలావాడిని మాయచేసి, ఆ గాడిదను తీసుకెళ్ళి, గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశారు. ఆ డబ్బులతో పిండి, మాంసం, నెయ్యి, నూనె, కూరగాయలు, చక్కెర, ఇంకా చాలా సారాయి- ఇవన్నీ కొనేశారు. అటుపైన అందరూ వంట పనుల్లోను, పార్టీకి కావలసిన ఇతర సరంజామా అంతా సిద్ధంచేసుకోవటంలోను మునిగారు.

కొందరు ఆ గాడిద యజమాని ఉన్న గదికి వెళ్ళి, ఆయన్ని కూడా పార్టీకి రమ్మని మర్యాదగా ఆహ్వానించి మరీ వచ్చారు!

ఎనిమిది గంటలయ్యేసరికి వంట అంతా సిద్ధమైంది. గది అలంకరణ పూర్తైంది; సంగీతం-వగైరాలన్నీ సిద్ధం అయ్యాయి. గదినిండా పెద్ద పెద్ద తివాచీలు పరిచారు. వండిన పదార్థాలన్నిటినీ‌ఆ తివాచీలమీద, గది మధ్యలో, పెద్ద పెద్ద పింగాణీ పాత్రల్లో పెట్టారు. అయితే ఇంకా గాడిద యజమాని రాలేదు.

అందుకని, వాళ్ళు ఆయన్ని సగౌరవంగా పిలుచుకు వచ్చేందుకుగాను ఒక మనిషిని పంపారు- వెంట ఉండి పిలుచుకు రమ్మని. ఆయన రాగానే అందరూ ఆయన్ని రాజును పలకరించినట్లు పలకరించారు; ప్రత్యేక అతిథికోసం ఉంచిన సీట్లో కూర్చోబెట్టారు. ఆపైన ఇక అందరికీ వంటకం తర్వాత వంటకం వడ్డించారు. అందరూ తింటూ వంటవాళ్ళని మెచ్చుకున్నారు విపరీతంగా.

విందు సగంలో ఉందనగా సారాయిల్ని తెచ్చారు: రకరకాల రుచుల సారాయిలు; రకరకాల రంగుల సారాయిలు; కొత్తది-పాతది-మేలురకంది- ఇట్లా రకరకాల సారాయిలు. అక్కడ ఉన్నవాళ్ళు అందరూ తాగారు. సారాయి గొంతులోకి జారినకొద్దీ వాళ్ల పట్టు జారిపోయింది. కొందరు నవ్వుతున్నారు; కొందరు పగలబడి నవ్వుతున్నారు; కొందరు తూలుతున్నారు; కొందరు మామూలుగా పాడటం మొదలుపెట్టారు- గదిలో శబ్దాల స్థాయి బాగా పెరిగింది- చివరికి అందరూ సంగీతంమీదా, నాట్యం మీదా పడ్డారు. తినటం, తాగటం, పాడటం, నాట్యం చెయ్యటం: అందరూ ఒళ్ళు మరచిపోయారు.

వాళ్లలో ఒకడు గాడిద మీద పాట కట్టాడు- గాడిద యజమానితో సహా అందరూ‌గొంతులు కలిపారు ఉత్సాహంగా- జగతిలోని జీవాలల్లో
ఉత్తమమైనది గాడిద
అది గాడిద గాడిద గాడిద!
జంతు జాతిలో
అత్యుపయోగం గాడిద
అది గాడిద గాడిద గాడిద!
ఎవరేం తిన్నా దానికి మూలం గాడిదే
అది గాడిద గాడిద గాడిదే!
ఎవరేది త్రాగినా ఇచ్చేదా గాడిదే
గాడిద గాడిద గాడిదే!
గాడిద పాటనే అందరూ మార్చి మార్చి పాడారు: రాగాలు కట్టి; విరగ్గొట్టి పాడారు. విచిత్రం ఏంటంటే 'ఆ గాడిద తనదే' అని ఎరుగని గాడిద యజమాని కూడా‌ ఆ పాటల్లో మునిగి తేలాడు! అట్లా మొదలైన పార్టీ రాత్రంతా కొనసాగింది. గాడిద యజమాని బాగా అలసిపోయి, రాత్రి రెండుగంటల ప్రాంతంలో తన గదికి వెళ్ళి హాయిగా గుర్రుకొట్టి నిద్రపోయాడు.

