అనగనగా ఒక ఊళ్లో ఒక అన్న, ఒక తమ్ముడు ఉండేవాళ్ళు. అన్నయ్య చాలా ధనవంతుడు; తమ్ముడు చాలా పేదవాడు. తమ్ముడేమో చాలా మంచివాడు; అన్నేమో చాలా చెడ్డవాడు.

ఒక సంవత్సరం ఏమైందో, తమ్ముడి వ్యాపారం అస్సలు సరిగ్గా జరగలేదు. ఏ పని పెట్టుకుంటే అందులో నష్టం ఎదురైంది. చివరికి కుటుంబం మొత్తం పస్తులుండే పరిస్థితి ఎదురైంది. అందరూ అన్నారు "మీ అన్నని సాయం అడగరాదా? ఆయన వ్యాపారం బాగా జరుగుతున్నది గదా?" అని.

దాంతో ఓ పండగ రోజున అన్నయ్య దగ్గరకు వచ్చాడు తమ్ముడు- "అన్నా! పరిస్థితులు సరిగా లేవు. కష్టంగా ఉంది. నువ్వు కొంచెం డబ్బు సాయం చేస్తే సమస్యల్లోంచి బయటపడతాను. ఆపైన నీ అప్పు తప్పక తీర్చుకుంటాను" అన్నాడు.

అన్నయ్యకు అతన్ని చూడగానే చికాకు వేసింది. "ఛ! పొద్దున్నే లేవగానే ఎవరి ముఖం చూశానో, ఇప్పుడు నీ ముఖం చూడాల్సి వస్తున్నది. ముందు ఇక్కడి నుంచి ఫో!" అంటూ గొంతు పట్టుకొని బయటకు నెట్టేశాడు. తమ్ముడు ముఖం వ్రేలాడ వేసుకొని ఇంటికి పోతుండగా ఓ ముసలివాడు కనిపించాడు. కట్టెలమూటని పైకి ఎత్తుకోవటం రాక కష్టపడుతున్నాడతను. తమ్ముడికి జాలి వేసి అతనికి సాయం చేస్తూ "ఎక్కడి వరకూ తాతా?" అని అడిగాడు. తాత చాలా దూరం పోవాల్సి ఉంది. "అయ్యో అంత దూరం నీవల్ల ఏమవుతుంది?" అంటూ తమ్ముడు ఆ మూటని తనే ఎత్తుకొని అతని ఇంటి వరకూ మోసుకువచ్చాడు.

ఆ ముసలి తాత అతనికి ధన్యవాదాలు చెబుతూ, "దేవుడు నీకు మేలు చేస్తాడు నాయనా! నీకు అన్నీ శుభాలే జరుగుతాయి" అన్నాడు.

అది వినగానే తమ్ముడికి తన కష్టాలు గుర్తుకొచ్చి కళ్లలో నీళ్ళు తిరిగాయి.

అది గమనించి తాత "చూడు బాబూ! కష్టాలు, సుఖాలు అందరికీ వస్తూ పోతూ ఉంటాయి. ఏవీ శాశ్వతంగా ఉండవు. తెలివైనవాడు కష్టాలకు క్రుంగిపోడు; సుఖాలకు పొంగిపోడు" అని చెప్పి, తన ఇంట్లోకి వెళ్ళి ఒక తీపి రొట్టెను తెచ్చి ఇచ్చాడు. "నా మాటలు జాగ్రత్తగా విను నాయనా! నా ఇంటి వెనుక ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవి చివర మూడు మల్బరీ చెట్లున్నై. వాటి వెనుకగా కొండపైకి ఒక కాలి బాట ఉంటుంది.

ఆ బాటకు రెండు వైపులా ముళ్ళ చెట్లే ఉంటాయి. ఒక్క ముల్లు కూడా గుచ్చుకోకుండా జాగ్రత్తగా కొండ ఎక్కి పోతే అక్కడో గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలో ముగ్గురు మరుగుజ్జులు ఉంటారు. వాళ్లకు ఈ రొట్టెను ఇచ్చి, "పని కోసం వెతుకుతున్నాను- మీరు ఏ పని చెబితే అది చేస్తాను" అను. వాళ్ళు ఏ పని చెబితే అది చేయి. అప్పుడు వాళ్ళు నిన్ను మెచ్చుకొని "నువ్వు మంచివాడివిరా, నీకు ఏం కావాలో అడుగు, ఇస్తాం" అంటారు.

అప్పుడు నువ్వు "మీకు వీలైతే నాకు ఒక మాయారోలు ఇప్పించండి- లేకపోతే మీ ఇష్టం" అను. ఆపైన ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది" అని దీవించి పంపాడు.

