అనగనగా ఒక ఊళ్లో రామయ్య అనే ధనవంతుడు ఒకడు ఉండేవాడు. అతనికి ఒక్కడే కొడుకు- హరి. వాడు ఎప్పుడూ క్రికెట్ అంటూ తిరిగేవాడు. బడికి వెళ్ళకుండా క్రికెట్ ఆడేవాడు. రామయ్య మాత్రం ఎప్పుడూ "బడికి పోరా" అని పోరుతుండేవాడు హరిని . హరి మాటల్ని పెడచెవిన పెట్టేవాడు.

అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. అనుకోకుండా ఒకరోజున రామయ్య స్నేహితుడు ధనయ్య వచ్చాడు, వాళ్ల ఇంటికి. రామయ్య ధనయ్యతో తన కొడుకు గురించి చెప్పుకొని బాధపడ్డాడు.

అంతా విన్న తర్వాత ధనయ్య రామయ్యతో "ఒకసారి నీ కొడుకును మా ఇంటికి పంపరాదూ?" అన్నాడు. "సరేలేరా! అలాగే పంపుతాను" అన్నాడు రామయ్య. మరునాడే కొడుకుని ధనయ్య ఇంటికి పంపాడు కూడా. సరే అని, హరి ధనయ్య ఇంటికి బయలు దేరివెళ్లాడు.

ధనయ్య వాడిని లోపలికి పిలిచి "ఒరే హరీ! నీకు చదువు అంటే ఇష్టం లేదా?" అని అడిగాడు. "లేదు మామయ్యా! నాకు క్రికెట్ అంటే ఇష్టం!" అన్నాడు హరి. ధనయ్య కొంచెం సేపు ఆలోచించి "హరీ! నీకు ఒక కథ చెప్తాను విను" అని ఇట్లా చెప్పటం మొదలుపెట్టాడు:

"అనగా అనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. అది ఒక రోజున ఎక్కడ నుండో ఒక మాంసపు ముక్కను తీసుకొని వచ్చి, ఒక చెట్టు మీద కూర్చొని తినటం మొదలు-పెట్టింది.

అంతలో అటు ప్రక్కగా వెళ్తున్న నక్క ఒకటి దానిని చూసింది. కాకి దగ్గరకు వచ్చి "కాకిబావా! కాకిబావా! నువ్వు ఎంత తియ్యగా పాడుతావో, కోకిల కంటే తియ్యగా పాడుతావు" అన్నది.

కాకి మాంసం ముక్కను కాళ్ళ మధ్యన పెట్టుకొని, "నక్కబావా! నేను ఏడో తరగతి వరకు చదువుకున్నాను. మూడవ తరగతిలోనే కాకి-నక్క కథను చదివేశాను. నన్ను నువ్వు మోసం చేయాలనుకున్నావా , నాకేం చదువు రాదనుకున్నావా?” అని నవ్వింది.

నక్క ఇంకేమీ చేయలేక, సిగ్గుతో తల వాల్చుకొని వెళ్ళిపోయింది. కాకి చక్కగా మాంసం ముక్కనంతా తిన్నది. ధనయ్య కథని ముగించి "హరీ! విన్నావు కదా! చదువుకుంటే ఎంత మేలు!” అన్నాడు.

ఆ మాటలు విన్న హరిలో ఏదో కలవరం మొదలైంది. ఆలోచలో పడ్డాడు మరుసటి రోజునుండీ బడికి వెళ్లటం మొదలు పెట్టాడు.

ఇక ఆ సంవత్సరం వాడు చాలా పట్టుదలగా చదివాడు, బడిలో ఉత్తమ విద్యార్థిగా పేరు పొందాడు. "ఒక్క కథ వల్ల ఎంత మార్పు వచ్చింది!" అని రామయ్యతో పాటు ధనయ్య కూడా ఆశ్చర్యపడ్డాడు.