మర్నాడు ఇక అతను లేచి, సామాన్లు సర్దుకొని ప్రయాణానికి సిద్ధమయ్యేసరికి మధ్యాహ్నం కావచ్చింది. ఆ సమయంలో గాడిదకోసం జంతుశాలకు వెళ్ళిన అతనికి, గాడిద బదులు ఖాళీ గుంజ దర్శనమిచ్చింది! కొంచెంసేపు వెతుక్కున్న తర్వాత, అతను కాపలాదారును పిలిచి అడిగాడు: "గాడిద ఏమైంది?" అని.

"అయ్యా! తమరి గాడిదని ఆ కుర్రాళ్ళంతా కలిసి తీసుకెళ్ళి అమ్మేశారండి! ఆ డబ్బులతోటే నిన్న రాత్రి పార్టీ‌జరిపారండి!"అన్నాడు కాపలావాడు, నిజాయితీగా.

"కానీ నేను గాడిదను నీ సంరక్షణలోనే గదా, వదిలింది? నీదే బాధ్యత. నేను నిన్ను పోలీసులకు అప్పగిస్తాను" అన్నాడు యాత్రికుడు, వేడెక్కిపోతూ.

"ఈ కుర్రాళ్ళు సార్! ఎవ్వరిమాటా వినరు. వీళ్ళనెవ్వరూ ఆపలేరు- పోలీసులైనా సరే. నేనేమైనా ప్రయత్నించి ఉంటే నన్నూ నాలుగు వాయించేవాళ్ళు" అన్నాడు కాపలాదారు, వినమ్రంగా.

"అలాగైతే నువ్వు కనీసం నాతో చెప్పి ఉండవచ్చునే!" అన్నాడు యాత్రికుడు బాధగా.

"నేను మీకు చెప్పాలని విశ్వప్రయత్నం చేశాను సార్! అయితే మీరు ఆ సమయానికి తినటంలోను, త్రాగటంలోను బిజీగా ఉండి, నేను చెప్పేదాన్ని అస్సలు పట్టించుకోలేదు. మీరు ఆ గాడిదపాట పాడుతున్నప్పుడైతే, నేను మీ ప్రక్కకు వచ్చి, మీ చెయ్యిపట్టుకొని లాగి, మిమ్మల్ని అవతలికి తీసుకుపోయేందుకు కూడా ప్రయత్నించాను. అయితే మీరు నా చెయ్యి వదిలించుకొని, మళ్ళీ వాళ్ళ మధ్యన చేరి, ఎంత గట్టిగా- ఎంత సంతోషంగా కేకలు వేస్తూ నాట్యం చేశారంటే, నేను ఇక 'ఏంజరిగిందో‌మొత్తం మీకూ తెలుసేమో, ఆ కుర్రాళ్ళు మీ అనుమతితోనే అదంతా చేశారేమో' అనుకొని ఊరుకోవాల్సి వచ్చింది!" అన్నాడు కాపలాదారు.

ఆలోచించగా 'అతను చెప్పిందంతా నిజమే' అని తోచింది యాత్రికుడికి. తను గాడిద పాట పాడుతున్నప్పుడు ఇతను నిజంగానే తనని ప్రక్కకి లాక్కెళ్ళాడు! తనే, అతని చేయి విదిలించుకొని, మళ్ళీ వెళ్ళి గుంపుతో పాటు గోవిందా కొట్టాడు! ఇప్పుడు, ఇక తప్పులో తనకూ భాగం ఉందని తెలిశాక, పోలీసుల దగ్గరికి పోయే ఆలోచనను విరమించుకున్నాడు అతను. "జరిగిందేదో జరిగిపోయింది- నా తప్పూ ఉంది. ఇప్పుడు చింతించి ప్రయోజనం లేదు" అనుకొని, పడుతూ లేస్తూ వచ్చినదారి పట్టాడు.

అయితే ఆరోజున అతనికి ఒక మంచి గుణపాఠం లభించింది: "మెలకువతో ఉండి వాస్తవాన్ని చూడాలి తప్పిస్తే, ఇలా వ్యసనాలకు బానిసై, మత్తులో మునిగి తేలి, ఆ తాత్కాలిక ఆనందాన్నే సుఖం అనుకుంటే నష్టమే తప్ప- ఏమాత్రం‌ ప్రయోజనం లేదు. తను ఇంతకాలమూ అర్రులు చాచిన సారాయి-మాంసాల మత్తు-రుచీ తాత్కాలికాలు. వాటికి లోబడే బదులు, తనలోకి తాను తొంగి చూసుకొని, ఏది సత్యమో వెతికేది మేలు" అని అతనికి అర్థమైంది!