తమ్ముడికి ఆశ్చర్యం వేసింది. "ముసలాయన ఇంత నమ్మకంగా చెబుతున్నాడు. పట్నం‌ మధ్యలో ఇక్కడ అసలు కొండే లేదు కదా" అనుకున్నాడు. అయితే ఇంటి వెనకగా వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడో అడవి కనిపించింది. ఆ చిన్న అడవిలోనే నిండా భయంకరమైన పాములు ఉన్నాయి.

వాటిని అన్నిటినీ తప్పించుకొని ముందుకెళ్తే నిజంగానే మూడు మల్బరీ చెట్లు కనిపించాయి.

వాటి వెనకనే కాలిబాటకూడా కనిపించింది. ముళ్ళన్నీ తప్పించుకుంటూ జాగ్రత్తగా ఆ బాట వెంబడి నడుస్తూ పోయాడు. కొండపైన ఉన్న కోతులను కూడా తప్పించుకొని పోయి చివరికి తాత చెప్పినట్లే ఓ గుడిసెకు చేరుకున్నాడు.

గుడిసెలో ఉన్న మరుగుజ్జులకు తను తెచ్చిన రొట్టెను ఇచ్చి, తాత చెప్పమన్నట్లే "పనికోసం‌ వెతుకుతున్నాను" అని చెప్పాడు. వాళ్ళు గట్టిగా నవ్వి, "పని కావాలా, మేం తిన్న అన్నం గిన్నెలు పెద్ద కుప్ప పడి ఉన్నై. అవన్నీ శుభ్రం చేస్తావా?" అన్నారు. "సరే" అని తమ్ముడు ఆ గిన్నెలన్నీ శ్రద్ధగా తోమిపెట్టాడు.

వాళ్ళు వాడిని మెచ్చుకొని "నీకేం కావాలి?" అని అడిగి, వాడు కోరినట్లే ఒక మాయరోలును తెచ్చి ఇచ్చారు. "నీకు ఏం కావాలన్నా దీన్ని రుద్ది, మర్యాదగా అడుగు. రోజుకు ఒకసారి మాత్రం పని చేస్తుందిది" అన్నారు. తమ్ముడు వాళ్లకు నమస్కరించి, రోలును రుద్ది, మర్యాదగా "నేను మా ఇంటికి చేరాలి" అని కోరుకున్నాడు. మరుక్షణం వాడు తన ఇంట్లో ఉన్నాడు!

అతను దాన్ని ఇంట్లో దేవుని గూడులో పెట్టి, జాగ్రత్తగా చూసుకుంటూ, రోజూ అదిచ్చే సంపదల్ని వ్యాపారం ద్వారా మరింత వృద్ధి చేస్తూ పోయాడు. అనతి కాలంలోనే అతని అప్పులన్నీ తీరటమే కాక, సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు, మర్యాద, మన్నన ఏర్పడ్డాయి.

అయితే అటువైపున దుర్మార్గుడైన అన్నకు తమ్ముడి పరిస్థితిని చూసి అసూయ వేయసాగింది. అతను ఒక రోజున తమ్ముడి ఇంటికి వచ్చి ప్రేమ నటిస్తూ "తమ్ముడూ! మొన్నటికి మొన్న నువ్వు పరిస్థితి బాగాలేదు" అని నా దగ్గరికి వచ్చావు. ఇంత తక్కువ సమయంలో నీ దశ ఎట్లా తిరిగింది?" అని ఊరికే అడిగినట్లు అడిగాడు. తమ్ముడు అమాయకంగా తనదగ్గరున్న రోలును చూపించాడు.

దుర్మార్గుడైన అన్న రాత్రికి రాత్రి ఆ రోలును దొంగిలించుకొని పోయి, "ఇది ఉంటే నాకు, నా కుటుంబానికి ఇంకేమీ అక్కరలేదు" అంటూ పరదేశం వెళ్ళిపోయేందుకై పడవ ప్రయాణం మొదలెట్టాడు.

ఆ రోజు ఉదయం "మీ తమ్ముని మాటలు నమ్మి ఇట్లా బయలుదేరాం. ఇంతకీ ఈ రోలు మనం కోరుకున్నది ఇస్తుందా?" అన్నది అతని భార్య అనుమానంగా. అన్న "ఇస్తుంది" అంటూనే రోలుని రుద్ది, నాకు లెక్కలేనంత బంగారం కావాలి" అని కోరుకున్నాడు.

మరుక్షణం రోలులోంచి బంగారం రావటం మొదలైంది. ఇంక ఏం చేసినా ఆ బంగారం ప్రవాహం ఆగలేదు. దాని బరువుకు వాళ్ల పడవ, పడవతోబాటు రోలు, అన్న కుటుంబం మొత్తం సముద్రం పాలైంది.