అనగనగా ఒక ఊళ్ళో ఒక గాడిద ఉండేది. చాలా ఏళ్ళు కష్టపడి పనిచేసీ పనిచేసీ ఆ గాడిద ముసలిదైపోయింది. వాళ్ళ యజమాని ప్రతి రోజూ సణగటం మొదలుపెట్టాడు- "దీనికి తిండి పెట్టటం కూడా దండగ!" అని. దాంతో ఆ గాడిదకు మనసు విరిగిపోయింది. చివరికి అది ఒక రోజున ఇంట్లోంచి పారిపోయి, పట్నం బయలుదేరింది. పోతూ ఉంటే, దారిలో దానికి ఒక వేటకుక్క కనబడింది. అది రొప్పుతూ-రోజుతూ నిలబడి ఉన్నది, ఒక చెట్టుక్రింద. "ఏంటి కుక్క బావా! అట్లా రొప్పుతున్నావు?" అని అడిగింది గాడిద.

"నేను ముసలిదాన్ని అయిపోతు-న్నానని, మా యజమాని నన్ను చంపేద్దా-మనుకుంటున్నాడు. అందుకని పారిపో-తున్నాను. కానీ ఎక్కడికి పోయేది?" అన్నది కుక్క.

"అయ్యో అలాగా! నేను పట్నం పోతున్నాను, మరి నావెంట వస్తావా?" అడిగింది గాడిద. సరేనని కుక్క-గాడిద కలిసి బయలుదేరాయి.

కొంచెం దూరం పోయిన తర్వాత వాటికి రోడ్డు మధ్యలో ఒక ఏడుపు ముఖం‌ పిల్లి కనబడింది. అది కూడా ముసలిదైపోతున్నదట. దాన్ని ఎలాగైనా వదుల్చుకుందామని, దాని యజమాను-రాలు దాన్ని పట్టుకొని, నీళ్ళలో ముంచెయ్యబోయిందట! పిల్లి తప్పించు-కొని బయట పడింది. దాని కథ విని, కుక్క-గాడిద దాన్ని తమ వెంట పట్నానికి రమ్మన్నాయి. సరేనని, కుక్క-గాడిద-పిల్లి మూడూ కలిసి బయలుదేరాయి.

అలా ఆ మూడూ‌ నడుచుకొని పోతుంటే, ఒక ఇంటి తలుపు ముందు వాటికి పెద్దగా ఏడుపు వినబడింది. చూస్తే అది ఆ యింటి కోడిపుంజు! వాళ్ల ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారట. "నన్ను కోసి వండేస్తారట!" అని ఏడుస్తున్నదది! కుక్క-గాడిద-పిల్లిల కథలు విని, అది కూడా వీళ్ళతో కలిసి బయలుదేరింది.

అలా అవి నాలుగూ పట్నం దారిలో‌నడుచుకుంటూ పోతుంటే, చీకటి పడేసరికి ఒక అడవి ఎదురైంది. గాడిద, కుక్క చెట్టు క్రింద పడుకున్నాయి. పిల్లి చెట్టు కొమ్మలెక్కింది. కోడిపుంజు చెట్టు చిటారు కొమ్మ ఎక్కింది. ఆ ఎత్తునుండి చూస్తే, దానికి ఒక ఇల్లు కనబడింది. "ఓయ్! ఓయ్! చూడండి! అక్కడ ఒక చక్కని ఇల్లు ఉంది!" అని కేకలేసింది అది. "చలి మొదలు అవుతున్నది-” అని, అందరూ కలిసి ఆ యింటివైపుకు పోయారు. పోగా పోగా వాళ్లందరికీ‌ ఇల్లు కనబడింది- కానీ ఆ యింట్లో ఎవరున్నారో కనుక్కోకుండా ఎలాగ, వెళ్ళేది? అందుకని, గాడిద మెల్లగా వెళ్ళి, కిటికీలోంచి లోపలికి తొంగి చూసి వచ్చింది- "లోపల నలుగురు దొంగలు ఉన్నారు. చాలా తిండి తింటున్నారు వాళ్ళు! మనం తప్పని సరిగా వాళ్ళని తరిమెయ్యాలి. ఎలాగో‌ఒకలాగా మనం నలుగురమే ఈ‌ ఇంట్లో ఉండాలి" అనుకున్నాయి ఆ నలుగురు స్నేహితులూ.

గాడిద మీద కుక్క, కుక్క మీద పిల్లి, అందరికంటే పైన కోడిపుంజూ- ఎక్కి, అన్నీ ఒకేసారిగా అరుచుకుంటూ తలుపులు త్రోసుకొని లోపలికి పరుగెత్తేసరికి, దొంగలంతా అదిరి పడ్డారు: "అమ్మో‌ భూతం! అమ్మో, భూతం!" అని అరుచుకుంటూ వాళ్ళు పరుగెత్తి పారిపోయారు.

