రంగాపురం చుట్టూ దట్టమైన ఆడవి ఉండేది. ఆ ఊళ్లో ప్రదీప్-కళ అనే అన్నాచెల్లెళ్లు ఉండేవాళ్ళు. వాళ్ళ ఊళ్ళో హైస్కూలు లేదు. పొరుగూరుకు వెళ్ళాలంటే అడవిని దాటి పోవలసిందే.

ఆ సంవత్సరం ఎండాకాలం మొదలవుతున్నదనగా అడవిలో మంటల సమస్య మొదలైంది. పొడి వాతావరణంలో మొదలయ్యే నిప్పు వల్ల, అడవుల్లోని ఎండు గడ్డి అంటుకొని, మంట పెద్దదై, క్రమంగా విస్తరిస్తూ పోతుంది. ఆ దావానలంలో చిన్న మొక్కలే కాదు- పెద్ద పెద్ద చెట్లు కూడా మాడి మసైపోతాయి; అనేక జంతువులు కాలి పోతాయి; క్రూరమృగాలు తప్పించుకొని ఊళ్ళమీద పడతాయి..

అట్లాంటి ఒక రోజున అన్నాచెల్లెళ్ళిద్దరూ‌ బడికి వెళ్తూండగా ఎక్కడో అడవి తగలబడుతున్నట్లు, పొగ! అట్లాగే ఎక్కడినుండో పెద్ద పెద్ద అరుపులు!

'ఏమిటా అరువులు, అన్నయ్యా?" కళ అడిగింది.

"ఏనుగుల అరుపులు!" చెప్పాడు ప్రదీప్.

"ఎందుకు అరుస్తున్నయో, వెళ్ళి చూద్ధామా?" అంది కళ.

ఇద్దరూ రోడ్డు దిగి అడవిలోకి వెళ్ళారు. అక్కడ ఒక తల్లి ఏనుగు, ఒక గున్న ఏనుగు మంటల్లో చిక్కుకొని అరుస్తున్నాయి. వాటి చుట్టూతా కొంత దూరం వరకూ గడ్డి అంటుకున్నది. అవి నిలబడ్డ ప్రదేశం నుండి ఓ ఇరవై అడుగుల దూరాన ఉన్న చెట్లన్నీ అంటుకొని మంటలు క్రక్కుతూన్నాయి. ఎటువెళ్తే తప్పించుకుంటామో తెలీని పరిస్థితి ఏనుగులకు.

ప్రదీప్ వాళ్ల నాన్న అటవీశాఖలో వాచర్‌గా పని చేసాడు. అడవిలో చెలరేగే దావానలాలని ఎలా ఆపాలో ఆయనకు తెలుసు. ఒకసారి ఆయన మంటల్ని ఆర్పేటప్పుడు ప్రదీప్ కూడా వెంట ఉన్నాడు. గాలి ఎటుగా వీస్తున్నదో చూసుకోవటం, మంట మనవైపుకు రాని దిశలో ఆర్పుకుంటూ పోవటం, ఈత పట్టలతో మళ్ళీ మళ్ళీ కొట్టటం ద్వారా మంటని అదుపులోకి తేవటం- ఇలాంటివన్నీ చూసి ఉన్నాడు ప్రదీప్. ఆ అనుభవంతో అక్కడే ఉన్న ఈత చెట్ల బర్రలు నాలుగు విరిచి, వాటితో తన ముందున్న మంటల్ని ఆర్పుకుంటూ ఏనుగుల వైపుకు దారి చేసాడు. కొద్దిగా దారి దొరకగానే ఏనుగులు రెండూ ఆ దారివెంబడి పరుగెత్తుకొని బయటకు వచ్చేసాయి!

ప్రదీప్, కళ ఇద్దరూ రోడ్డు పైననే మంటలనుండి దూరంగా పరుగు తీసారు. ఏనుగులు రెండూ వాళ్లను అనుసరించాయి. కొంచెం దూరం అట్లా పరుగెత్తాక, "ఇక ప్రమాదం లేదు" అనిపించిన చోట ఆగి, ఓ ప్రక్కగా బండ మీద వగరుస్తూ కూర్చున్నారు పిల్లలిద్దరూ. ఏనుగులు వాళ్ల దగ్గరికి వచ్చి, రుద్దుకొని తమ కృతజ్ఞతని వ్యక్తం చేసాయి.

ఆ తర్వాత కూడా అవి ఈ పిల్లలిద్దర్నీ గుర్తు పెట్టుకున్నాయి. వీళ్లు బడికి వెళ్తూన్నప్పుడు ఒక్కోసారి కనబడేవి అవి. అట్లా కనిపించినప్పుడల్లా ప్రేమగా అరుస్తూ తొండాలు ఊపేవి! ఒక్కోసారి వాళ్ల వెంట కొంచెం దూరం నడిచేవి!

రాను రాను పిల్లలు, ఏనుగులు మంచి స్నేహితులైపోయారు. ఆ సంవత్సరం వేసవి సెలవల్లో వాళ్ళు రోజంతా ఆ అడవిలోనే, ఏనుగులతో పాటు తిరిగారు. అడవి మధ్యలో ఉన్న సరస్సులోకి ఏనుగులతో పాటు దిగి ఈత కొట్టేవాళ్లు; ఏనుగులు తొండాలతో వారి మీదికి నీళ్ళు జిమ్మేవి!

అయితే వేసవి తర్వాత ఆ ప్రాంతంలో వానలు పడలేదు. సరస్సులో నీళ్ళన్నీ కూడా క్రమంగా ఇంకిపోయాయి. చూస్తూ చూస్తూండగానే మెల్లగా అడవంతా ఎండిపోయింది.

మిగతా జంతువులతో బాటు ఈ‌ ఏనుగులు కూడా ఎటో దూరంగా వెళ్ళిపోయాయి. 'మిత్రులు వెళ్ళిపోయారే!' అని బాధ పడుతున్న చెల్లిని ఓదార్చాడు ప్రదీప్- "దాహం వేస్తే త్రాగేందుకు కూడా ఇక్కడ నీళ్ళు లేవు. చూసావుగా, జంతువులకు ఎన్ని కష్టాలుంటాయో?! మన ఏనుగులకు ఏమీ‌ కాలేదు- లోపలి అడవిలోకి వెళ్ళాయి. మళ్ళీ ఎప్పుడో, ఇక్కడి వాతావరణం మారాక మళ్ళీ‌ వస్తాయి. బాధ పడకు!" అని. అప్పటినుండీ వాటికోసం ఇంకా ఎదురు-చూస్తూనే ఉంది కళ. అవి ఎక్కడున్నాయో, ఎప్పుడొస్తాయో- వాటికి వీళ్ళు గుర్తున్నారో, లేరో మరి.