అడవిని ఆనుకొని ఉన్న ఊళ్లో జంగయ్య అనే రైతు ఉండేవాడు. ఒకసారి కట్టెలు కొట్టేందుకు వెళ్ళినప్పుడు అతనికి పిల్ల ఏనుగు ఒకటి కనిపించింది. తల్లినుండి, గుంపునుండి ఎలా విడిపోయిందో ఏమో గాని, అది సొమ్మసిల్లి పడిపోయి ఉండింది. జంగయ్య దానికి తన దగ్గరున్న నీళ్లను త్రాపి, విసిరి, సేద దీరేట్లు చేసాడు. అయితే దానికి ఇంకా తనంతట తాను అడవిలోకి వెళ్ళే వయసు లేదు; దాన్ని విడిచి పోయిన ఏనుగుల గుంపు అప్పట్లో అక్కడికి వస్తుందని ఆశా లేదు!

దాంతో 'ఏం చెయ్యాలి?' అని ఆలోచించిన జంగయ్య దాన్ని తనతో పాటు ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటికి జంగయ్య పిల్లలు సుమన్, కవిత ఇద్దరూ చిన్నవాళ్ళు.

వాళ్లు ఆ ఏనుగుగున్నని చూసి మురిసిపో-యారు. దానికి అదీ ఇదీ తినిపించటం నుండి, పాలు త్రాగించటం నుండి, స్నానం వగైరాలన్నీ‌ ఆడుకుంటూ చేసారు వాళ్ళు. ఏనుగు గున్న కూడా కొద్ది రోజుల్లోనే వాళ్ళతో‌ ఎంచక్కా కలిసిపోయింది.

ఐతే ఏనుగులు పెంపుడు జంతువులు కాదు. వన్య ప్రాణులు. వాటిని పెంచుకోవటం చట్టరీత్యా నేరం. ఆ సంగతి చెబుతూ జంగయ్య 'దీని ఆరోగ్యం బాగాలేదని కదా, ఇంటికి తెచ్చింది? ఇప్పుడింక దీని ఆరోగ్యం‌ బాగైపోయింది. అందుకని దీన్ని అడవిలో వదిలెయ్యాలి' అంటూ వచ్చాడు. కానీ‌ పిల్లలకు అది ఇష్టం లేదు. వాళ్ళకి దాన్ని తమతోపాటే ఉంచుకోవాలని, తమతోపాటే బడికి తీసుకెళ్ళాలని ఉండింది.

ఒక రోజున వాళ్ళు దాన్ని వెంట బెట్టుకొని బడికి బయలుదేరారు. అది కూడా సంతోషంగా తొండం ఊపుకుంటూ బయలు దేరింది వాళ్ళతోబాటు. పిల్లలు అడవి అంచులకు చేరే సరికి అడవిలో నుండి ఏనుగుల అరుపులు వినిపించాయి. వాటిని వినగానే గున్న ఏనుగు టక్కున నిలబడిపోయి, తొండం ఎత్తి గట్టిగా అరిచి, ఒక్కసారిగా అడవిలోకి పరుగు పెట్టింది. "ఏయ్! గున్నా! ఆగు! ఎటు?!" అంటూ పిల్లలు దాని వెంట పడ్డారు గాని, అది ఆగితేగా? మోటర్ సైకిల్ దూసుకు- పోయినట్లు దూసుకు పోయింది.

అది పోయిందని కవిత ఏడవటం మొదలెట్టింది. సుమన్‌ కొంచెం పెద్ద పిల్లాడు కదా, వాడికి ఏం చేయాలో తోచలేదు. "ఇద్దరం ఇక్కడే కొంచెం సేపు ఆగుదాం. అది వచ్చేస్తుందిలే" అన్నాడు చెల్లెలితో. ఒక పదిహేను నిముషాల తర్వాత వాళ్ల ముందున్న పొదలు గలగలమన్నాయి. చూస్తే ఒక పెద్ద ఏనుగు! దాని తొండంతో‌ ఆటలాడుకుంటూ గున్న ఏనుగు ఉన్నది. దాని ముఖంలో సంతోషం స్పష్టంగా కనిపిస్తున్నది.

"హేయ్! గున్నా!" అంటూ కవిత దాని దగ్గరికి పరుగు పెట్ట బోయింది కానీ సుమన్ తనని ఆపేసాడు. "చూడు చెల్లెమ్మా! ఆ పెద్ద ఏనుగు ఎవరు? అది మన గున్న వాళ్ల అమ్మ. చాలా రోజులు తప్పిపోయిన గున్న ఇప్పుడే మళ్ళీ వాళ్ల అమ్మని కలిసింది. వాళ్ళిద్దరికీ ఎంత ఆనందంగా ఉందో చూసావా? వాటి సంతోషాన్ని మనం చెడగొట్టకూడదు. నాన్న చెప్పట్లేదా, రోజూ? వాళ్ల అమ్మతో ఉంటేనే మన గున్న సంతోషంగా పెరుగుతుంది. ఇప్పుడు ఇది వాళ్ల అమ్మని కలిసింది కాబట్టి, మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదింక" అని చెప్పాడు.

అన్న మాటను అర్థం చేసుకున్న కవిత ఆగిపోయింది. గున్న కూడా ఒకసారి వాళ్ల దగ్గరికి పరుగెత్తుకొచ్చి, తొండంతో‌ ఇద్దరినీ నిమిరింది.

కొంచెం సేపు అట్లా దూరంగానే నిలబడి వీళ్ళిద్దరినీ చూసాక, పెద్ద ఏనుగు వెనక్కి తిరిగి అడవిలోకి నడవటం మొదలెట్టింది. గున్న ఏనుగు కవిత చెయ్యి పట్టుకొని ఊపి, తల్లి వెంటనే గెంతుకుంటూ వెళ్ళిపోయింది. కళ్లలో నీళ్లతోటే గున్నకు టాటా చెప్పారు పిల్లలిద్దరూ.