గాడిదా, కుక్కా, పిల్లీ, కోడి పుంజూ బాగా కడుపునిండా తిని, కొంచెంసేపు గందరగోళంగా గానా-బజానా ఏర్పాటు చేసుకున్నాయి. ఆపైన, అవి నాలుగూ దీపాలు ఆర్పేసి, పడుకోడానికి పోయాయి. గాడిద ఇంటి వెనక దిబ్బలో పడుకుంది. కుక్క తలుపు వెనకాల చేరింది. పిల్లి పొయ్యి పక్కన బూడిదలో పడుకుంది. కోడిపుంజు ఇంటి దూలం ఎక్కి కూర్చుంది.

ఇంట్లోంచి పారిపోయిన దొంగలు కొంచెం దూరం పోయి దాక్కున్నారు. ఇం‌ట్లో దీపాలన్నీ ఆరిపోయేసరికి, వాళ్ల నాయకుడు "మనం తొందరపడి పరుగెత్తి పారిపోయి వచ్చాం. వాళ్ళెవరో మనుషులే అయిఉంటారు- భూతాలైతే దీపాలు ఆర్పివేయవు" అని ఒక దొంగని పంపించాడు- చూసి రమ్మని.

ఆ దొంగ వచ్చేసరికి ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉంది- పైగా చలి! వాడు ముందుగా వంటింట్లోకి వెళ్ళి, అగ్గిపెట్టెకోసం తడుముకోవటం మొదలుపెట్టాడు. పొయ్యి ప్రక్కన పడుకున్న పిల్లికి వాడి చెయ్యి తగిలేసరికి దానికి ఎక్కడలేని కోపం వచ్చి, గుర్రుమని అరుస్తూ వాడిమీద పడి, గోళ్లతో వాడి ముఖం మీద గట్టిగా గీరింది. వాడుకాస్తా అదిరిపోయి, ఇంటి వెనక్కి పారిపోయి పెరటి తలుపు తీయబోయాడు. అక్కడే పడుకున్న కుక్క వాడి కాలుని పట్టుకొని ఎంతకీ వదల్లేదు. ఈ హడావిడికి వాడు ఠారెత్తిపోయి, లబోదిబోమంటూ పెరట్లోకి పరుగెత్తాడు. అప్పటికే లేచి తయారుగా ఉన్న గాడిద వెనక కాళ్ళు రెండూ ఎత్తి వాడి బుర్ర పగిలేట్లు ఒక్క తన్ను తన్నింది. ఈ గోలకి నిద్రలేచిన కోడిపుంజు అలవాటు కొద్దీ "కొక్కొరొక్కో" అని మొత్తుకోవటం మొదలుపెట్టింది.

నలుగురు మిత్రులు ఒకేసారి మొదలుపెట్టిన ఈ సంగీత కచేరీకి, తనకు ఎట్లా వచ్చాయోకూడా తెలీకుండా వచ్చేసిన గాయాలకి దొంగ పూర్తిగా బెదిరిపోయాడు. పడుతూ-లేస్తూ, ఆయాసపడిపోతూ వాడు పరుగెత్తుకు పోయి, వాళ్ల నాయకుడితో "నాయకా! అక్కడున్నది ఒక్క భూతం కాదు- నాలుగైదు ఉన్నట్లున్నై! పొయ్యి ప్రక్కన ఎవరో ముసలి మంత్రగత్తె ఉన్నట్లుంది- అది నా మీద పడి ముఖం అంతా రక్కింది. ఒక దయ్యం నా కాళ్ళు పట్టుకొని ఎంత గట్టిగా కొరికిందంటే, విడిపించుకోవటమే కష్టమైంది. ఒక నల్ల భూతం పెరట్లో ఉంది- అది ఏదో బండతో నా తల పగలగొట్టుదామని ప్రయత్నించింది. వాళ్ల నాయకుడు దూలం మీద కూర్చొని ఏదో భాషలో "కిక్కీకిక్కీ!" అని నవ్వుతున్నాడు!" అని చెప్పాడు.

ఆ దెబ్బకు దొంగలందరూ బాగా భయపడి వెనక్కి తిరిగిచూడకుండా‌ పారిపోయారు. గాడిద, కుక్క, పిల్లి, కోడిపుంజూ హాయిగా ఆ ఇంట్లోనే ఉండిపోయి, రోజూ సంగీతం సాధన చేసుకుంటూ సుఖంగా ఉన్నాయి!